లులూ భూబాగోతంపై రేపు అఖిలపక్ష సమావేశం

all party meeting on luloo mall scam - Sakshi

హోటల్‌ మేఘాలయలో వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహణ

వైఎస్సార్‌సీపీ నగర అధికార ప్రతినిధి పీతల మూర్తియాదవ్‌

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): లులూమాల్‌ ఇంటర్నేషన్‌ అనే ప్రైవేటు సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన భూములను రద్దు చేయాలనే డిమాండ్‌తో బుధవారం హోటల్‌ మేఘాలయలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి పీతలమూర్తియాదవ్‌ తెలిపారు. పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్కే బీచ్‌ పరిసరాల్లో అత్యంత ఖరీదైన సుమారు 13.83 ఎకరాలను లులూ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌కు కేటాయించడం దారుణమన్నారు. మార్కెట్‌లో రూ.900 కోట్ల విలువైన ఈ భూమిని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వుడా, జీవీఎంసీకి మాత్రమే కేటాయించాలన్నారు.

రూ.వేల కోట్ల విలువైన భూముల కేటాయింపుల వెనక భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అతి పెద్ద నగరంగా ఎదుగుతున్న విశాఖ నగరంలో ప్రభుత్వ అవసరాలు, ప్రజోపయోగ కార్యక్రమాల నిమిత్తం భూములను పరిరక్షించాలని కోరారు. మూడేళ్లుగా కన్వెన్షన్ల కోసం రూ.70 కోట్లు ఖర్చు చేశారని, ప్రభుత్వం ఈ సొమ్ముతో సొంత కన్వెన్షన్‌ నిర్మించి ఉండాల్సిందని సూచించారు. సీఎంఆర్‌కు చెందిన విశ్వప్రియ ఫంక్షన్‌ హాలును ఖాళీ చేయించి, దీనికి బదులుగా వేర్వేరుగా చోట్ల స్థలాల కేటాయింపు చట్ట విరుద్ధమన్నారు. సీఆర్‌జెడ్‌ పరిధిలోని స్థలం తీసుకుని 4.13 ఎకరాల భూమి ఇవ్వడం వెనుక భారీ అవినీతి ఉందని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేయాలని డీఆర్‌వోకు వినతిపత్రం అందజేసినట్టు ఆయన చెప్పారు.

వెలగపూడి కనుసన్నల్లోనే భూబాగోతం
తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం నోరు విప్పడం లేదన్నారు. లులూ భూబాగోతం అంతా వెలగపూడి కనుసన్నల్లో జరిగిందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్‌కు భారీ నజరానా అందిందని ఆక్షేపించారు. దీనిపై నిగ్గు తేల్చేందుకు వైఎస్సార్‌ సీపీ కంకణం కట్టుకుందన్నారు. దీనిపై అఖిల పక్షం సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బోనీ శివరామకృష్ణ, బీసీ సెల్‌ అధ్యక్షుడు కె.ఆర్‌.పాత్రుడు, రాష్ట్ర ఎస్సీసెల్‌ జాయింట్‌ సెక్రటరీ ఎ.రాజుబాబు, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top