కేసీఆర్‌ ఇది చాలా.. ఇంకేమైనా కావాల్నా: రేవంత్‌

3 thousand Rupees to the 10 lakhs people - Sakshi

  అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇచ్చి చూపిస్తాం

       విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభలో ఉత్తమ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున భృతి అందించి తీరతామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారమిక్కడ విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. 1,200 మంది యువత బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మిషన్‌ భగీరథ, కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చేందుకు నిధులుంటాయి కానీ నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడానికి నిధులుండవా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక వందల సంఖ్యలో విద్యాసంస్థలు మూతపడ్డాయని, 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన సమయంలో ఉన్న ఉద్యోగ ఖాళీలు ఇప్పటికీ భర్తీ కాలేదని ఉత్తమ్‌ ఆరోపించారు. 

కేసీఆర్‌ ఇది చాలా.. ఇంకేమైనా కావాల్నా: రేవంత్‌ 
నిరుద్యోగ గర్జన సభలో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. ‘‘ఖబడ్దార్‌.. కేసీఆర్‌ ఇది చాలా... ఇంకేమైనా కావాల్నా.. ఇంకా కావాలంటే చెప్పు సింగరేణిలో గర్జిస్తాం. కాకతీయ కోటలో కదం తొక్కుతాం..’’అని వ్యాఖ్యానించారు. 133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ ఏం చేసిందని ప్రశ్నిస్తావా అంటూ నిలదీశారు. ‘‘బాక్రానంగల్, చంబల్, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులు కట్టిందెవరు? 1971లో పాకిస్తాన్‌పై యుద్ధం చేసి గెలిపించింది ఇందిరాగాంధీ కాదా?’’అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రమిచ్చింది కాంగ్రెసే, ఆ రాష్ట్రం ఇవ్వడం వల్లే కేసీఆర్‌ సీఎం అయ్యాడు అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను అమ్మాబొమ్మా అన్న కేటీఆర్‌ను వదిలేది లేదని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ‘కండలు కరగనీ, గుండెలు పగలనీ, రక్తం ఏరులై పారినా పోరాడుదాం.. కాంగ్రెస్‌ను గెలిపిద్దాం..’అని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top