94వ రోజు పాదయాత్ర డైరీ

94th day padayatra diary - Sakshi

21–02–2018, బుధవారం
పెద్ద అలవలపాడు, ప్రకాశం జిల్లా

దళితులను అవమానిస్తూ ‘దళిత తేజం’ వంచన కాదా?
అధికార పార్టీ నేత అగ్రకుల దురహంకార ఉక్కుపాదాల కింద నలిగిపో తున్నా.. పోరుబాటే ఊపిరిగా చేసుకున్న ఆ దళిత సర్పంచ్‌ మనో ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆయనది తూర్పు కోడిగుడ్లపాడు. పేరు తాతపూడి భూషణం. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలోనే ఉన్నా డట. ఐదేళ్ల కిందట ఆ ఊరికి ఏకగ్రీవంగా సర్పంచ్‌ అయ్యాడట. అయితే, ఆ పదవి అలంకారప్రాయమే అయిందట. సర్పంచ్‌ అయినా, పెత్తనమంతా అగ్రకులానికి చెందిన టీడీపీ నేతదేనట. ఆయన అన్యాయం చేసినా నోరెత్తకూడదట. చెప్పిన చోట సంతకం పెట్టాలి. చూపించిన చోటే చేతులు కట్టుకుని కూర్చోవాలి. ఆ టీడీపీ నేత అహంకారం ఏ స్థాయిలో ఉందంటే.. ఆ సర్పంచ్‌ని ఏనాడూ ఆ సీటులోనే కూర్చోనివ్వలేదట. ఈ పెత్తందారీ వైఖరిని సహించలేక ఎదురుతిరిగితే.. అడుగడుగునా ఇబ్బందులు పెడుతు న్నాడట.

తన పలుకు బడితో చెక్‌ పవర్‌ తీసేయించడం, కులం పేరుతో వేధించడం, చెప్పులు కుట్టుకునేవాడంటూ పదే పదే దూషించడం, తప్పుడు నివేదికలతో ఫిర్యాదులు చేసి సర్పంచ్‌ పదవి నుంచి తొలగించాడట. పంచాయతీ నిధులన్నీ మెక్కేశాడట. ఇన్ని అవమానాల్లోనే భూషణం అన్న కోర్టుకెళ్లి న్యాయం సాధించాడట. అయినా ఫలితం లేదట. ఇదెక్కడి అన్యాయమంటూ చంద్రబాబు దృష్టికి తెచ్చినా, ఆయన తనయుడు, పంచా యతీరాజ్‌ మంత్రి లోకేశ్‌కు గోడు చెప్పుకున్నా పట్టించుకోలేదట. ఇక ఆ పార్టీలో ఉండటం నైతికత కాదనుకున్న ఆ సర్పంచ్‌ ఈ రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. నేను వచ్చే మార్గంలోనే చెప్పులు కుడుతూ, ధర్నా చేస్తూ, టీడీపీపై నిరసన తెలియజేస్తూ.. నన్నక్కడికి ఆహ్వానించి నాతో పార్టీ కండువా కప్పించుకున్నాడు. నిజంగా ఎంత అన్యాయం? ఒక దళిత సర్పం చ్‌కు ఇన్ని వేధింపులా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే దళితులు గా ఎవరైనా పుట్టాలనుకుంటారా? అన్నాడంటే.. ఇక ఆయన పార్టీలో నేతలు ఇంతకన్నా గొప్పగా ఉంటారా? ఆయన మంత్రివర్గ సహచరుడే దళితులు శుభ్రంగా ఉండరని, చదువుకోరని, తెలివి తక్కువ వారని అవమానించేలా మాట్లాడారు. మనసే లేని బాబుగారు ‘దళిత తేజం’ అంటూ దళితుల దగ్గరకు రావడం మోసం కాదా?

అక్షయ గోల్డ్, అగ్రిగోల్డ్, సిరి గోల్డ్‌.. పేరు ఏదైతేనేం పేదలను నిండా ముంచేవే కదా. ఈ రోజు అక్షయ గోల్డ్‌ మార్కెటింగ్‌ ఏజెంట్లు వాళ్ల గోడు చెప్పుకొన్నారు. సంస్థ మాట నమ్మి 2007 నుంచి పేదలతో డబ్బులు కట్టించారట. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో జనం వెంటబడుతున్నారట. ఎన్నికలప్పుడు చంద్రబాబును కలిస్తే.. ప్రభుత్వం వస్తే సమస్య తీరినట్టే అని చెప్పాడట. అధికారంలోకి వచ్చాక అనేక సార్లు కలిసినా ఒరిగిందేమీ లేదని వాపోయారు. మానసిక వేదనతో బాధితులెందరో తనువు చాలించారట. అగ్రిగోల్డ్‌ బాధితుల ఆవేదనను అనేకసార్లు అసెంబ్లీలోనూ, బయటా పదే పదే వినిపించాను. బోర్డు తిప్పేసే సంస్థల ఆస్తులను స్వాహా చేయడంలో టీడీపీ నేతలే సూత్రధారులైతే ప్రజల గోడు వినేదెవరు?

సాయంత్రం.. వ్యాయామ విద్య పూర్తిచేసుకున్న నిరుద్యోగులు కలిశారు. ప్రతీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిని పెడతామని చంద్రబాబు చెప్పాడు. క్రీడా సంస్కృతిని పెంచుతామని ప్రకటించాడు. వ్యాయామ అక్షరాస్యత కోసం జీవో 29ని అమలు చేస్తానన్నాడు. కానీ ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. నాన్నగారి హయాంలో 2000 పోస్టులు భర్తీ చేస్తే.. బాబుగారి పాలనలో 200 కూడా భర్తీ చేయలేదట. నిజంగా ఇది అన్యాయమే. మోసం, నయవంచన చంద్రబాబు నైతిక హక్కులుగా మారిపోయాయి. ఇరుకు గదుల్లో, నిబంధనలకు విరుద్ధంగా శారీరక ఉల్లాసమే లేని నియంతృత్వ విద్యకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారిన విద్యా సంస్థలన్నీ చంద్రబాబు బినామీలవే కదా! అందుకే ఆయన వ్యాయామ విద్యను, ఉపాధ్యాయులను మరోసారి మోసం చేశాడు. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్‌సీఆర్‌బీ 2017 నివేదిక ప్రకారం దళితులపై వేధింపుల్లో మన రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో ఉండటం సిగ్గుచేటైన విషయం కాదా? దళితుల పట్ల మీకున్న దృక్పథమే దీనికి కారణం కాదా? మీ పార్టీకే చెందిన దళిత ప్రజా ప్రతినిధికే ఘోర అవమానాలు జరుగుతుంటే.. ఇక సామాన్య దళితుల పరిస్థితేంటి? కాగా, ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళిత తేజం పేరుతో వారి దగ్గరికి వెళుతుండటం మరోసారి వంచించడానికే కాదా?
- వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top