ఎన్నారై చేతిలో మోసపోయిన యువతి


ఎన్నారై చేతిలో ఘోరంగా మోసపోయిన ఓ మహిళ ముషీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సొమవారం అత్తమామలతో పాటు మరిదిని అరెస్టు చేశారు. ఆడపడుచుల కోసం గాలిస్తున్నారు. విదేశాల్లో ఉన్న భర్తను రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. రాంనగర్‌లోని హరినగర్‌కు చెందిన హారిక వివాహం అమెరికాలోని న్యూజెర్సీలో ఉండే ఎన్‌ఆర్‌ఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజినీకాంత్‌రెడ్డితో 2010 ఏప్రిల్ 10న జరిగింది. కట్నంగా రూ. 40 లక్షలు, పెళ్లి ఖర్చులకు మరో రూ.20 లక్షలతో పాటు కేజీ బంగారం, ఆరు కేజీల వెండి, సహా లాంఛనాలు అందుకున్నాడు.


 


వివాహమైన రెండో రోజు నుంచే భర్త రజినీకాంత్‌రెడ్డి, అత్త మామలు అచ్చిరెడ్డి రాజమణి, ఆడపడుచులు సునీత, మంజులు హారికను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. అందరి ముందు కింద కూర్చోబెట్టడం, పని మనిషి కన్నా హీనంగా చూడటం చేసేవారు. ఇదిలా ఉండగా... 2010 జూన్ 17న రజనీకాంత్ రెడ్డి అమెరికా వెళ్లిపోయాడు. హారికనూ తీసుకెళుతానని చెప్పినా అలా చేయలేదు. హారిక విజిటింగ్ వీసా మీద వస్తానని చెప్పడంతో అప్లికేషన్‌ను తప్పుగా నింపి పత్రాలు పంపి ఆమె రాక ఆలస్యం చేశాడు. ఎట్టకేలకు 2011 ఏప్రిల్ 4న హారిక తన అన్నల సహాయంతో వెళ్లింది.


 


అమెరికాలోని భర్తను హారిక తొలిపెళ్లి రోజున కలిసింది. ఆమెను ఈసడించుకున్న భర్త ఎందుకొచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లోంచి గెంటేశాడు. పరాయి దేశంలో, కట్టుకున్న భర్తే ఇంట్లోకి రానీయకుండా వెళ్లగొట్టడంతో హారిక తీవ్ర మనోవేదనకు గురైంది. ఎలాగైనా భర్తతో కాపురం చేయాలని భావించి అన్నల సహాయంతో ఆరు నెలల పాటు అమెరికాలోనే ఉండి భర్త పిలుపు కోసం ఎదురు చూసింది. ఆపై హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. అమెరికాలో భార్యాభర్తలు ఆరు నెలల పాటు ఎడబాటుగా ఉంటే విడాకులు తీసుకొచ్చానే చట్టాన్ని ఆసరాగా చేసుకొన్న రజనీకాంత్ రెడ్డి విడాకుల కోసంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


వేధింపులు తార స్థాయికి చేరడంతో హారిక భర్తతో పాటు ఆత్తమామలు, ఆడపడుచులపై ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నమ్మక ద్రోహం, మోసం ఆరోపణలపై అత్తమామలు, సిద్దంకి రాజమణి, అచ్చిరెడ్డి, మరిది కృష్ణారెడ్డి, ఆడపడుచులు చింతల మంజుల, సునీతలపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన ఎస్సై అశోక్ నాయక్ సోమవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట గ్రామానికి వెళ్లి అత్తమామలు, మరిదిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆడపడుచుల కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా వారిని విడిపించేందుకు మంత్రులు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్, ఎస్సైలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top