125వ రోజు పాదయాత్ర డైరీ

125th day padayatra diary - Sakshi

మార్చి 31, 2018 శనివారం
పేరేచర్ల, గుంటూరు జిల్లా

అవినీతి అమరావతి.. బాబుగారి భ్రమరావతి అంటున్నారు..
బీదాబిక్కీ, పేదాసాదా అనే తేడా లేకుండా రాక్షస కాండకు పాల్పడుతున్న పచ్చ రాబందులకు దయాదాక్షిణ్యాలు ఏ మాత్రం లేవనేందుకు ఉదాహరణ ఈ రోజు పాదయాత్రలో ఎదురైన సంఘటన. రచ్చ గెలిచి ఇంట ఓడిపోయిన ఓ సైనిక కుటుంబం ఆవేదన చూసి కడుపు తరుక్కుపోయింది. మేడికొండూరు దగ్గర షబీరున్నీసా అనే పెద్దామె నన్ను కలిసింది. తను మిలటరీ ఆదమ్‌ భార్యనని సగర్వంగా చెప్పుకుంది. ఇంతకుముందు తన భర్త, కుమారుడు.. ఇప్పుడు మనవడు కూడా మిలటరీలో సైనికుడిగా పనిచేస్తున్నాడని.. అలాంటి మా కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిందని కంటనీరు పెట్టుకుంది. తనకు వచ్చిన సమస్య గురించి చెబుతూ ‘మా కుటుంబంలో ప్రతి తరం దేశం కోసం పనిచేశారని చెప్పుకోవడం మాకు గర్వంగా ఉంది. నా భర్త షేక్‌ ఆదమ్‌ చైనా యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. రక్షక్‌ మెడల్‌ ఇచ్చి ఈ దేశం మా ఆయనను గౌరవించింది. మాకు ఇక్కడ రెండెకరాల 59 సెంట్ల భూమి కూడా ఇచ్చారు. 1969 నుంచి 2015 వరకు 46 ఏళ్లు ఆ పొలానికి శిస్తు చెల్లిస్తూ సాగు చేసుకుంటున్నాం.

ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.. ఒక్క ఈ చంద్రబాబు ప్రభుత్వం తప్ప. మేము వాళ్లకు ఓట్లు వేయలేదనే దుగ్దతో మా పొలాన్ని నీరు–చెట్టు పథకం కింద పెట్టారు. మేము హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాం. అయినా కూడా ఇక్కడ జన్మభూమి కమిటీలు, అధికారులు కలిసి రాత్రికి రాత్రే మా పొలాన్నంతా తవ్వేసి మట్టినంతా అమ్ముకున్నారు. మాకెలాంటి ప్రత్యామ్నాయం చూపించలేదు. మా పిల్లలు ఇప్పుడు విధిలేక సెంట్రింగ్‌ పనులకు పోతున్నారు. మా కడుపు మీద కొట్టింది ఈ చంద్రబాబు ప్రభుత్వం’ అని దుమ్మెత్తి పోసింది. మీ నాన్నగారి హయాంలో మాకు ఇల్లొచ్చింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పుణ్యమా అని మా మనవరాలు ఇంజనీరింగ్‌ చదివింది. మా సైనిక కుటుంబానికి గౌరవాన్ని ఇచ్చిన వైఎస్సార్‌లాంటి గొప్ప నాయకుడ్నీ చూశాం.. ఇప్పుడు మా కడుపుమీద కొట్టి రోడ్డున పడేసిన రాక్షస ప్రభుత్వాన్నీ చూస్తున్నామని ఆ తల్లి ఆక్రోశించింది. అటు దళిత, బలహీన వర్గాల భూములను, ఇటు సైనికుడి భూమిని తవ్వేసిన ఈ బాబు ప్రభుత్వానికి సిగ్గూఎగ్గూ లేదా అనిపించింది. జై జవాన్‌.. జై కిసాన్‌ అని స్ఫూర్తి మంత్రం అందించిన మహనీయుడు లాల్‌ బహదూర్‌ శాస్త్రి గుర్తొచ్చారు. మరొకవైపు జవానునైనా, కిసానునైనా తమ అక్రమాల ఉక్కు పాదాల కింద నలిపేస్తున్న చంద్రబాబూ కనిపిస్తున్నాడు. ఒకే కుటుంబంలో మూడు తరాలు సైనికులుగా దేశానికి సేవలందించడం మనందరం గర్వించాల్సిన విషయం. అటువంటి కుటుంబం పట్ల ఈ తెలుగుదేశం ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించడం అత్యంత దారుణం. 

జపాన్, సింగపూర్‌ అంటూ మాటలతో మభ్యపెడుతున్న చంద్రబాబు నైజాన్ని, రాజధాని పేరుతో అడ్డగోలుగా దోచేస్తున్న వైనాన్ని వివరించారు.. మధ్యాహ్నం కలిసిన ఈ ప్రాంత నేతలు. ‘అవినీతి అమరావతి.. బాబు గారి భ్రమరావతి’ అంటూ రెండు ముక్కల్లో వివరించారు ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని. ఈ నాలుగేళ్లు వీసమెత్తూ అభివృద్ధి చేయకపోగా రూ.వేల కోట్ల రాష్ట్ర వనరులను, ఆస్తులను, భూముల్ని దోచుకుని రాష్ట్రాభివృద్ధిని కొన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టేయడం చాలా బాధ అనిపించింది.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న. రుణమాఫీ చేస్తానన్న మీరు... అప్పులడిగే హీన స్థితికి రాష్ట్రాన్ని తీసుకురావడం మీ చేతగానితనమా? మీ అసమర్థతా? మీ దోపిడీ ఫలితమా? ఒక వైపు రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రజల తలసరి అప్పు పెరుగుతూనే ఉంది. మరోవైపు మీ సొంత ఆస్తులు మాత్రం లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. మీరు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్నారు. ఇది దేనికి సంకేతం? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 
-వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top