పూరీ దేవస్థాన సేవాయత్‌పై ఇటలీ దేశస్తురాలి ఫిర్యాదు


పూరీ దేవస్థాన సేవాయత్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి పద్మశ్రీ ఇలియానా సితారిస్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటలీకి చెందిన సితారిస్టి ఒడిశా సంప్రదాయ నృత్యం ఒడిస్సీ నిష్ణాతురాలు. చాలాకాలం క్రితమే ఒడిశాలో స్థిరపడిన ఆమె.. దేశానికి వన్నె తెచ్చిన నృత్యకారిణిగా గుర్తింపు పొందారు. దీనికగాను కేంద్రప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఒడిశా సాంస్కృతిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె ఆదివారం జగన్నాథుడిని దర్శించుకునేందుకు పూరీ వచ్చారు. అందరితో కలిసి రథంపైకి వెళ్లిన ఆమెను గమనించిన సేవాయత్.. జగన్నాథుడిని తాకేందుకు రూ. వెయ్యి ఇవ్వాలని పట్టుబట్టాడు.


 


ఒడిశా ఆచార, వ్యవహారాలు తెలిసిన సితారిస్టి అందుకు నిరాకరించారు. నామమాత్రంగా రూ. 20 చెల్లించి వెనుదిరగబోయారు. ఈ సమయంలో దైతపతి సేవాయత్ ఆమె తలపై మూడుసార్లు కొట్టాడు. అప్పటికీ అతను అడిగిన మొత్తాన్ని ఆమె చెల్లించలేదు. దీంతో సేవాయత్ ‘విదేశీయురాలు’ అని అరుస్తూ వివాదం లేవనెత్తే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన సితారిస్టి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దైతపతిపై ఫిర్యాదు చేశారు. నవ దినాత్మక యాత్ర సుఖాంతమవుతుందనుకునే దశలో చెలరేగిన ఈ వివాదం అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై దైతపతి నియోగుల సంఘ అధ్యక్షుడు రామకష్ణ దాస్ మహాపాత్రో విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని దేవస్థాన పాలనాధికారి ఆదేశించారు.


 


కాగా, విదేశీయుడిని వివాహం చేసుకున్న ఒడిశా ఆడపడుచు గత ఏడాది భర్తతో రథంపైకి ఎక్కడంతో వివాదం రేగింది. దీంతో ఈ ఏడాది నుంచి రథాలపై శ్రీఅంగ స్పర్శ దర్శనాన్ని నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే దైతపతులు, ఇతర వర్గాల ఒత్తిడితో దీనిని తాత్కాలికంగా వాయిదా వేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top