సర్‌'కార్‌' భేష్‌

Adilabad People Support to TRS party in Lok Sabha Election - Sakshi

‘ఆదిలాబాద్‌ నియోజకవర్గ రోడ్డు షో’లో జనం మనోగతం

రైతుబంధు, బీమా పథకాలపై సానుకూలత

దేశ రక్షణ బీజేపీకే సాధ్యమన్న పలువురు

ఆదిలాబాద్‌.. అటు 44వ నంబర్‌ జాతీయ రహదారి.. ఇటు 61వ నంబరు హైవే.. మరోపక్క కొట్టొచ్చినట్టు కనిపించే మహారాష్ట్ర సంస్కృతి.. భౌగోళికంగానూ, జీవనశైలిలోనూ వైవిధ్యంగా కనిపించే ఈ అటవీ ప్రాంత లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ రోడ్డు షో నిర్వహించింది. రెండు జాతీయ రహదారులతో పాటు.. నియోజకవర్గంలో వ్యాపించిన ఉన్న ఇతర ముఖ్య రహదారులపై ప్రయాణించి.. ప్రజల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేసింది. విచిత్రంగా ఇక్కడ ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌ – బీజేపీ మధ్యనే నెలకొందన్నట్టుగా ‘సాక్షి’తో మాట్లాడిన వారు చెప్పారు. అలాగే, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ప్రకటించిన.. నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ పథకం ఇంకా జనంలోకి వెళ్లలేదన్న విషయమూ వెలుగుచూసింది. టీఆర్‌ఎస్‌ నుంచి జి.నగేశ్, కాంగ్రెస్‌ నుంచి రమేశ్‌ రాథోడ్, బీజేపీ నుంచి సోయం బాపూరావు తలపడుతున్న ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సాగిన ఈ రోడ్డు షోలో ఆయా వర్గాల ప్రజలు ముఖ్య పార్టీల గురించి, ఎన్నికల రాజకీయాల గురించి భిన్నంగా స్పందించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని.. కేంద్రంలో మాత్రం బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని పలువురు తమ మనోగతాన్ని వెల్లడించారు.

‘బంధు, బీమా’ బాగున్నాయ్‌..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్‌ సరఫరా ప్రయోజనకరంగా ఉన్నాయనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిందని, ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం గతంతో పోలిస్తే మెరుగైన అభివృద్ధి సాధించిందని చెప్పారు. రైతుబంధు పథకం ఎంతో నచ్చిందని, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలు బాగున్నాయని జైనథ్‌ మండలానికి చెందిన ఆనంద్‌రావు అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిందని, బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, అధికారంలోకి వస్తే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని తలమడుగు మండలం పల్లి గ్రామానికి చెందిన శశికాంత్‌రెడ్డి తెలిపారు.

 ‘కనీస హామీ’ తెలియదు..
ముఖ్యంగా ఈసారి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై జనం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో బీజేపీకి అవకాశం ఇచ్చామని, ఈసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే, ఇలా చెప్పిన వారికి కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రమైన ‘సామాన్యులకు నెలకు రూ.6 వేలు ఇస్తామనే హామీ’ గురించి తెలియక పోవడం విశేషం. పలువురి నుంచి వ్యక్తమైన అభిప్రాయాల ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీ హామీ ప్రజల్లోకి ఇంకా చేరలేదని తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాలని కోరుకున్న వారు.. కేంద్రంలో మాత్రం మళ్లీ నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా దేశరక్షణ కోసం చేపడుతున్న చర్యలను ప్రస్తావిస్తూ.. కేంద్ర సర్కారు పనితనాన్ని ప్రశంసించారు.  

పింఛన్ల ప్రభావం
పింఛన్ల పెంపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ఆసరా పింఛన్ల పెంపు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణం, కోర్ట–చనాఖా బ్యారేజీ నిర్మాణం, గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివాసీల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందనే ప్రశ్నకు చాలామంది టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. రెండో స్థానంలో బీజేపీకి అవకాశాలు ఉంటాయని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ పనితీరు సంతృప్తికరం
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు విషయంలో సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు.. ఇవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలే విజయం సాధించాలని ఆకాంక్షించడం గమనార్హం. సహజంగా ఆదిలాబాద్‌లో కొంత మత ప్రభావం ఎక్కువ కాబట్టి కూడా ఇటువంటి అభిప్రాయం వ్యక్తమై ఉండొచ్చు. ఇక, కేంద్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనే విషయాన్ని కాకుండా మోదీ మళ్లీ రావాలని కోరుకుంటున్న వారి సంఖ్య పెద్దగానే ఉందనే విషయం వెల్లడైంది. కేంద్రంలో పాలన బలమైన వ్యక్తి చేతిలో ఉండాలని, అందుకే బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించాల్సిన అవసరం ఉందని కొంతమంది అభిప్రాయపడ్డారు.

