నాణేనికి రెండోవైపు చూడు!

Again Narendra Modi Targets Lok Sabha Election - Sakshi

గత ఎన్నికల ఫలితాల పునరావృతం అసాధ్యం

పెద్దగా ప్రభావం చూపని బాలాకోట్, ఏశాట్‌

బీజేపీకి కొత్తగా జతయ్యే సీట్లు తక్కువే..

ఐదేళ్ల క్రితం నాటి లోక్‌సభ ఎన్నికలకు, తాజాఎన్నికలకు వ్యత్యాసం బోలెడంత. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి గెలిచిన ఊపు మీదున్న నరేంద్రమోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడటం.. ఆ ప్రభ కారణంగా ఎన్డీయే గద్దెనెక్కడం మనం చూశాం. మరిప్పుడు..?! మోదీ హవా ఇంకా నడుస్తోందా? మరోసారి బీజేపీ అధికారం చేపట్టగలదా.. గత ఎన్నికలకు, ఇప్పటి ఎన్నికలకు మారిన పరిస్థితులను గమనించాల్సిన అవసరం ఆ పార్టీకి ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

ఎవరు ఔనన్నా.. కాదన్నా 2014 నాటి ఎన్నికల్లో జరిగింది.. ఓ అద్భుతానికి తక్కువేమీ కాదు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సాధించిన అభివృద్ధి నినాదంతో, ‘గుజరాత్‌ మోడల్‌’ పేరుతో మీడియా సృష్టించిన ఇమేజ్‌తో కోట్లకు కోట్లు గుమ్మరించి అమిత్‌ షా సృష్టించిన సోషల్‌ మీడియా ప్రచార రథమెక్కిన మోదీ ఓ వికాస పురుషుడిగా కనిపించిన మాట వాస్తవం. అయితే ఐదేళ్ల తరువాత చూస్తే.. పరిస్థితి అసాధారణ రీతిలో క్లిష్టతరమైంది. ఈసారి గట్టెక్కడం అంత సులభం కాదన్న అభిప్రాయం బీజేపీ నేతల మొహాల్లోనూ కనిపిస్తోంది. బాలాకోట్‌ దాడులు, యాంటీ శాటిలైట్‌ క్షిపణి వంటి అంశాలతో జాతీయవాద భావాలను రెచ్చగొట్టడం ద్వారా మరిన్ని ఓట్లు రాబట్టుకోవాలనుకున్న ప్రణాళిక కూడా ఆశించిన ఫలితాలివ్వడం లేదన్నది విశ్లేషకుల అంచనా. ఈ అంశాలపై వారు ఆశించినంత స్థాయిలో చర్చ జరక్కపోవడం బీజేపీ నేతలనూ కలవర పరుస్తోందని వార్తలు వస్తున్నాయి.

లెక్కలు తప్పుతున్నాయ్‌..
కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలకు, ప్రధాని నరేంద్రమోదీ ఆకర్షణ కూడా తోడవడంతో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లుగా రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్లపై ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడంలో అధికార పార్టీ విఫలమైందని విశ్లేషకుల అంచనా. ‘ద హిందూ’ దినపత్రిక వరుసగా ప్రచురించిన కథనాలు.. అందుకు అధికార పార్టీ స్పందించిన తీరు ప్రజల్లో కొన్ని అనుమానాలు లేవనెత్తిందని.. ఈ అంశం ద్వారా బీజేపీకీ కొద్దోగొప్పో అవినీతి మరక అంటుకున్నట్లు అయ్యిందని వీరు అంటున్నారు.
ఇంకోవైపు.. బీజేపీ దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, కర్ణాటకపై ఎక్కువగా ఆధారపడుతోందని, ఇది కూడా ఆ పార్టీకి కలిసివచ్చేదేమీ కాదని వీరు చెబుతున్నారు. తమిళనాడులో అసమ్మతి సెగలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకేతో జట్టు కట్టడం బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశాలే ఎక్కువ. శశికళ కుమారుడు దినకరన్‌ జయలలిత పేరు చెప్పుకుని ఏఐఏడీఎంకే ఓట్లను చీలుస్తారని, ఇది కాస్తా డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి లాభదాయకంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. 2014లో ఏఐఏడీఎంకే మొత్తం 39 స్థానాల్లో 37 గెలుచుకోగా.. ఈసారి డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి అత్యధిక స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీపోల్‌ సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం.

