మాయ మాటలు నమ్మొద్దు

Adimulapu Suresh Fires On TDP Leaders - Sakshi

నవరత్నాలతోనే అభివృద్ధి సాధ్యం

ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

యర్రగొండపాలెం: అధికార పార్టీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని, ఇప్పటి వరకు ప్రజలను మోసం చేసి దోచుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి పాదయాత్ర చేపట్టి 150 రోజులు అయిన సందర్భంగా బుధవారం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు దొంతా కిరణ్‌గౌడ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సురేష్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మాతో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొంది పార్టీ ఫిరాయించిన వారు త్వరలో ప్రజల ముందుకు వచ్చి మాయమాటలు చెప్తారని, అటువంటి వారికి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నవరత్నాలు అమలులోకి వస్తాయని ఆయన అన్నారు. రైతులు వ్యవసాయం చేసుకోవటానికి రూ.50 వేలు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారని, పింఛన్లు రూ.2 వేలకు పెంచుతామని, అర్హులైన మహిళలకు 45 సంవత్సరాలు నిండితే పింఛన్లు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తామని, యాదవులు, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అడిగిన వారందరికీ రుణాలు అందజేస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. పంచాయతీ కార్యదర్శి ప్రజలకు అందుబాటులో ఉండరని, గ్రామాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌ ఉన్నట్లయితే ఆయనకు తెలియకుండానే నీళ్లు సరఫరా చేస్తారని ఆయన అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం వస్తుందని, నేరుగా గ్రామంలోని సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పార్టీ సీనియర్‌ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్‌.జబీవుల్లా, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.బాలగురవయ్య, మండల రైతు సంఘం అధ్యక్షుడు వి.రామిరెడ్డి  పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top