లరియాపల్లి సర్పంచ్‌కు ముఖ్యమంత్రి అభినందనలు

Congratulations To The Lariapalli Sarpanch  - Sakshi

భువనేశ్వర్‌: సామాజిక సంస్కరణ ధ్యేయంగా లరియాపల్లి గ్రామస్తులు ముందడుగు వేశారు. మందుబాబుల్ని మంచోళ్లుగా మార్చేశారు. లరియాపల్లిని మత్తు రహిత గ్రామంగా ఆవిష్కరించారు. ఈ బృహత్తర సంస్కరణ ఆ గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపు సాధించింది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల ఆ గ్రామ సర్పంచ్‌ను  ప్రత్యేకంగా సత్కరించారు.

పశ్చిమ ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా బమొరా సమితి లరియాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ సుక్రి కుజూర్‌ని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం అభినందించారు. 

కేంద్రం గుర్తింపు గర్వకారణం

సంబల్‌పూర్‌ జిల్లా బమొరా సమితి లరియాపల్లి గ్రామ పంచాయతీని మత్తు రహిత పంచాయతీగా సంస్కరించిన గ్రామ సర్పంచ్‌ సుక్రి కుజూర్‌ అభినందనీయులంటూ నవీన్‌ పట్నాయక్‌ ప్రశంసించారు. కేంద్రప్రభుత్వం ఈ పంచాయతీ కృషిని గుర్తించడం గర్వకారణమన్నారు.

మారుమూల, అట్టడుగు ప్రాంతాల్లో అంకిత భావంతో చేసిన కృషి అత్యద్భుత ఫలితాల్ని సాధిస్తుందనేందుకు ఈ గ్రామస్తుల నిరవధిక చైతన్య కార్యక్రమాలు అద్దం పడుతున్నాయని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ట్విటర్‌లో ప్రసారం చేశారు. మద్యం, మత్తు పదార్థాల నివారణ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో విశేషంగా కృషి చేసిన తొలి 10 గ్రామ పంచాయతీల్లో లరియాపల్లి ఒకటి కావడం విశేషం.

  సంబల్‌పూర్‌ నుంచి 98 కిలోమీటర్ల దూరంలో ఉన్న లరియాపల్లి దళిత కుగ్రామం. బీదరికం–మద్యం ఈ గ్రామాన్ని చీడలా వేధించాయి. వర్షాధార పంట పొలాల్లో సాగు మీదనే గ్రామస్తులు ఆధారపడాలి. అటవీ ఉత్పాదనలతో ఉపాధి సమకూర్చుకోవాలి. ఇలా అష్ట కష్టాలతో సంపాదించిన చిరు మొత్తాలు తాగుడుకు వృథా చేసి ఇంటిల్లిపాదిని వెతలకు గురి చేయడంపట్ల గ్రామస్తులు తల్లడిల్లారు.

ఈ విచారకర పరిస్థితుల్ని నివారించేందుకు గ్రామ సర్పంచ్‌ సుక్రి కుజూర్‌కు భారత్‌ నిర్మాణ్‌ కార్యకర్తలు చూయూతనిచ్చారు. పంచాయతీలోని 1,101 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 720 ఇళ్లలో మందుబాబుల్ని గుర్తించారు. మరో 811 మంది గంజాయి, పొగాకు ఇతరేతర మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు అంగీకరించారు.

ఈ సర్వే ఆధారంగా గ్రామాన్ని మద్యం–మత్తు రహిత గ్రామంగా ఆవిష్కరించేందుకు సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కార్యకర్తలు ముందుకు వచ్చారు. గ్రామంలో పలు చైతన్య కార్యక్రమాలతో వ్యక్తిత్వ సంస్కరణ వర్క్‌షాపులను నిరవధికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలతో స్పందించిన 10 మంది మహిళలు స్వయం సహాయక బృందంగా ఉద్యమించారు. వాడవాడలా తిరిగారు.

మద్యం, మత్తు పదార్థాల విక్రయాలపై విజృంభించారు. నాటు సారా వగైరా అభ్యంతరకర పదార్థాల విక్రయాల నివారణే ధ్యేయంగా స్వయంకృషి చేశారు. వీరి ఉద్యమానికి వ్యతిరేకంగా మద్యం, గంజాయి, పొగాకు ఇతరేతర విక్రేతలకు జరిమానా విధించేందుకు ధైర్యం చేశారు. తొలిసారి పట్టుబడితే రూ.5 వేలు, మరోసారి పట్టుబడితే రూ.10 వేలు చొప్పున జరిమానాలను నిరవధికంగా విధించారు. కృషికి తగిన ఫలితాన్ని సాధించారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top