146వ రోజు పాదయాత్ర డైరీ

146th day padayatra diary - Sakshi

26–04–2018, గురువారం  
నందమూరి క్రాస్, కృష్ణా జిల్లా

మీరిలా లూటీ చేస్తుంటే.. వ్యవసాయం సంక్షోభంలో పడదా?
టీడీపీ నేతల అప్రజాస్వామిక చర్యలు, బెదిరింపులు, దౌర్జన్యాలనూ తోసిరాజని ఉప్పొంగిన అభిమానంతో అశేష జనం వెంటరాగా.. నేటి ప్రజా సంకల్ప యాత్ర కోలాహలంగా సాగింది. ఎంతగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. అంతగా ప్రజాభిమానం పెల్లుబికింది.  
 
కన్నీరు ఉబికి రాగా.. ఇన్నాళ్లూ మనసులో దాచుకున్న సేద్యపు కష్టాలను నాతో పంచుకుని, గుండె బరువుకాస్తా దించుకుని ఊరట చెందాడు.. ఉదయం కలిసిన మాతంగి సత్యనారాయణ అనే రైతన్న. ‘అయ్యా.. నేనో సామాన్య రైతును. మీ నాన్నగారి హయాంలో రైతునని చెప్పుకోడానికి గర్వంగా ఉండేది. వ్యవసాయమూ బాగా కలిసొచ్చేది. ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. సాగు కష్టాలు, నష్టాలతో బతుకు భారమవుతున్నా.. ఎప్పటి నుంచో నమ్ముకున్న వ్యవసాయాన్ని వదులుకోలేక, వేరేపనీ చేయలేక సతమతమవుతున్నాను.

మా కష్టాలు చెప్పుకొని కాస్త ఊరట చెందుదామనుకుంటే.. పట్టించుకునే నాథుడే లేడు. ఒక్క అధికారీ రాడు.. వినే నాయకుడూ లేడు. నిన్ను కలిసి బాధలు చెప్పుకొంటుంటే.. చాలా సంతోషంగా ఉంది. గుండెభారం తగ్గినట్లుంది. మళ్లీ రాజన్న పాలన వస్తుందన్న నమ్మకం కలుగుతోంది’ అంటూ ఆనందపడుతుంటే.. ఆరుగాలం కష్టించే అన్నదాత ఎంత అల్పసంతోషి.. అనిపించింది. వారి బాధలను విన్నందుకే ఇంత ఓదార్పు పొందుతున్నాడు.. అలాంటిది వారి కష్టాలను తీర్చగలిగే అవకాశమే వస్తే.. అంతకన్నా భాగ్యం ఏముంటుంది!
 
సూరెడ్డి శ్రీమణి అనే అక్క మరికొందరు అక్కచెల్లెమ్మలతో కలిసి వచ్చి.. బుద్ధవరంలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా వివరించింది. మిల్లర్లు, అధికారపార్టీ నేతలు బరితెగించి బాహాటంగానే భారీగా బియ్యం దందా చేస్తున్నారని, కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్‌కు, అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోకపోగా హేళనగా మాట్లాడుతున్నారని ఆక్రోశం వ్యక్తం చేసింది.

అధికార పార్టీకి చెందిన ధాన్యం కొనుగోలు నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై డ్వాక్రా గ్రూపు సభ్యులను, ఉపాధి కూలీలను, కాంట్రాక్టు లేబర్లను, గృహిణులను, హోటళ్లలో పనిచేసే వారిని.. ఆఖరికి చనిపోయిన వారిని సైతం కౌలు రైతులుగా చూపిస్తూ.. తప్పుడు సాగు ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూశాఖ నుంచి తీసుకున్నారట. బ్లాక్‌ మార్కెట్‌లోనూ, పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి.. ప్రభుత్వానికి సరఫరా చేసి.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి.. వాటాలు పంచుకున్నారట.

పంట పండించినట్లుగా వీరు రికార్డుల్లో చూపించిన సర్వే నంబర్లలో.. ఏలూరు కాలువ, చెరువులు, పాఠశాలలు, శ్మశానాలు, పంచాయతీ కార్యాలయం, అపార్ట్‌మెంట్లు ఉన్నాయంటే.. ఎంతగా బరితెగించి కుంభకోణానికి పాల్పడ్డారో అర్థమవుతోంది. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్భయంగా, ఇంత బాహాటంగా రైతుల పొట్టగొట్టి ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారంటే.. అధికారుల సహకారం, ప్రభుత్వ అండదండలు ఎంతగా ఉన్నాయో అవగతమవుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇదే తంతు నడుస్తోందంటే.. ఇది ఎంత పెద్ద కుంభకోణమో అర్థమవుతోంది. ఇందులో ప్రభుత్వ పెద్దలే ప్రధాన భూమిక పోషిస్తుండటం జగమెరిగిన సత్యం.  
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఓ వైపు ప్రకృతి కరుణించక, మీ ప్రభుత్వ సహకారమూ లేక రైతన్న సతమతమవుతుంటే.. మరోవైపు మీరు, మీ అనుచరులు బాహాటంగా రైతుల్ని లూటీ చేస్తుంటే.. వ్యవసాయం సంక్షోభంలో పడక ఇంకేమవుతుంది?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top