200 యూనిట్ల విద్యుత్‌ ఉచితం

200 units of electricity free for poor people says YS Jagan - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

పేదలకు చార్జీల మోత నుంచి ఉపశమనం కల్పిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ 

డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు నాలుగు విడతల్లో చెల్లిస్తాం 

పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తాం 

పెద్ద చదువుల ఫీజులన్నీ చెల్లిస్తాం.. 

విద్యార్థికి ఏటా అదనంగా రూ.20 వేలు ఇస్తాం 

మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రతిపక్ష నేత 

(ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తాం. పేదలందరూ ధైర్యంగా ఉండండి’ అని మహిళలకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. బనగానపల్లె మండలంలోని హుసేనాపురం గ్రామం వద్ద సోమవారం 13వ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రను పురస్కరించుకుని ఏర్పాటైన ‘మహిళలతో ముఖాముఖి’ కార్యక్రమంలో జగన్‌ ప్రసంగిస్తూ ఈ మేరకు హామీ ఇచ్చారు.

చుట్టు పక్కల గ్రామాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్‌ బిల్లులపై ఓ మహిళ అడిగిన ప్రశ్నకు జగన్‌ సమాధానమిస్తూ..‘చంద్రబాబు అధికారంలోకి రాకముందు విద్యుత్‌ చార్జీలు తక్కువగా ఉండేవి. అలాంటిదిప్పుడు నెలకు రూ.500 నుంచి రూ.1000 వరకు బిల్లులు వస్తున్నాయి. విద్యుత్‌ శాఖ సిబ్బంది గ్రామాలకు తనిఖీలకని వెళ్లి తమకు నచ్చని వారికి రూ.10 వేలు, రూ.20 వేలు వరకు వివిధ కారణాలతో జరిమానాలు విధిస్తున్నారు. అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదు. మీ ఇంట్లో సెల్‌ఫోన్లు చార్జింగ్‌ చేసుకోవచ్చు. 15 నుంచి 16 గంటలసేపు టీవీ చూడొచ్చు. రెండు లైట్లు కూడా ఉంచుకోవచ్చు. వీటన్నింటికీ కలిపినా 150 యూనిట్ల కంటే వినియోగం మించదు. అందుకే  మన పార్టీ అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా’ అని జగన్‌ పేర్కొన్నారు. ఈ సదస్సులో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

మోసం చేసిన వారిని కొనసాగిద్దామా..?  
‘‘నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో దారుణంగా మోసపోయారు. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. నాలుగేళ్ల క్రితం చంద్రబాబు ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అధికారంలోకి రావడం కోసం ఆయన చెప్పిన మాటలేమిటి? బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే... బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నాడా.. లేదా?  పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే... బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడా... లేదా? మరి ఇప్పుడు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి వచ్చిందా? మహిళల రుణం ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా? ఇది వరకు చంద్రబాబు పాలనకంటే ముందు రాష్ట్రంలో సున్నా వడ్డీకి రుణాలు లభించేవి. చంద్రబాబు పుణ్యమా అని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. సున్నా వడ్డీకి లభించాల్సిన రుణం రాకపోవడానికి కారణం చంద్రబాబు బ్యాంకులకు కట్టాల్సిన మొత్తం కట్టక పోవడమే. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,000 కోట్లు చెల్లిస్తే బ్యాంకులు మహిళలకు సున్నా వడ్డీకి రుణాలిస్తాయి. 2017 మార్చి నాటికి అలాంటి మొత్తం రాష్ట్రంలో రూ.1,446 కోట్లు బకాయి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టారు. ఆ తర్వాత ఎనిమిది నెలలకు గానూ మరో రూ.800 కోట్లు చెల్లించలేదు. అంటే మొత్తం రూ.2,200 కోట్లు ఎగ్గొట్టారు. ఇలా మోసం చేసిన ప్రభుత్వాన్ని కొనసాగిద్దామా? 

ఇవాళ మద్యం డోర్‌ డెలివరీ 
అధికారంలోకి రాగానే మద్యం, బెల్ట్‌షాప్‌లను రద్దు చేస్తామని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు బెల్ట్‌షాపులు రద్దయ్యాయా... అని ప్రశ్నిస్తున్నా. మద్యం ఏరులై పారుతోందా... లేదా అని అడుగుతున్నా. బెల్ట్‌షాపులు రద్దు కాదు కదా... ఇవాళ ఫోన్‌ చేస్తే ఇంటికి మద్యం డోర్‌ డెలివరీ చేసే పరిస్థితులు దాపురించాయి. అందుకే దేవుడి దయవల్ల, మీ అందరి చల్లని దీవెనలతో మన పార్టీ అధికారంలోకి వస్తే మద్యం మహమ్మారి లేకుండా చేస్తాం. మద్యాన్ని నిషేధించాకే మళ్లీ ఐదేళ్లకు మీ వద్దకు ఓట్లు అడగడానికి వస్తానని మనవి చేస్తున్నా. 

ఆ ఫీజులన్నీ మేమే కడతాం.. 
చాలా మంది అక్కచెల్లెమ్మలు తమ పిల్లలను చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు భారీగా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తూ వస్తున్నారు. అందుకే తమ ఇద్దరు పిల్లలను స్కూల్‌కు పంపితే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని మీ సమక్షంలో చెబుతున్నా. ఆ తల్లులు చేయాల్సిన పనల్లా ఒక్కటే. పిల్లలను స్కూల్‌కు పంపడమే. ఈ రోజు ఇంజనీరింగ్, డాక్టర్‌ లేదా ఉన్నత విద్యకు లక్షల్లో  కావాలి. ఇంజనీరింగ్‌లో రూ.లక్ష ఫీజు ఉంటే, ప్రభుత్వం చెల్లిస్తున్నది  రూ.30 వేల నుంచి రూ.35 వేలే. అదీ ఏడాది చివర్లో ఎప్పుడో చెల్లిస్తున్నారు. మిగతా రూ.65 వేలను వారి తల్లిదండ్రులు ఆస్తులమ్మి కడుతున్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్, డాక్టర్‌ ఇతర ఉన్నత విద్యకు ఎంత ఫీజు అవసరమైతే అంతా చెల్లిస్తామని హామీ ఇస్తున్నాను. మన బిడ్డ ఇంటికి దూరంగా కళాశాలలో చదివేటప్పుడు వసతి కోసం, ఆహారం కోసం మనం డబ్బు పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను అది కూడా లేకుండా చేస్తాను. ఏడాదికి వసతి, తిండి ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి రూ.20 వేలు ఇస్తానని హామీ ఇస్తున్నా’ అని జగన్‌ భరోసానిచ్చారు.

‘జన్మభూమి కమిటీలుండవు, ఎవరికీ ఒక్క రూపాయి లంచమిచ్చే పరిస్థితి ఉండదు. అప్పులను చూసి ఎవరూ భయపడొద్దు. ఎన్నికల నాటికి మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో.. ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల చేతికే అందేలా చేస్తానని హామీ ఇస్తున్నా.’ 
                – వైఎస్‌ జగన్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top