124వ రోజు పాదయాత్ర డైరీ

124th day padayatra diary - Sakshi

30–03–2018, శుక్రవారం
సరిపూడి శివారు, గుంటూరు జిల్లా

ఆ లేఖలో నాన్నగారి సంతకంనా బాధ్యతలను మరోసారి గుర్తుచేసింది
ముస్సాపురం గ్రామం వద్ద ఓ చెల్లెమ్మ చెప్పిన కన్నీటి కథ మనసును కలచివేసింది. ఆ తల్లి మాటల్లో ఆర్థ్రత.. గుండె గొంతుకలో ఆత్మాభిమానం కనిపించాయి. ఉన్న అరెకరానికి తోడు కౌలు భూమిలో మిరప వేశారట. కలిసిరాని కాలం, గిట్టుబాటు కాని పంట.. ఆ కుటుంబాన్ని అప్పుల పాల్జేసిందట. ఏకంగా రూ.13 లక్షల అప్పు తీర్చడమెలాగో తెలియలేదు.. ఉన్న అరెకరం అమ్మినా రుణభారం మాత్రం వెంటాడుతూనే ఉందట. అప్పుల బాధల్లో కుటుంబ పరువు పోకూడదని తాపత్రయ పడింది. ఆఖరుకు తన కిడ్నీ అమ్మేసి, ఆ డబ్బును అప్పుకే జమేశానని ఆమె చెప్పినప్పుడు.. నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఇప్పుడు ఇంటిల్లిపాదీ కూలికెళ్తున్నామన్నా.. కిడ్నీ లేకపోవడంతో పని చేయలేకపోతున్నానంటూ ఆ తల్లి వెలిబుచ్చిన ఆవేదనతో గుండె బరువెక్కింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతీసారీ రైతన్న పరిస్థితి ఇదే. గతంలో తొమ్మిదేళ్ల ఆయన ఏలుబడిలో రెంటచింతలలో అప్పుల బాధతో అనేక మంది రైతన్నలు కిడ్నీలు అమ్ముకోవడం కలకలం రేపింది. అప్పుడు ఆ వార్త జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. మళ్లీ ఇప్పుడు ఆయనొచ్చాడు.. రైతన్నకు పుట్టెడు కష్టాలొచ్చాయి. ఏ రైతు ఇంటా ఈ బాధలు ఉండకూడదు. ప్రతి రైతన్న కుటుంబంలోనూ చిరునవ్వు తేవాలన్నదే నా లక్ష్యం.

ఏలినవారు విధి వంచితులను ఇంత మోసం చేస్తారా? చంద్రబాబు సర్కారు ఇంత నీచానికి తెగబడుతోందా? పేరేచర్లకు చెందిన త్రివేణి అనే చెల్లెమ్మ ఆవేదన విన్నాక నాకొచ్చిన అనుమానమిది. గత డిసెంబర్‌లో రేపూడి వద్ద ఆమె భర్త నడిపే ఆటోను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె భర్తతో పాటు మరో నలుగురు పదో తరగతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. యావత్‌ రాష్ట్రం ఇది విని అయ్యో పాపం.. అంది. శవరాజకీయం తెలిసిన తెలుగుదేశం మంత్రులు, నాయకులు ఆగమేఘాల మీద పరుగెత్తుకొచ్చారు. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల పరిహారం ఇప్పిస్తామన్నారు. డ్రైవర్‌ భార్యకు ఉద్యోగం ఇచ్చేదాకా నిద్రేపోనని టీడీపీ నాయకురాలు శపథం కూడా చేసిందట. ఇవన్నీ బాకా వేసుకుని టీడీపీ వాళ్లయితే బాగా పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడా తల్లి కన్నీటితో అసలు విషయం చెప్పే వరకూ.. ఈ సర్కారు నిజ స్వరూపం ఏంటో ఎవరికీ తెలియదు. ‘ఈ నాటికీ పైసా ఇవ్వలేదయ్యా.. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి శోష వస్తోంది కానీ ఎవరూ స్పందించడం లేదు’ అంటూ చిన్నారిని చంకనేసుకుని గుక్కపట్టి ఏడ్చిందా చెల్లి. చంద్రన్న బీమా పథకం కిందా ఆదుకోలేదన్నా.. కారణం అడిగితే ఏ అధికారీ చెప్పడం లేదంటూ బావురుమంది.

