భారతీయ ఐటీ కంపెనీలపై ట్రంప్‌ దెబ్బ

Trump Blow On Indian IT Companies - Sakshi

హెచ్‌1బీ వీసా నిర్వచనాల సవరణ

హెచ్‌4 వర్క్‌ పర్మిట్ల రద్దు ఖాయం

ఫాల్‌ అజెండాలో స్పష్టం చేసిన అమెరికా ప్రభుత్వం

వేల మంది భారతీయులు, భారత కంపెనీలపై ప్రభావం

హెచ్‌–1బి, హెచ్‌–4 వీసాల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం తీసుకోనున్న కఠిన నిర్ణయాలు అమెరికాలోని పలు భారతీయ ఐటీ కంపెనీలపైన, లక్షల మంది భారతీయులపైన తీవ్ర ప్రభావం చూపనున్నాయి.అమెరికా ప్రభుత్వంహెచ్‌–4 వీసాదారులకు ఇస్తున్న వర్క్‌ పర్మిట్లను రద్దు చేయడం ఖాయమని తేలిపోయింది. అలాగే, హెచ్‌1బి వీసా నిర్వచనాన్ని , నిబంధనలను కూడా వచ్చే జనవరిలో సవరించనున్నట్టు అమెరికా హోంల్యాండ్‌ అండ్‌ సెక్యూరిటీ(డిహెచ్‌ఎస్‌) విభాగం ఇటీవల విడుదల చేసిన యూనిఫైడ్‌ ఫాల్‌ అజెండాలో పేర్కొంది. అమెరికా కార్మికులకు మరింత ప్రయోజనం కలిగేందుకు, అత్యుత్తమ ప్రతిభ కలిగిన విదేశీయులకే అమెరికాలో ఉద్యోగం లభించేలా చూసేందుకు ఈ సవరణలు చేయనున్నట్టు హెచ్‌డిఎస్‌ ఆ అజెండాలో స్పష్టం చేసింది.

దాని ప్రకారం హెచ్‌1బీ వీసాకు సంబంధించిన ఉద్యోగం అంటే ఏమిటి, ఉద్యోగి–యాజమని మధ్య సంబంధం, ప్రత్యేక ఉద్యోగాలు అన్న అంశలకు సంబంధించిన నిర్వచనాలను సవరించనుంది.అంతేకాకుండా హెచ్‌1బీ వీసాదారులకు తగిన వేతనాలు లభించే అవకాశం కూడా లభిస్తుంది.ఈ సవరణల వల్ల అమెరికా కార్మికుల ప్రయోజనాలు రక్షించబడతాయని ప్రభుత్వం చెబుతోంటే, అమెరికాలోని పలు భారతీయ ఐటీ కంపెనీలు, భారతీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న చిన్న, మధ్యతరహా కంపెనీలు ఈ సవరణలతో ఇబ్బందులు పడతాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్యం చేస్తున్నారు. మరోవైపు ట్రంప్‌ సర్కారు తలపెట్టిన ఈ హెచ్‌1బీ సవరణలపై భారత ప్రభుత్వం ట్రంప్‌ ప్రభుత్వాధికారులతో మాట్లాడుతోంది.

వర్క్‌ పర్మిట్ల రద్దు ఖాయం
హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు సంతానానికి హెచ్‌4వీసాలు మంజూరు చేస్తారు.ఈ వీసా పొందిన వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం నిబంధన తెచ్చింది. ప్రస్తుతం ఈ నిబంధనతో 70వేల మందికి పైగా భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు.ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిబంధనలను ఎత్తివేయనున్నట్టు ప్రతిపాదించింది.అయితే, ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీని మూడు సార్లు వాయిదా వేసింది. తాజాగా విడుదల చేసిన ఫాల్‌ అజెండాలో కూడా ఈ నిబంధన ఎత్తివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేసింది.హెచ్‌4 వీసా వర్క్‌ పర్మిట్‌ నిబంధనను తొలగిస్తే వేల మంది భారతీయ మహిళలకు బదులు అదే సంఖ్యలో అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయని డిహెచ్‌ఎస్‌ అంచనా వేసింది.అయితే, ఈ నిబంధనను తొలగించే నిర్ణయం తీసుకోవద్దని డెమెక్రాట్‌ పార్టీ మహిళా సెనెటర్లు కమల హారిస్, కిర్‌స్టెన్‌ గిల్లిబ్రాండ్‌లు ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిబంధనను ఎత్తివేస్తే వేల మంది మహిళలు నిరాశ నిస్పృహలకు గురవుతారు. ఒంటరితనాన్ని అనుభూతి చెందుతారు. అత్మ విశ్వాసాన్ని కోల్పోతారు.వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తే వారు, వారి పిల్లలు కూడా భర్తపైనే ఆధారపడాల్సి వస్తుంది.ఇది వారి దాంపత్యంలో. జీవితాల్లో అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తుంది.అని ప్రభుత్వానికి రాసిన లేఖలో సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.అయినప్పటికీ ట్రంప్‌ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేదని ఫాల్‌ అజెండా ద్వారా స్పష్టమయింది.

