138వ రోజు పాదయాత్ర డైరీ

138th day padayatra diary - Sakshi

17–04–2018, మంగళవారం
మైలవరం, కృష్ణా జిల్లా

చంద్రబాబూ.. మీ దీక్ష ఎవర్ని మభ్యపెట్టడానికి? 
ఈ సర్కారీ నిర్లక్ష్యం పేదలకు ప్రాణాంతకమవుతున్న ఓ సంఘటనను ఉదహరించారు ఈ రోజు కలిసిన 108 ఉద్యోగులు. పేరకలపాడుకు చెందిన కుమారి అనే అక్కకు గత నెల 31న అర్ధరాత్రి వేళ గుండెపోటు వచ్చిందట. అసలే ఆలస్యంగా వచ్చిన 108 అంబులెన్స్‌.. మధ్యలోనే మొరాయించింది. మళ్లీ ఫోన్‌ చేస్తే.. కొన్ని గంటల తర్వాత మరో 108 వాహనం వచ్చిందట. అందులో ఆక్సిజన్‌ లేదు, అత్యవసర మందులూ లేవు. ఏమాత్రం కండిషన్‌లో లేని ఆ వాహనం ముక్కుతూ మూలుగుతూ ఆస్పత్రికి వెళ్లే వరకూ ఆ పేషెంటు, వారి బంధువులు నరకయాతన అనుభవించారట. ప్రాణాపాయ స్థితిలో దేవుడిపై భారం వేసి.. గాలిలో దీపంలా ఆస్పత్రికి చేరిన ఆ అక్క పరిస్థితి తలుచుకుంటే గుండె జలదరించింది.

తగిన సంఖ్యలో అంబులెన్స్‌లు లేక, అధిక శాతం మూలనపడి, మిగిలిన ఆ కొన్ని కూడా కాలం చెల్లిపోయి, వాటిలో కూడా కనీస సౌకర్యాలు, మందులూ లేక, సిబ్బందీ కరువై.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న 108 పథకాన్ని చూసి గుండె బరువెక్కింది. సిబ్బందికి ఇచ్చే కొద్దిపాటి జీతాలు సైతం మూడు నెలలుగా పెండింగేనట. నాన్నగారి హయాం తర్వాత క్రమంగా తగ్గిపోయి, అరకొరగా మిగిలిన వాహనాలలో అత్యధికశాతం షెడ్లలో కాలం వెళ్లదీస్తున్నా.. రికార్డుల్లో మాత్రం నడుస్తున్నట్లే చూపుతున్నారట. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. సీఎం గారి డ్యాష్‌ బోర్డులో సైతం దాదాపు అన్ని వాహనాలూ సక్రమంగా తిరుగుతున్నట్టే చూపడం. ఆపదలో ఉన్న పేదలకు ఆపద్బంధులా నిలిచిన 108 పథకం సైతం.. ఈ పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి గురై అవసాన దశకు చేరుకోవడం శోచనీయం.  

హోదా కోసం బంద్‌లో పాల్గొంటే కేసులు పెడతామంటూ చంద్రబాబు చేసిన బెదిరింపులను ఖాతరు చేయకుండా బంద్‌ను విజయవంతం చేసి.. తెలుగోడి సత్తా చాటడం ఈ కర్కోటక పాలనకు చెంపపెట్టులాంటిది. ప్రజలందరూ స్వచ్ఛందంగా, శాంతియుతంగా బంద్‌ను దిగ్విజయం చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇది ప్రజా విజయం.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో బస్సులను తగలబెట్టిస్తూ.. ఆస్తులను ధ్వంసం చేస్తూ.. ఆందోళనలు చేయిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బంద్‌లకు దూరమంటారు. ఐదు కోట్ల ప్రజల జీవనాడి అయిన హోదా కోసం జరిగే బంద్‌ను సైతం విఫలం చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఆందోళనలు ఢిల్లీలో చేపట్టాలని అందరికీ సందేశాలిస్తారు.. 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామాలిచ్చి ఆమరణ నిరాహారదీక్ష చేస్తే.. దేశం మొత్తం చర్చనీయాంశమై కేంద్రం దిగొస్తుం దని తెలిసి కూడా ఆ పనిచేయకుండా.. మీరు మాత్రం అమరావతిలో కొంగ జపంలా ఒక రోజు దీక్ష చేస్తానంటారు.. ఎవర్ని మభ్యపెట్టడానికి? ఇది ద్వంద్వ వైఖరి కాదా? వంచన కాదా? ఉద్యమ ద్రోహం కాదా?  
- వైఎస్‌ జగన్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top