సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Singapore Telugu Samajam Celebrate Sankranti - Sakshi

సింగపూర్‌ : సింగపూర్ తెలుగు సమాజం వారు అనాదిగా నిర్వహించే సంక్రాంతి పండుగ ఈ ఏడాది జనవరి 26 న (శనివారం) స్థానిక గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్మార్ట్ క్యాంపస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.  మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ద్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా  నిర్వహించింది. బొంగరాలు, గోళీలు, గాలిపటాలు, రంగవల్లుల పోటీలు , మగువలకు-బాలబాలికలకు-దంపతులకు వివిధ సాంప్రదాయ ప్రాచీన క్రీడలు నిర్వహించి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతుల తో పాటు ప్రశంసాపత్రాలను అందించారు. హరిదాసు, సోది మరియు పిట్టలదొర ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి తెలుగు వారందరినీ అలరించారు. 

తదుపరి ప్రారంభమైన సాంసృతిక కార్యక్రమాలలో సమకాలీన పరిస్ధితులపై ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం యడవల్లి శ్రీదేవి బుర్రకదా బృందం వారిచే బుర్రకథా కాలక్షేపం అత్యంత ఆదరణ పొందింది. భరతనాట్య ప్రదర్శనలు, గోదారోళ్ళమండి ఏకపాత్రాభినయం, చిన్నారులచే సాంప్రదాయ దుస్తుల ప్రదర్శన మరియు సింగపూర్ తెలుగు వారిచే ఎన్నో మరెన్నో పాట-నాటిక-నృత్య ప్రదర్శనలు మొదలగు సాంసృతిక కార్యక్రమాలు ఇక్కడి తెలుగు వారిని అలరించి రంజింపజేశాయి. తెలుగు బుట్టబొమ్మలకొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.
 
ఈ సంబరాలలో సింగపూర్ కాలమానంలో గుణించిన సింగపూర్ తెలుగు 2019 క్యాలెండెర్ ను ఆవిష్కరించారు. సింగపూర్ లో మొట్ట మొదటి సారిగా మన రేడియో వారి భాగస్వామ్యంతో తెలుగు వారికి ప్రత్యేకంగా STS మన రేడియో ని ప్రారంభించారు. అచ్ఛమైన సంక్రాంతి తెలుగు పిండివంటలు, వంటకాలతో కూడిన భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. మన భాష, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కేవలం భాషణలకే పరిమితం కాకుండా, ఆచరణ లో చూపించాలని అధ్యక్షులు కోటిరెడ్డి గారు కోరారు. కార్యక్రమ నిర్వాహకులు నాగేష్ టేకూరి మాట్లాడుతూ ఇటీవల భోగి పండుగ సందర్భంగా సుమారు వెయ్యి మందికి రేగుపండ్ల ప్యాకెట్స్ ని ఉచితంగా పంపిణీ చేసి మన భోగిపళ్ళ సంప్రదాయాన్ని ప్రోత్సహించామని తెలిపారు. ఆహ్లాదభరితంగా జరిగిన ఈకార్యక్రమంలో పాల్గొన్న  వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు , కార్యవర్గానికి , కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలను తెలియజేసారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top