అలిపిరి దాడి మీరే జరిపించుకున్నారా?

Dallas NRIs condemn attack on YS Jagan Mohan Reddy - Sakshi

డల్లాస్‌ :  వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ డల్లాస్‌ విభాగాం రీజినల్ ఇంచార్జీ కృష్ణ కోడూరు ఖండించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్ష నాయకునికే రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఇక సామాన్య ప్రజానికానికి ఎలా రక్షణ కల్పిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మహిళకి, దళితులకి, అణగారిన వర్గాలకి రక్షణ కరువయిపోయిందని, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ పక్షాన నిలబడి ప్రజల హక్కులని కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షిత ప్రాంతంగా భావించే అంతర్జాతీయ విమానాశ్రయంలోనే హత్యాయత్నం జరిగితే ఇక రక్షణ లేని బహిరంగ ప్రదేశాలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉందని ఎన్‌ఆర్‌ఐలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
 

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీద హత్యాయత్నం జరిగితేనే ఖండించని ముఖ్యమంత్రి, అతని మంత్రిమండలి సభ్యులు వెకిలి చేష్టలతో ప్రవర్తించడం జుగుప్సాకరంగా ఉందని ఎన్‌ఆర్‌ఐలు అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి దిగజారి ప్రవర్తించారని విమర్శించారు. అంతే కాకుండా పక్క రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, ఏఐఎమ్‌ఐఎమ్‌అధ్యక్షులు ఒవైసీ, తెలంగాణా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్‌పీ నాయకుడు జానా రెడ్డిలు ఈ దాడిని ఖండించడంతో పాటు ప్రతిపక్ష నాయకున్ని పరామర్శిస్తే వాటిని ముఖ్యమంత్రి, తన క్యాబినెట్ మంత్రులు తప్పుపట్టడం దారుణమన్నారు.

ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర డీజీపీ ఠాకూర్ కూడా తన స్థాయిని దిగజార్చుకొని కేసును పక్క దారి పట్టించడానికి హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి పలానా కులమని, పలానా పార్టీ అభిమాని అని ఒక తెలుగు దేశం కార్యకర్త లాగా ప్రవర్తించడం దారుణమని విమర్శించారు. ఠాకూర్ పోలీస్ పదవికి తగడని తన పదవికి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుని మీద హత్యా ప్రయత్నం జరిగితే నిజాయితీగా, నిష్పక్ష పాతంగా విచారణ జరపాల్సిన ప్రభుత్వం, డీజీపీ తమ బాధ్యత, స్థాయిని దిగజార్చుకొని ప్రవర్తిస్తున్నారని ఎన్‌ఆర్‌ఐలు నిప్పులు చెరిగారు.

గవర్నర్ నరసింహన్‌ డీజీపీని మిగిలిన అధికారులని దాడికి సంబంధించి విషయాలను అడిగి తెలుసుకుంటే చంద్రబాబుకు ఉలికిపాటు ఎందుకన్నారు. చంద్ర బాబు గవర్నర్ అధికారాల గురుంచి మాట్లాడి, గవర్నర్ ఎవరని అడగడం చూస్తే ఈ హత్యా ప్రయత్నం వెనక రాష్ట్ర ప్రభుత్వం, చంద్ర బాబు, డీజీపీ ఉన్నారనిపిస్తోందని, లేకపోతే ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో ప్రజలకి చెప్పాల్సిన అవసరముందని ఎన్‌ఆర్‌ఐలు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు.

గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నపుడు అలిపిరి దగ్గర నక్సలైట్లు హత్యా ప్రయత్నం చేసినపుడు అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు, దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పరామర్శించడమే కాకుండా, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఒకరోజు ధర్నా చేసి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకోవడమే కానీ, మీ ప్రవర్తన ముఖ్యమంత్రి స్థాయిలో లేదని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని చూసైనా నేర్చుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి మీద తన అభిమానే దాడి చేశాడని, ఇది ఒక రాజకీయనాటకం అని అంటున్న చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అలిపిరి నక్సలైట్ల దాడి మీరే జరిపించుకున్నారా? ఆ నక్సలైట్లు మీ అభిమానులేనా? అంటూ ధ్వజమెత్తారు. ఇటీవల మీ పార్టీకి చెందిన శాసన సభ్యులు కిలారి, మాజీ శాసన సభ్యులు సోమని మీ పార్టీ అభిమానులే చంపేశారా? వీటన్నికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరముందని ఎన్‌ఆర్‌ఐలు ముఖ్యమంత్రి చంద్ర బాబుని ప్రశ్నించారు.

అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్న చంద్రబాబు నాయుడు, మరి గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా విశాఖ పట్టణంలో జరిగిన క్యాండిల్ ర్యాలీకి మద్దతు తెలపడానికి వస్తున్న వైఎస్‌ జగన్‌ని రన్ వే పైనే అరెస్ట్ చేసి ప్రత్యేక ఉద్యమంలో పాల్గొనకుండా నిర్భంధించింది రాష్ట్ర ప్రభుత్వం కాదా అని ఎన్‌ఆర్‌ఐలు ప్రశ్నించారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుని మీద జరిగిన హత్యాయత్నంపై  చంద్రబాబు స్పందన చూసిన తర్వాత ప్రభుత్వం గానీ, డీజీపీ గానీ బాధ్యతగా వ్యవహరించి బాధ్యులని కఠినంగా శిక్షించే పరిస్థితులు లేవన్నారు. హత్యా ప్రయత్నం విమానాశ్రయంలో జరిగింది కాబట్టి తమ పరిధి కాదని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని సుప్రీం కోర్టు జడ్జితో లేదా సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులని కఠినంగా శిక్షించి రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top