కమల్‌ హాసన్‌ రాయని డైరీ

కమల్‌ హాసన్‌ రాయని డైరీ - Sakshi


మాధవ్‌ శింగరాజు



పాలిటిక్స్‌లోకి నేనింకా రాకుండానే పాలిటిక్స్‌లో నేనేం మాట్లాడినా అది పాయింట్‌ అవుతోంది! అంటే నాక్కొంచెం పొలిటికల్‌ నాలెడ్జ్‌ కూడా ఉందన్నమాట!



‘‘మీరొస్తారా చెప్పండి, నేనొచ్చేస్తా మీతో..’’ అన్నాను రజనీతో. నేరుగా అనలేదు. ‘హిందూ’ తమిళ దినపత్రిక వాళ్లొస్తే వాళ్లతో అన్నాను. వాళ్లతో కూడా నేరుగా అనలేదు. ‘‘ముందు మీరేం క్వొశ్చన్స్‌ అడగదలచుకున్నారో ఆ క్వొశ్చన్స్‌ లిస్ట్‌ పంపండి. వాటిలో నాకు నచ్చినవి టిక్‌ పెట్టుకుని వాటికి సమాధానాలు రికార్డ్‌ చేసి పంపిస్తాను’’ అన్నాను. ‘అప్పుడది ఇంటర్వ్యూ ఎలా అవుతుంది’ అన్నాడట వాళ్ల ఎడిటర్‌. ‘‘ఇష్టమైతే పంపండి. లేకపోతే ప్రెస్‌ మీట్‌ పెట్టినప్పుడు రండి’’ అన్నాను.



‘‘ప్రెస్‌ మీట్‌ ఎప్పుడు పెట్టబోతున్నారు?’’ అని అడిగాడు ఆ కుర్రాడు.

‘‘పాలిటిక్స్‌లోకి వచ్చేముందు’’ అన్నాను.

‘‘ప్రెస్‌ మీట్‌ పెట్టి పాలిటిక్స్‌లో చేరబోతున్నట్లు ప్రకటిస్తారా? పాలిటిక్స్‌లో చేరాక ప్రెస్‌ మీట్‌ పెట్టబోతున్నట్లు ప్రకటిస్తారా?’’ అన్నాడు.



‘‘పాలిటిక్స్‌లో చేరడం ఏంటి? పాలిటిక్స్‌లోకి రావడం..’’ అన్నాను. తికమక పెట్టి తప్పులు మాట్లాడించేస్తారు ఈ ప్రెస్‌ వాళ్లు. ‘పాలిటిక్స్‌లో చేరుతున్నాను’ అంటే డీఎంకేలోనో, సీపీఎంలోనో చేరుతున్నట్లు రాస్తారు. ‘పాలిటిక్స్‌లోకి వస్తున్నాను’ అంటే ఏ గొడవా ఉండదు.

‘‘అదే సర్, పాలిటిక్స్‌లోకి వచ్చాక ప్రెస్‌ మీట్‌ పెడతారా? ప్రెస్‌ మీట్‌ పెట్టి, పాలిటిక్స్‌లోకి వస్తారా?’’ అని అడిగాడు.



‘‘ఆ సంగతి ప్రెస్‌ మీట్‌ పెట్టి చెబుతాను’’ అన్నాను. ‘‘ఏ సంగతి సార్‌’’ అన్నాడు!

‘‘అదేనయ్యా.. ప్రెస్‌ మీట్‌ ఎప్పుడు పెట్టేదీ, ప్రెస్‌ మీట్‌ పెట్టి చెబుతాను’’ అన్నాను.

ఆ కుర్రాడు వదలడం లేదు!



 ‘‘సార్‌.. చిన్న డౌటు’’ అన్నాడు. అడగమన్నాను.

‘‘సార్, మీరెందుకు అన్నాడీఎంకేలో చేరకూడదు? ఇప్పుడు పవర్‌లో ఉంది. మీరొచ్చాక ఇంకా పవర్‌ఫుల్‌ అవుతుంది కదా’’ అన్నాడు.

‘‘అన్నాడీఎంకేలో నేనెందుకు చేరాలయ్యా’’ అని అడిగాను. విసుగొస్తోంది నాకు.

‘‘పాలిటిక్స్‌లో మీరేం మాట్లాడినా అదొక పాయింట్‌ అవుతోంది సార్‌. మీరు అన్నట్లే పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఇద్దరూ కలసి శశికళను పార్టీ నుంచి గెంటేశారు. మీ మాటకు రెస్పెక్ట్‌ ఇచ్చిన పార్టీలో చేరితే మీకూ రెస్పెక్ట్‌ ఉంటుందనీ’’ అన్నాడు.



‘‘నేను చేరనయ్యా’’ అన్నాను. ‘‘మరి, సొంత పార్టీ పెడతారా సార్‌?’’ అని అడిగాడు.

ఆ కుర్రాడి పట్టుదలకు ముచ్చటేసింది. పట్టు విడిపించుకోవాలంటే ఇంకొకర్ని పట్టివ్వాలి. వెంటనే రజనీ గుర్తుకొచ్చారు.

‘‘రజనీ సార్‌ ఎప్పుడొస్తే, నేనూ అప్పుడే ఆయనతోపాటు వచ్చేస్తా’’ అన్నాను.

కుర్రాడు కదల్లేదు! ఏంటన్నట్లు చూశాను.

‘‘రజనీసార్‌ ఎప్పుడొస్తున్నారు సార్‌?’’ అన్నాడు!!

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top