112వ రోజు పాదయాత్ర డైరీ

112th day padayatra diary - Sakshi

14–03–2018, బుధవారం
పొన్నూరు శివారు,గుంటూరు జిల్లా

బాబుగారి పాలనలో ఉద్యోగాలు ఎండమావులు కాక మరేంటి? 
ఈ రోజు ప్రజా సంకల్ప యాత్ర 1,500 కిలోమీటర్లు దాటింది. ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆదరణ, నామీద పెట్టుకున్న నమ్మకం చూస్తుంటే.. వారి కోసం ఎన్ని వేల కిలోమీటర్లైనా అలుపెరుగక, అవలీలగా నడవగలననిపిస్తోంది. ఉదయం తొట్టెంపూడికి చెందిన రైతన్నలు తమ సేద్యంకష్టాలు చెప్పుకొచ్చారు. ‘అన్నా.. గతేడాది రెండో పంటగా మినుము వేసుకుంటే తలమాడు తెగులొచ్చి పంటంతా పోయింది. అందుకని ఈ సంవత్సరం రెండో పంటగా మొక్కజొన్న, జొన్న వేసుకున్నాం. కానీ కాల్వలకు నీళ్లు ఇవ్వడం లేదు. పోనీ, బోర్లు వేసుకుందామంటే.. కొత్త విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. అన్నింటినీ అధిగమించి చేతికొచ్చిన కొద్దిపాటి పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామంటే.. అక్కడ కొనుగోళ్లే తూతూమంత్రం.. దానిక్కూడా జన్మభూమి కమిటీ సిఫారసులు తప్పనిసరని చెబుతున్నారు. ఆ సిఫారసు లేకుండా వెళితే ఏదో ఒక సాకు పెట్టి తిరస్కరిస్తున్నారు. విధిలేక ఎంతోకొంతలే అనుకుని దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. టీడీపీ కార్యకర్తలే దళారీల అవతారమెత్తారు.. అధికారులు వారితో కుమ్మక్కయ్యారు. ఇక మేం బాగుపడేదెట్టా..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న వ్యక్తి కనుసన్నల్లోనే దళారీ రాజ్యం నడుస్తుంటే.. ఇక ఈ రైతన్నల గోడు ఆలకించేదెవరు?

ములుకుదురులో కలిసిన భవన్నారాయణ అనే కల్లుగీత కార్మికుడి కథ నన్ను కదిలించింది. ఆ సోదరుడు డిగ్రీ చదివాడట. సాఫ్ట్‌ బాల్‌ క్రీడలో జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నాడట. ఉద్యోగం కోసం చేయని ప్రయత్నమే లేదట. ఉద్యోగమూ రాక, నిరుద్యోగ భృతీలేక బతుకు బరువవుతుంటే.. విధిలేక కులవృత్తినే ఎంచుకున్నాడట. ఓ వైపు కల్లుగీస్తూ, మరో వైపు చదువుకుంటూ, పరీక్షలు పెట్టకపోతారా.. ఉద్యోగావకాశాలు రాకపోతాయా.. అని ఎదురుచూస్తున్నాడట. ఉద్యోగం రాకపోగా.. కనీసం కల్లుగీత లైసెన్స్‌ కూడా ఇవ్వడంలేదంటూ వాపోయాడు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలంటూ మభ్యపెడుతున్న బాబుగారి పాలనలో ఉద్యోగాలు ఎండమావులు కాక మరేంటి? 

చుండూరుపల్లికి చెందిన విజయమ్మ, శ్యామల, నవనీతం, బుజ్జి అనే మహిళలు.. ‘అన్నా.. మేం దళితులం. మేము ఎండనపడి కూలి పనులు చేసి, అంతో ఇంతో సంపాదించుకొస్తుంటే.. సాయంత్రానికి మా మగాళ్లు ఆ డబ్బు లాక్కెళ్లి బెల్టుషాపుల్లో పీకల దాకా తాగొస్తున్నారు. ఇంట్లో పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదు. ఆ దరిద్రపుగొట్టు బెల్టుషాపుల్ని మూసేయించండి’ అంటూ ఆవేదనతో చెప్పుకొన్నారు. మద్యం వల్ల కుటుంబాలకు కుటుంబాలు ఛిద్రమవుతుంటే.. ఆ పాపం పాలకులది కాక ఇంకెవరిది? మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తూ.. ఆ కిక్కులో మునిగితేలుతున్న ఈ ప్రభుత్వానికి ఈ అక్కచెల్లెమ్మల కన్నీళ్లు కనిపిస్తాయా?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని విధంగా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వృద్ధిరేటు ప్రతి ఏటా పెరుగుతోందంటూ గణాంకాలతో సహా గొప్పగా ప్రకటించారు. కానీ, మీ ఈ నాలుగేళ్ల పాలనలో సాగు విస్తీర్ణం ఏయేటికాయేడు గణనీయంగా తగ్గుతూపోవడం వాస్తవం కాదా? చేతికొచ్చిన పంటను.. ఉత్పత్తి వ్యయం కూడా రాకుండా అతి తక్కువ ధరలకు అమ్ముకుంటూ రైతు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోవడానికి కారణం మీరు కాదా? ఉత్పత్తులు మార్కెట్టుకు వచ్చే సమయానికి దళారీ వ్యవస్థ వల్ల.. చివరికి ఆక్వా రంగంలో కూడా రైతులకు ధరలు గిట్టుబాటు కాకుండా పోవడం నిజం కాదా? కాగా.. వృద్ధి రేటంటూ తప్పుడు లెక్కలు ప్రకటించడం ఎవర్ని మోసం చేయడానికి?
-వైఎస్‌ జగన్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top