మేమెందుకు ఓటేయాలో చెప్పండి!

why do we vote, asked people from Haryana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హర్యానాలోని గురుగావ్, ఫరిదాబాద్‌లోని వెనకబడిన ప్రాంతాలను విడదీసి మెవత్‌ జిల్లాను 2005లో ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో 84 గ్రామాలు ఉన్నాయి. ఢిల్లీకి సమీపంలో పారిశ్రామికంగా ఎంతగానో అభివద్ధి చెందిన గురుగావ్‌ నుంచి తమను విడదీసినందుకు ఈ గ్రామాల ప్రజలు ఎంతగానో బాధ పడుతున్నారు. అభివద్ధి కోసం తమ జిల్లాను ఏర్పాటు చేశామని చెబుతారుగానీ తమకు అభివద్ధి జాడ ఎక్కడా కనిపించడం లేదని వారు వాపోతున్నారు. గురుగావ్‌ జిల్లాలో కలిసి ఉన్నప్పుడు తమ భూములకు చాలా విలువ ఉండేదని, ఎకరం రెండున్నర కోట్లు పలికేదని, ఇప్పుడు సగానికి సగం కూడా పలకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం 2016లో గురుగావ్‌ను గురుగామ్‌గా, మెవత్‌ జిల్లాను నూహ్‌ జిల్లాగా మార్చింది. అయినప్పటికీ తమ జిల్లా జాతకంలో ఎలాంటి మార్పు రాలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలలో ఒక వర్గమైన మెవోలు 80 శాతం మంది ఉండడం వల్ల ఈ జిల్లాకు మెవత్‌ అని పేరు వచ్చిందని, ముస్లిం తెగ పేరు ఉండడం ఇష్టం లేక బీజేపీ ప్రభుత్వం పేర్చు మార్చిందని స్థానికులు చెబుతారు. పేరు మార్చి మూడేళ్లు అవుతున్నా ప్రజలు ఇప్పటికీ గురుగావ్, మెవత్‌ అనే పిలుస్తున్నారు. మెవత్‌ జిల్లా గురుగావ్‌ పార్లమెంటరీ నియోజక వర్గం పరిధిలోకే వస్తోంది. మే 12వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. 

అన్నింటా వెనకబాటు
రాష్ట్రంలోకెల్లా మెహత్‌లో మహిళలు, పిల్లలు పౌష్టికాహారం లోపంతో బాధ పడుతున్నారని 2015–16లో జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే నివేదిక తెలియజేస్తోంది. విద్యా, జీవన ప్రమాణాల్లో కూడా మెవత్‌ చాలా అధ్వాన్న స్థితిలో ఉందని గురుగావ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘సెహగల్‌ ఫౌండేషన్‌’ వెల్లడించింది. నేరస్థుల ముఠాలు, దొంగ తుపాకుల అలజడి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని దేశంలోకెల్లా ‘బ్యాడ్‌ ల్యాండ్‌’గాను వర్ణించింది. 2018లో ఈ జిల్లాపై కేంద్రం ప్రత్యేక దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. 

మెవత్‌లో ఏడాదికి తలసరి ఆదాయం 27,791 రూపాయలు, గురుగావ్‌లో తలసరి ఆదాయం 3,16,512 రూపాయలు ఉందని ‘రీజనల్‌ డిస్పారిటీస్‌ వితిన్‌ ది హర్యానా’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం 2014లో విడుదల చేసిన ఓ నివేదిక పేర్కొంది. ఈ జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిల్లాపై చిన్న చూపు చూస్తున్నట్లు ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మెవత్‌ జిల్లాలో ఒక్కటే ప్రధాన రోడ్డు. రోడ్డు పక్కన దుకాణాలు, కనీసం రెండంతస్తుల భవంతులు కూడా లేవు. ఈ జిల్లాకు పొరుగు జిల్లాల నుంచి ఎవరూ పిల్లను ఇవ్వరు, పిల్లను చేసుకోరు. ఒక విధంగా ఈ జిల్లాదే వెలి బతుకే. 

ఆ పక్కనే ఆకాశ హర్మ్యాలు
అదే సమీపంలోని  గురుగావ్‌ నుంచి వెడల్పైన జాతీయ రహదారి వెళుతుంది. దాకిని ఇరువైపుల ఆకాశాన్నంటే ఎల్తైన భవనాలు కనిపిస్తాయి. అద్దాలు, క్రోమోలతో కూడిన లగ్జరీ కార్ల డీలర్‌షిప్పు భవనాలు తళతళలాడుతుంటాయి. మైల్‌స్టోన్‌ ఎక్స్‌పీరియన్‌ సెంటర్, పార్క్‌ సెంట్రా, ఓరిస్‌ ఫ్లోరల్‌ టవర్స్‌ పేరిట వివిధ రకాల షాపింగ్‌ సెంటర్లు కనిపిస్తాయి. ఇంతటి జిల్లా నుంచి అభివద్ధి కోసం కాకుండా తమను వెలివేయడానికే విడదీసి ఉంటారని మెవత్‌ ప్రజలు భావిస్తున్నారు. అందుకనే తాము ఎవరికి ఓటు వేయాలని, ఎందుకు ఓటు వేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఎవరు కూడా మే 12న జరిగే పోలింగ్‌ పట్ల ఉత్సాహం చూపించడం లేదు. 

గురుగావ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఈసారి బీజేపీ అభ్యర్థిగా రావు ఇంద్రజిత్‌ సింగ్, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అజయ్‌ సింగ్‌ యాదవ్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, జన్నాయక్‌ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా 64 ఏళ్ల మెహమూద్‌ ఖాన్‌ పోటీ చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్న మెహమూద్‌ ఖాన్‌ మెవద్‌ జిల్లాకు చెందిన వ్యక్తయినప్పటికీ ఆయన పట్ల కూడా ప్రజలు విశ్వాసం చూపించడం లేదు. అహ్మదాబాద్‌లో ఐఐఎం చదివి, లండన్, మంగోలియాలో పలు భవంతలు కలిగిన ఆయనకు తమ ప్రాంతం పట్ల ప్రేమ ఎందుకు ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. అయితే ఆయన మాత్రం గురుగావ్‌–మెవత్‌ల మధ్యనున్న తేడాను రూపుమాపుతానంటూ ప్రచారం చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top