కేసీఆర్‌పై విద్యార్థుల పోరాటం ఆగదు: అద్దంకి

Addanki dayakar comments on kcr govt - Sakshi

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన నాయకులు, విద్యార్థులు

హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వంపై విద్యార్థుల పోరాటం ఆగదని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మానవతారాయ్, నాగరాజు మినహా ఉస్మానియా వర్సిటీ ఘటన కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న విద్యార్థులు, ఇద్దరు నాయకులు బుధవారం రాత్రి విడుదలయ్యారు. అయితే, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మానవతారాయ్, నాగరాజు లకు మాత్రం బెయిల్‌ మంజూరు కాకపోవడంతో వారు విడుదల కాలేదు.

జైలు నుంచి విడుదలైన సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ... కేసీఆర్‌ పాలన ఖాసీం రజ్వి ఆకృత్యాలను తలపిస్తుందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు ఆదేశాలతో తమపై అక్రమ కేసులు నమోదు చేసినా న్యాయ వ్యవస్థ తమ వైపు ఉంది కాబట్టే బెయిల్‌ మంజూరైందన్నారు. బీసీ కుల విద్యార్థి మురళీ ముదిరాజ్‌ ఆత్మహత్యపై స్పందించని కేసీఆర్‌ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాడన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని అంతమొందించడమే తమ భవిష్యత్‌ కార్యచరణ అన్నారు. జైలు నుంచి విడుదలైన వారిలో అద్దంకి దయాకర్, దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్, జి. రంగనాథ్, ఈ. సజన్, కె.దేవదాస్, బి. నాగరాజు, ఎం.మహేశ్, ఎన్‌. ప్రభాకర్, ఎన్‌. మోహన్, వి. రాజు, ఎం. ప్రభాకర్, కె. అశోక్, పి. నితీశ్, కె. మహేశ్, ఎం. ఆనంద్, ఎం. రమేశ్‌ ఉన్నారు. విడుదలైన వారిని తోడ్కొని వెళ్లేందుకు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, విద్యార్థులు వచ్చారు. 

సీఎంకు బహిరంగ లేఖ
ఉద్యోగాలు అడిగినందుకేనా మాకు ఈ శిక్ష అంటూ ఉస్మానియా వర్సిటీలో జరిగిన సంఘటనలో అరెస్టైన వారంతా జైలు నుంచి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు బుధవారం ములాఖత్‌ సమయంలో ఈ లేఖను అందించగా ఆయన మీడియాకు అందజేశారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయన్న ఆశతో ఉన్న నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్‌ మూడున్నరేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మురళీ ఆత్మహత్యకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top