రోడ్డు షో సాగిందిలా..
 ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని భోరజ్‌ సమీపం నుంచి 44వ నంబరు జాతీయ రహదారి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా సాగే 44వ జాతీయ రహదారితో పాటు రాజీవ్‌ రహదారి, 61వ నంబర్‌ జాతీయ రహదారి, ఇంకా ఇతర ముఖ్య రహదారులపై ‘సాక్షి’ ప్రయాణం సాగింది.

కాంగ్రెస్‌కే చాన్స్‌
గతంలో కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చారు దేశ ప్రజలు. కానీ, మోదీ ప్రభుత్వం ప్రజల ఉపయోగపడేలా పెద్దగా పథకాలు ఏవీ కూడా తీసుకురాలేదు. నోట్ల రద్దుతో ప్రజలకు కష్టాలు మిగిల్చింది.  – కాంతారావ్, తరోడ

రైతు సంక్షేమం..
రైతుబంధు రైతులకు సహాయంగా ఉంది. నాతో పాటు చాలామంది రైతులు ఉపశమనం పొందారని చెప్పగలను. గిట్టుబాటు ధరలు కూడా దక్కేలా చర్యలు తీసుకుంటే టీఆర్‌ఎస్‌కు ఎదురుండదు.– ముత్యంరెడ్డి,పొన్కల్, మామడ మం.

రైతులకు మేలు
రైతులకు టీఆర్‌ఎస్‌ హయాంలోనే మేలు జరిగింది. ఆ పార్టీ పథకాలతో లబ్ధి పొందిన వారు ఆ పార్టీకే ఓటు వేస్తారు. కచ్చితంగా ఈ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు.– వెంకటనర్సింహారెడ్డి,చాక్‌పెల్లి, నర్సాపూర్‌(జి) మం.

రైతు‘బంధువు’లదే గెలుపు
రైతుల సమస్యలను టీఆర్‌ఎస్‌ గుర్తించింది. రైతు రుణమాఫీతో పాటు దేశంలోనే ప్రథమంగా, ప్రత్యేకంగా రైతుబంధు పథకం అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తుంది.– రావుత్‌ విఠల్,పోనాల, బేల మం.

భూమిచ్చే పార్టీకే ఓటు
భూమి లేనోళ్లకు, నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీకే ఓటేస్తాం. ముఖ్యంగా నిరుపేదల కోసం ఉచిత గ్యాస్‌ కనెక్షన్, కరెంటు కనెక్షన్‌ ఇచ్చే పార్టీకే ఓటేస్తాం.   – మంజుల, మాంగ్‌రుడ్, బేల మం.

‘పథకాల’దే గెలుపు
టీఆర్‌ఎస్‌ హయాంలో మైనార్టీలకు పలు పథకాలు అందుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో పథకాల ప్రభావంతో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని భావిస్తున్నాను.– అతిక్, పొన్కల్,మామడ మం

టీఆర్‌ఎస్‌తోనేఅభివృద్ధి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌దే విజయం. నాతో పాటు నా పరిచయస్తుల మాటా ఇదే.  – ఆనంద్‌రావ్, జైనథ్‌

మరో అవకాశం ఇవ్వాలి
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలతో ముడిపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం సరికాదు. దేశంలో సుస్థిర పాలన కోసం బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలనేది నా అభిప్రాయం. చాలామంది కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అనుకుంటున్నాను.– సురేష్, తురాటి,నర్సాపూర్‌(జి) మం.

రైతుల కోసం అది కూడా చేయాలి..
కష్టపడి పండించిన పసుపు పంటకు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నాం. రైతుల కోసం రైతుబంధు, బీమా పథకాలు తెచ్చిన టీఆర్‌ఎస్‌ సర్కారు ఈ సమస్యపై కూడా దృష్టి పెట్టాలి. అలా చేస్తే రైతుల సంపూర్ణ మద్దతు ఆ పార్టీకే లభిస్తుంది.– లింగారెడ్డి, రైతు,కొరిటికల్, మామడ మం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top