జనం గుండె చప్పుడై..

16 Day PrajaSankalpaYatra in Prakasam Dist - Sakshi

జిల్లాలో 16వ రోజు అదే జోరు

ప్రజాసంకల్ప యాత్రకు జనహోరు

1400 కి.మీ. మైలురాయి దాటిన యాత్ర

జ్ఞాపకంగా రావి మొక్క నాటిన జగన్‌

మహిళల ఘన స్వాగతం

సమస్యలు విన్నవించిన ప్రజలు

16వ రోజు 16.3 కి.మీ. సాగిన జననేత యాత్ర

రోజూ వేలమందితో మమేకమవుతూ.. కర స్పర్శతో ఓదార్పునిస్తూ.. అవ్వాతాతల ఆశీర్వాదాలందుకుంటూ.. నాలుగేళ్లుగా పడుతున్న కష్టనష్టాలను తెలుసుకుంటూ.. తమను ప్రేమతో స్పృశించే రాజన్నబిడ్డపై పల్లెజనం అభిమానం కురిపిస్తున్నారు. పేద బతుకుల్లో సంతోషం చూడాలని పరితపిస్తున్న జగన్‌ ‘సంకల్పం’ నెరవేరాలని కోరుకుంటున్నారు. అలుపెరగకుండా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాగిస్తున్న పాదయాత్రలో భాగంగా 104వ రోజు నాగులపాడు వద్ద 1,400 కిలోమీటర్లు చేరుకోగానే పార్టీ అభిమానుల్లో సంబరం మిన్నంటింది. గ్రామ పొలిమేర్లలో అక్కచెల్లెళ్లు రంగవల్లులతో అలంకరించారు. పూలబాట వేసి జగనన్నకు ఆత్మీయ స్వాగతం పలికారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర అపూర్వ ఆదరణతో ముందుకు సాగుతోంది. మా గుండె చప్పుడు నీవేనయ్యా అంటూ అడుగడుగునా జనం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. అందరినీ పేరు పేరునా పలకరిస్తూ సమస్యలు ఏకరువు పెట్టిన వారికి తానున్ననంటూ భరోసానిస్తూ వైఎస్‌.జగన్‌ యాత్ర కొనసాగిస్తున్నారు. 16వ రోజు అద్దంకి శివారు నుంచి ప్రారంభమైన యాత్ర నాగులపాడు మీదుగా సాగి యాత్ర మధ్యాహ్నానికి వెంకటాపురానికి చేరుకుంది. భోజన విరామం అనంతరం అలవలపాడు మీదుగా సాయంత్రానికి యాత్ర తక్కెళ్లపాడుకు చేరుకుంది. జగన్‌ యాత్ర నాగులపాడు వద్దకు 1400 కి.మీ. మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా గ్రామస్తులు పూలు, ముగ్గులతో ఘనస్వాగతం పలికారు. జ్ఞాపకంగా గ్రామంలో జగన్‌ రావి మొక్కను నాటారు. వైఎస్సార్‌ విగ్రహంతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు. వెంకటాపురం వద్ద రెండు వైఎస్సార్‌ విగ్రహాలతో పాటు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అలవలపాడులోని వైఎస్సార్‌ విగ్రహం, జెండా ను ఆవిష్కరించారు. దారి పొడవునా జనం జగన్‌కు సమస్యలు ఏకరువు పెట్టారు. జిల్లాతోపాటు హైదరాబాద్‌ నుంచి వచ్చిన వైద్య బృందం జగన్‌ను కలిసి ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. జార్లపాలేనికి చెందిన పొగాకు బ్యార్నీ కూలీలు సమస్యలు వైఎస్‌.జగన్‌కు విన్నవించారు. అలవలపాడు వద్ద ఇటుక బట్టీల కార్మికులు సమస్యలు ఏకరువు పెట్టారు.  16వ రోజు వైఎస్‌ జగన్‌ 16.3 కి.మీ. మేర నడిచారు.

జననేతకు సమస్యల వినతి

  • టీడీపీ నేతలు మా భూమిని ఆక్రమించి మట్టిని అక్రమంగా అమ్ముకుంటున్నారంటూ నాగులపాడు ప్రజాసంకల్ప యాత్రలో బోడెంపూడి శోభారాణి వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడును చెప్పుకున్నారు.
  • ప్రజా సంకల్పయాత్ర మా ఊరి గుండా పోతుందని మా ఊరికి కొత్తగా ఆర్టీసీ బస్సు వేశారని ఇది ఎన్ని రోజులుంటుందో తెలియదని అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి గొర్రెపాటి మాధవి వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చింది.  
  • నాగులపాడు ఎస్సీ కాలనీలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామానికి చెందిన మహిళలు నాగులపాడు వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసి విన్నవించారు.
  • సుబాబుల్‌ వేసిన రైతుల కుటుంబాలు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాయని వెంకటాపురం వద్ద అదే గ్రామానికి చెందిన వల్లంరెడ్డి అంజమ్మ వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చింది.
  • చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాభావ పరిస్థితుల వల్ల ఎర్ర శనగ (జెజె–11) ఎకరానికి గతంలో 10 క్వింటాళ్లు అయ్యేవి.. ప్రస్తుతం 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి రావడం వల్ల ఖర్చులకు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని వెంకటాపురం గ్రామానికి చెందిన కె.మోహనరెడ్డి వైఎస్‌. జగన్‌ వద్ద వాపోయారు.
  • గతంలో ఎకరం పొగాకు రూ.30 నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి అయ్యేది ప్రస్తుతం లక్ష వరకు పెరిగిందని దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందని వెంకటాపురం గ్రామానికి చెందిన కె.బ్రహ్మారెడ్డి, ఎ.వెంకటేశ్వరరెడ్డి అనే రైతులు వైఎస్‌.జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
  • ఆరు నెలల క్రితం డెంగీతో వెంకటాపురం గ్రామానికి చెందిన భీమనాథం ఈశ్వరరెడ్డి మృతి చెందా డని నేటికీ చంద్రన్న బీమా అందజేయలేదని తల్లి భీమనాథం రమాదేవి వెంకటాపురం గ్రామం వద్ద వైఎస్‌.జగన్‌కు విన్నవించారు.  

వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డితో కలిసి నడిచిన నేతలు
16వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్, అద్దంకి సమన్వయకర్త చెంచు గరటయ్య, వైఎస్సార్‌ సీపీ నేతలు వై.వి.భద్రారెడ్డి, కృష్ణచైతన్య, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, యువత అధ్యక్షుడు రామానాయుడు, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు జలీల్, అట్ల చినవెంకటరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top