కరోనా: ‘పార్టీకి పిలిచి 17 మందికి అంటించారు’

Coronavirus Super Spreader In Odisha 17 People Tested Positive - Sakshi

భువనేశ్వర్‌: కరోనా పాజిటివ్‌ మహిళ ఒకరు పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల్లో పాల్గొనడంతో 17 మందికి వైరస్‌ సోకింది. ఝార్సుగూడ జిల్లాలోని బ్రజ్‌రాజ్‌నగర్‌లో ఈ ఘటన వెలుగు చూసిందని అధికారులు ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3 కోవిడ్‌ కేసులు ఉండగా.. తాజా కేసులతో మొత్తం సంఖ్య 20కి చేరిందని కలెక్టర్‌ సరోజ్‌ కుమార్‌ సమాల్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జూన్‌ 14న ఓ మహిళ గురుగ్రామ్‌ నుంచి తన భర్త, కుమారుడితో కలసి ఝార్సుగూడలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమెకు కరోనా పాజిటవ్‌గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు చెప్పారు. కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌గా ప్రకటించారు.
(చదవండి: 'కరోనా నివారణకు ప్రత్యేక వ్యాక్సిన్‌ను కనుగొన్నాం')

అయితే, జూన్‌ 21న కుమారుడి పుట్టిన రోజు, తమ పెళ్లి రోజు కావడంతో ఆ దంపతులు శనివారం అర్ధరాత్రి వేడుక ఏర్పాటు చేశారు. పొరుగున ఉండే మూడు కుటుంబాలను ఆహ్వానించారు. వాటిలో సదరు పాజిటివ్‌ మహిళ కూడా పాల్గొనడంతో.. పార్టీల్లో పాల్గొన్న ఆ మూడు కుటుంబాల్లోని 17 మందికి కరోనా సోకింది. నిబంధనలు ఉల్లంఘించిన పాజిటివ్‌ వ్యక్తి, ఆమె బంధువుల కుటుంబాలపై విపత్తు నిర్వహణ చట్టం, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం కేసులు నమోదుచేశాం. ఈ ఘటనకు ముందు కోవిడ్‌ బెడద పెద్దగా లేకుండా జిల్లా అంతా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు కఠిన ఆంక్షలు అమలు చేయక తప్పదు’అని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. గత నెలలో కోరాపుట్‌ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పాజిటివ్‌ వ్యక్తి ఒకరు సోదరి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హోం క్వారంటైన్‌ నిబంధనలు తుంగలో తొక్కి పారిపోయాడు. అతను 28 మందితో కాంటాక్ట్‌ అయినట్టు అధికారులులు గుర్తించారు. కాగా,  ఒడిశాలో ఇప్పటివరకు 5160 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
(చదవండి: ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హై అలర్ట్‌!)

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top