128వ రోజు పాదయాత్ర డైరీ

128th day padayatra diary - Sakshi

04–04–2018, బుధవారం
వడ్లమూడి, గుంటూరు జిల్లా

ఓటుకు కోట్లు కేసులో ఆ స్వరం మీదా.. కాదా?
నా ఈ ప్రజా సంకల్ప యాత్రలో కరువు ప్రాంతాలను చూశాను. తాగు, సాగు నీటికి అల్లాడిపోతున్న గ్రామాలను చూశాను. మరోవైపు చేరువలో నదీమతల్లులు పరుగులిడుతున్నా పొలాలకు నీళ్లందివ్వలేని పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనాలూ చూశాను. గుంటూరు జిల్లా అనగానే పంటలు బాగా పండే ప్రాంతమనే అభిప్రాయం అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ రైతన్నలు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారనేది క్షేత్రస్థాయి వాస్తవం. కూచిపూడి గ్రామానికి చెందిన నాగభూషణం, రామ్మోహనరావు అనే రైతన్నలు తమ జొన్న, మొక్కజొన్న పంటల దైన్యాన్ని వివరించారు. సకాలంలో నీరందక, నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులతో దిగుబడి తగ్గి.. పంటచేతికొచ్చే సమయానికి ధరలు పాతాళానికి పడిపోయి.. వ్యవసాయం ఉరితాడై బిగుసుకుంటోందని తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. వారి బాధలు చూశాక రాష్ట్రంలోని ఏ ప్రాంత రైతన్నల దీనస్థితికైనా నేటి ఈ పాలకుడే ప్రథమ ముద్దాయని మరోసారి స్పష్టమైంది.
 
నాలుగు దశాబ్దాల కిందట ఈ ప్రాంత పాడి రైతుల సంక్షేమం కోసం ఏర్పడిన సహకార డెయిరీ.. నేడు అధికార పార్టీ నాయకుడి కబంధ హస్తాల్లోకి వెళ్లిన వైనాన్ని వివరించారు.. మైలా హనుమంతరావు, మోహనరెడ్డి, బ్రహ్మేశ్వరి, ఝాన్సీలక్ష్మి తదితరులు. రైతన్నల స్వేదంతో వారి త్యాగాల పునాదులపై నిర్మితమైన సహకార డెయిరీ.. నేడు సంగం డెయిరీగా పిలువబడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబ ఆస్తిగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా.. అధికార దుర్వినియోగం చేసి సహకార డెయిరీని కంపెనీ చట్టం కిందకు మార్చుకుని, డెయిరీ ఆస్తులను అనుభవిస్తూ, అక్రమాలు చేస్తూ.. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని వాపోయారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్ర విచారణ జరిపి ఆ డెయిరీని తిరిగి రైతాంగానికి అప్పగించే ప్రయత్నం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రే తన సొంత డెయిరీ కోసం సహకార డెయిరీలను నిర్వీర్యం చేసి అక్రమాలకు ఒడికడుతుంటే.. ఆయన గారి అనుచరులు మరోలా ఉంటారని ఎలా అనుకోగలం! 

చంద్రబాబు తరహాలో చిత్తశుద్ధిలేని మోసపూరిత రాజకీయాలు చేయకుండా.. హోదానే ఊపిరిగా, పోరుబాటే మార్గంగా ఎంచుకున్న ఎవరికైనా తాము మద్దతిస్తామని మొదటి నుంచీ చెబుతున్నాను. చలసాని శ్రీనివాస్‌గారి నేతృత్వంలోని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలకూ నేనీరోజు ఇదే భరోసా ఇచ్చాను. ఈ మధ్యాహ్నం కలిసిన వాళ్లు.. మా పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి, ఏపీ భవన్‌ వద్ద ఆమరణ దీక్షలు చేపట్టాలన్న మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఢిల్లీ వెళ్లి ఎంపీలకు సంఘీభావం చెబుతామన్నారు. జన నాడిని గుర్తించి, మాపై వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని నేను స్వాగతించాను. సంజీవని అయిన హోదాను కేసుల భయంతో ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన చంద్రబాబు.. మళ్లీ ఇప్పుడు హోదా మంత్రం జపిస్తూ.. ఢిల్లీలో తంత్రాన్ని నడుపుతున్నట్టు నటిస్తున్నాడు.

తిమ్మిని బమ్మిని చేసే బాబుగారి మాయలను జనం నమ్మడం లేదని తేలిపోయింది. ఉద్యమించే శక్తులను కూడదీసుకుని హోదా పోరుకు నాయకత్వం వహించాలని సాధన సమితి నేతలు చెప్పడమే దీనికి తార్కాణం. కేసుల భయంతో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. కేంద్రం విచారణ జరిపితే అండగా నిలవాలని కొన్ని పార్టీల కాళ్లా వేళ్లా పడుతున్నారు. హోదా సాధించాలనే లక్ష్యం చంద్రబాబులో ఏ మాత్రం కనిపించడం లేదు. నిజంగా అదే ఉంటే.. కేంద్రం మెడలు వంచి హోదా తెచ్చేందుకు రాజీనామాలే కాదు.. ఆమరణ దీక్షకూ సిద్ధమైన మా పార్టీ ఎంపీల బాటలో ఆయనెందుకు నడవరు? వాళ్ల ఎంపీలతోనూ ఎందు కు రాజీనామా చేయించరు? వారిచే ఆమరణ దీక్ష ఎందుకు చేయించరు? రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేస్తే దేశం మొత్తం చర్చనీయాంశం కాదా? కేంద్రం దిగిరాదా? చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల్లోనూ.. హోదాను సజీవంగా ఉంచింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ అన్న సాధన సమితి నేతల మాటల్లో వెల్లడైన వాస్తవం బాబు చెవికెక్కదేమోగానీ, యావత్‌ రాష్ట్ర ప్రజానీకం గుర్తించింది. అందుకే పోరుబాటకు సిద్ధమంటూ కదిలివస్తున్నారు. చేయి చేయి కలిపి అడుగులేస్తున్నారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎదుటివారు నేరస్తులు.. మీరు మాత్రం సచ్ఛీలురు, అత్యంత నీతివంతులు అన్నట్టుగా అసెంబ్లీలోనూ, బయటా, ఢిల్లీలోనూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. మీకు సూటి ప్రశ్న.. ఓటుకు కోట్లు కేసులో స్వరం మీదా.. కాదా? ఢిల్లీలోని మీడియా సాక్షిగా దీనికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకున్నాయా? 
- వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top