కేరళలో కాంగ్రెస్‌ మెరుగు?
కేరళ విషయాన్ని తీసుకుంటే.. ఈసారి అక్కడ కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్‌ కూటమి 2014లో 11 స్థానాలు గెలుచుకోగా.. ఈసారి ఇంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రీపోల్‌ సర్వేలు సూచిస్తున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 17 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ తొమ్మిది, జేడీఎస్‌ రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్, జేడీఎస్‌ రెండూ వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఈ రెండు పార్టీలూ కూటమిగా ఏర్పడ్డాయి. 20 స్థానాల్లో కాంగ్రెస్, ఎనిమిది స్థానాల్లో జేడీఎస్‌ పోటీ పడుతున్నాయి. ఫలితంగా గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు ఈ కూటమి గెలుచుకుంటుందని విశ్లేషకుల అంచనా. బీజేపీతో పోలిస్తే కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉండటం కాంగ్రెస్‌కు లాభించే మరో అంశం. జేడీఎస్‌కు ఉన్న 11 శాతం ఓట్లలో ఏ కొన్ని చేరినా కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు లభించడం ఖాయం.

హిందీ బెల్ట్‌ పరిస్థితి?
దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌తోపాటు హిందీబెల్ట్‌గా చెప్పుకునే బిహార్, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీకి మునుపటి స్థాయిలో ప్రజాదరణ లేదని నాణేనికి మరోవైపు చూస్తున్న వారి అంచనా. గత డిసెంబర్‌లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 2013లో గెలుచుకున్న స్థానాల్లో దాదాపు 180 కోల్పోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ 162 స్థానాలను గెలుచుకోవడం గురించి చెప్పుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే బీజేపీ 2013తో పోలిస్తే 48 శాతం ఓటర్ల మద్దతును కోల్పోగా.. కాంగ్రెస్‌కు రెట్టింపు కంటే ఎక్కువ సంఖ్యలో మద్దతు లభించిందన్నమాట. ‘ఇండియా స్పెండ్‌’ అనే వెబ్‌సైట్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంలో మొత్తం 678 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌కు 305, బీజేపీకి 199 సీట్లు ఉన్నాయి. వీటి ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికలను అంచనా వేసినప్పుడు బీజేపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయి.

యూపీ, బిహార్‌లో
గత ఎన్నికల్లో యూపీ, బిహార్‌లలో బీజేపీ తన ప్రత్యర్థులపై ఘన విజయం సాధించినప్పటికీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రాష్ట్రాలన్నింటిలో 120 వరకు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. సమాజ్‌వాదీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ జతకూడటం కాషాయ పార్టీకి నష్టం చేసేదే అని అంచనా. గత ఎన్నికల్లో 41.3 శాతం ఓట్లతో బీజేపీ 71 స్థానాలు గెలుచుకోగా ఎస్పీ, బీఎస్పీ ఉమ్మడి ఓటు బ్యాంకు 41.8 శాతంగా ఉంది. రాష్ట్రీయ లోక్‌దళ్‌కు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లనూ కలుపుకుంటే.. ఈసారి ఎస్పీ, బీఎస్పీల కూటమికి యూపీలో ఆధిక్యం లభించే అవకాశాలు ఎక్కువ. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల మైనార్టీ ఓట్లు కొన్నింటిని తన వైపు మళ్లించుకుంటుందని అనుకున్నా బీజేపీకి పడే అగ్రవర్ణాల ఓట్లనూ ఈ పార్టీలు ప్రభావితం చేయగలవు. బిహార్‌లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. బీజేపీ, జేడీయూ.. చిన్నచిన్న పార్టీలను కలుపుకున్న మహాగఠ్‌ బంధన్‌ను ఎదుర్కోనుంది. ఈ కూటమిలో ఎన్డీయే నుంచి వేరుపడ్డ ఉపేంద్ర ఖుష్వహా, జితిన్‌ రామ్‌ మాంఝీ కూడా ఉన్నారు. దళితులు, వెనుకబడిన తరగతుల వారు ఎక్కువగా ఉన్న స్థానాల్లో వీరు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయగలరు!!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top