బీజేపీలోకి కీర్తీసురేశ్‌?

Is Actress Keerthi Suresh Joins BJP - Sakshi

చెన్నై: నటి కీర్తీసురేశ్‌ రాజకీయ రంగప్రవేశం చేసిందా? బీజేపీ తీర్థం పుచ్చుకుందా? ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ప్రచారం ఇదే. నటిగా చాలా బిజీగా ఉన్న నటి కీర్తీసురేశ్‌.  మలయాళం, తమిళం, తెలుగు దాటి ఇటీవలే హిందీ సినీ పరిశ్రమలోకి ఎంటర్‌ అయ్యింది. అక్కడ అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా బోనీకపూర్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తోంది. అయితే మహానటి చిత్రం తరువాత కీర్తీసురేశ్‌ క్రేజే వేరు. ఈ క్రేజ్‌ను భారతీయ జనతాపార్టీ వాడుకోవాలని ప్రయత్నించినట్లు, దీంతో కీర్తీసురేశ్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. అంతే కాదు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇటీవల భేటీ అయ్యినట్లు సమాచారం. ఇక ఇప్పటికే కీర్తీసురేశ్‌ బీజేపీ తరఫున ప్రచారం కూడా చేసిందనే టాక్‌ వైరల్‌ అవుతోంది. ఇన్ని విషయాలు వైరల్‌ అవుతున్నా  కీర్తీసురేశ్‌ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది.

అయితే ఆమె తల్లి మేనకా సురేశ్‌ మాత్రం స్పందించక తప్పలేదు. ఈ వ్యవహారం గురించి ఆమె తెలుపుతూ తన భర్త భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారని తెలిపారు. అయితే తాను గానీ, కీర్తీసురేశ్‌ గానీ ఆ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదన్నారు. అయితే కీర్తీసురేశ్‌ బీజేపీ తరఫున ప్రచారం చేసిన విషయం మాత్రం వాస్తవేమని చెప్పారు. అది తన భర్త పార్టీ కావడంతో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తానూ, కీర్తీసురేశ్‌ ఢిల్లీలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేసినట్లు వివరించారు. ప్రచారం పూర్తి అయిన తరువాత కొందరు సినీ కళాకారులు ప్రధాని నరేంద్రమోదీని కలిశారని, అప్పుడు తమని కలవమని చెప్పడంతో తనకు తెలిసిన నటుడు సురేశ్‌గోపి, నటి కవిత వంటి వారు వారిలో ఉండడంతో తామూ ప్రధానిని కలిసినట్లు చెప్పారు. ఆ ఫొటో వెలువడడంతో నటి మేనక, కీర్తీసురేశ్‌ బీజేపీలో చేరారనే ప్రచారం జరుగుతోందని తెలిపారు. అంతే కాదు ఇంకొంచెం ముందుకెళ్లి కీర్తీసురేశ్‌ రాజకీయపార్టీలో చేరారటగా అంటూ కొందరు తననే అడుగుతున్నారని చెప్పింది. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, తనకుగానీ, కీర్తీసురేశ్‌కుగానీ రాజకీయాలపై ఆసక్తి లేదని మేనక అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top