బతికే మార్గం లేక, బాధ వినే నాథుడే లేక తల్లడిల్లుతున్న ఆమెను ఏం చెప్పి ఓదార్చాలి? శవాల మీద పేలాలు ఏరుకునే ఈ ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించాలి? హామీలిచ్చి మోసపుచ్చడంలో చంద్రబాబు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈ నాయకులను ఏమనాలి? ఇలాంటి తల్లుల వేదనలు, రోదనల్లో ఈ సర్కారు ఎంత తొందరగా కొట్టుకుపోతే పేదలకు అంత త్వరగా న్యాయం జరుగుతుంది. ఆ రోజులు త్వరగా రావాలని.. కన్నీటి కథలకు తెరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పేదల బతుకుల కష్టాలతో బరువెక్కిన నా మనసుకు నాన్నగారి తీపి జ్ఞాపకాలు ఒకింత సాంత్వన కలిగించాయి. ఆ మహానేతను ఆరాధిస్తున్న 70 ఏళ్ల ఏరువ వెంకటకోటిరెడ్డితాత చెప్పిన మాటలతో మండుటెండలోనూ శీతల గాలులు వీచినట్టుగా అనిపించింది. ఎప్పుడో 1995 నాటి సంఘటన అది.. అప్పుడు నాన్నగారు పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నారు. ఆ తాత పొగాకు సహకార సంఘం ఆఫీసులో గుమాస్తాగా పనిచేసేవారట. పధ్నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఆయనను.. సొసైటీ నష్టాల్లో ఉందన్న నెపంతో ఉద్యోగంలోంచి తీసేశారట.

జీవనాధారం కోల్పోవడంతో బతకడమే కష్టమైందట. నాన్నకు చెబితే న్యాయం చేస్తారనేది ఆయన ఆశ. హైదరాబాద్‌ వెళ్లి నాన్నను కలిసి విషయం చెప్పి ఆదుకోవాలన్నాడు. ‘నేనెవరో నాన్నగారికి తెలియకున్నా.. నా కష్టం విని చలించిపోయాడు’ అని చెప్పాడు. ఉన్నతాధికారులకు లేఖ రాయడమే కాదు.. ఫోన్‌ చేసి మరీ చెప్పాడట. తను ఆఫీసుకెళ్లే సరికే అధికారులు తన కోసం వేచి చూస్తున్నారని, ఉద్యోగం ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేశారని.. నాన్నగారి మంచి మనసును పూసగుచ్చినట్టు చెప్పాడు. అప్పుడు ఆ మహానుభావుడు ఇచ్చిన లేఖను 23 ఏళ్లుగా పదిలంగా దాచుకున్నానంటూ ‘ఇదిగో ఇదేనయ్యా..’ అని చూపించాడు. ఆయన చూపించిన లేఖలో కనిపించిన నాన్నగారి సంతకం నా బాధ్యతలను మరోసారి గుర్తుచేసింది. జనం కోసమే జీవించాలన్న నా ఆకాంక్షను మరింత బలోపేతం చేసింది.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా మీరు అధికారంలో ఉన్నప్పుడల్లా ఎక్కువమంది రైతన్నలు కిడ్నీలు అమ్ముకోవడం, ఆత్మహత్యలకు పాల్పడటం వాస్తవం కాదా? వ్యవసాయం పట్ల మీ దృక్పథం, రైతన్నల పట్ల మీకున్న చిన్నచూపే ఇందుకు కారణం కాదంటారా?
-వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top