ప్రత్యేక ఉద్యోగాల నిర్వచనం సవరణ
ఇక హెచ్‌1బీ వీసా విషయానికి వస్తే...ఈ వీసా పరిధిలో ఉద్యోగం, ప్రత్యేక ఉద్యోగాలు అన్న అంశాల నిర్వచనాన్ని సవరించనుంది. ఈ సవరణలు అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలకు సాంకేతిక నైపుణ్యం కల విదేశీయులు దొరకడం దుర్లభమవుతుంది. ఈ నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు గత కొన్ని నెలలుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.తమ ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు దారులు వెదుకుతున్నాయి.

1990లలో హెచ్‌1బీ వీసా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగం, ఉద్యోగి–యజమాని సంబంధం, ప్రత్యేక ఉద్యోగం వంటి అంశాల నిర్వచనాలపై సమస్య వస్తూనే ఉంది.తాజా ప్రతిపాదనల వల్ల హెచ్‌1బి కింద అత్యుత్తమ నైపుణ్యం కలిగిన విదేశీయులను పొందడానికి వీలవుతుంది.అలాగే, అమెరికా కార్మికులకు ఉద్యోగ, వేతన భద్రత కల్పించబడుతుంది.అంతే కాకుండా హెచ్‌1బీ వీసాదారులకు సరైన వేతనాలు ఇచ్చేలా కంపెనీల మెడలు వంచడానికి ఈ సవరణలు ఉపయోగపడతాయి.అని డిహెచ్‌ఎస్‌ ఫాల్‌ అజెండాలో పేర్కొంది.ప్రస్తుతం  హెచ్‌1బీ వీసాలు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ విభాగం కిందకి వస్తాయి.

తమకు అవసరమైన సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యం కలిగిన విదేశీయులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలకు ఈ వీసా వీలు కల్పిస్తుంది.ఈ హెచ్‌1బీ వీసా కాంట్రాక్టు మూడేళ్లు ఉంటుంది. తర్వాత మరికొంత కాలం పొడిగించవచ్చు.అయితే ఈ పొడిగింపు ఆరేళ్లకు మించకూడదు.ఏటా ప్రభుత్వం 65 వేల వరకు హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తుంది.అయితే, ప్రభుత్వం విధించిన పరిమితికి మించి కంపెనీలు ఈ వీసా కింద విదేశీయులను రప్పించుకుంటున్నాయి.దాన్ని నియంత్రించడం కోసం ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని తేనున్నట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యుఎస్‌సిఐఎస్‌) తెలిపింది.


భారత్‌ సంప్రదింపులు
హెచ్‌4, హెచ్‌1బీ వీసాల విషయంతో ట్రంప్‌ కఠిన నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో ఈ విషయాలపై ట్రంప్‌ ప్రభుత్వంతో,అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత విదేశాంగ ప్రతినిధి తెలిపారు. హెచ్‌1బీ వీసా విషయంలో అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అక్కడి భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.దాంతో ఈ విషయంపై ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇటీవల అమెరికా, భారత్‌ మధ్య జరిగిన చర్చల్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.హెచ్‌1బీ వీసా నిబంధనల సవరణకు సంబంధించి ట్రంప్‌ సర్కారు చాలా బిల్లులు తెచ్చింది.అయితే, వాటిలో ఒక్కటి కూడా ఇంత వరకు ఆమోదం పొందలేదు.’అని విదేశాంగ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ చెప్పారు.

ఫాల్‌ అజెండా అంటే....
అమెరికా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు యూనిఫైడ్‌ ఫాల్‌ అజెండాను విడుదల చేస్తుంది. విధాన నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తీసుకున్న చర్యల వివరాలు ఈ అజెండాలో పేర్కొంటారు. ఈ అజెండాలో ఉన్న ప్రతిపాదనలు ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుంది.              
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top