113వ రోజు పాదయాత్ర డైరీ

113th day Padayatra diary - Sakshi

15–03–2018, గురువారం
వల్లభరావుపాలెం,గుంటూరు జిల్లా

ప్రజలను మోసం చేయడానికే మీ సీనియారిటీ పనికొచ్చింది..
కసుకర్రులో దారిపక్కనే ఓ అన్న దీక్ష చేస్తూ కనిపించాడు. ప్రత్యేక హోదా కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడట. నన్ను చూడగానే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆక్రోశించాడు. రైతు కుటుంబానికి చెందిన ఆ అన్న పేరు పూల సుబ్రహ్మణ్యం. ప్రభుత్వాలు దిగొచ్చేవరకూ దీక్ష కొనసాగిస్తానని చెప్పాడు. ఆ అన్న పట్టుదల నన్ను ఆకట్టుకుంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. ప్రజలందరూ ఏకమై పోరాడితే ఎంతటి వారైనా దిగిరాక తప్పదు. ప్యాకేజీ పేరుతో మోసగించాలనుకున్న బాబు గారు.. ప్రజాగ్రహానికి తలొగ్గి, మాటమార్చి హోదా గళమెత్తడమే ఇందుకు నిదర్శనం. 

‘సార్‌.. మీ నాన్నగారి ఆరోగ్యశ్రీ వల్లే వీడికి రెండుసార్లు గుండె ఆపరేషన్‌ జరిగింది. దాదాపు రూ.3 లక్షల పైచిలుకు వైద్యం ఉచితంగా అందింది. నిజంగా వీడికి పునర్జన్మే. మీ నాన్నగారి పుట్టినరోజైన జూలై 8వ తేదీనే వీడూ పుట్టాడు. మీరన్నా, మీ కుటుంబమన్నా మాకు ప్రాణం. అందుకే వీడికి జగన్‌ అని పేరు పెట్టుకున్నాం’ అంటూ పెద్దపులుగువారి పాలేనికి చెందిన సముద్రాలన్న చెప్పాడు. తన కొడుకును పిలుచుకుని వచ్చి నన్ను కలిశాడు. పేదవాడికి మంచి చేస్తే ఎంతగా గుండెల్లో గుర్తుగా పెట్టుకుంటాడో కదా! 

వల్లభరావుపాలెం దాటాక దూరంగా పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళా కూలీలు పరుగు పరుగున వచ్చి నన్ను కలిశారు. ఆ అక్కచెల్లెమ్మలు ఆయాసపడుతూ నా దగ్గరకు రాగానే.. వారిని ఆప్యాయంగా పలకరించాను. వారి కష్టసుఖాలు చెప్పుకొన్నారు. వారిలో నాగమణి అనే ఓ అవ్వ కూడా ఉంది. ఆమె కథ నన్ను కదిలించింది. ఆ అవ్వ వయసు 65 సంవత్సరాలట. ‘నాయనా.. నా భర్తకు పోలియో. నా కూతురికేమో భర్త పోయాడు. ఆమె ఇద్దరు పిల్లల్ని నేనే సాకుతున్నా. నా బిడ్డకు వితంతు పింఛన్‌ కూడా రావడం లేదు’ అంటూ బాధపడింది. ‘గతేడాది రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని మినుము వేశాను. తలమాడు తెగులొచ్చి పంటంతా మాడిపోయింది. రూ.30 వేల దాకా నష్టం వచ్చింది. ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు. ఇప్పుడు కూలికి పోతున్నాను నాయనా’ అని చెప్పింది. అంత పెద్ద వయసులో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో, కష్టాలకు ఎదురీదుతున్న ఆ అవ్వకు ఎలాంటి చేయూత అందకపోవడం చాలా బాధనిపించింది. ప్రకృతి కన్నెర్ర ఓ వైపు, ప్రభుత్వ కర్కశత్వం మరోవైపు ఇలాంటివారి జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. రైతులే కూలీలుగా మారుతున్న దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యవసాయ సంక్షోభ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గ్రామీణాంధ్ర దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 

రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు సడలని పట్టుదలతో పార్లమెంటులో కదం తొక్కుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోరుతూ పాదయాత్ర నుంచి, నేను రాసి పంపిన లేఖలనందుకుని, సానుకూలంగా స్పందించిన పార్టీలకు ధన్యవాదాలు.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. 40 ఏళ్ల సీనియారిటీ అంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. మీ సీనియారిటీ ఆద్యంతం దేనికి ఉపయోగపడింది? నాడు వైస్రాయ్‌ హోటల్లో ఎమ్మెల్యేలను దాచి, పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించు కోవడానికా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికా? రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికా? ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ పేరుతో ఐదు కోట్ల మంది తెలుగు వారిని మోసం చేయడానికా?   
-వైఎస్‌ జగన్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top