‘యాక్‌.. మేం ఫ్రిజ్‌లలో పెట్టుకుంది దాన్నా..!’

When stink fell from the sky - Sakshi

సాక్షి, గురుగ్రామ్‌ : ఓ వ్యక్తికి ఓ వింత వస్తువు దొరికిందంటే బహుశా అది చాలా విలువైనదై ఉండొచ్చని ఆశపడతాడు. ఎవరికీ కనిపించకుండా భద్రంగా దాచుకొని మెల్లిగా దానికి సంబంధించిన వివరాలు సేకరించుకొని అమ్ముకునేందుకు ఆరాటపడతాడు. కానీ, తనకు దొరికిన ఆ వస్తువు దేనికి పనికిరాదని, చెత్త వస్తువని తెలిస్తే అతడు ఎంతటి నిరాశకు గురవుతాడో చెప్ప వీలుకాదు. ఇప్పుడు ఇలాంటి అనుభవమే గురుగ్రామ్‌ పరిధిలోని ఫజిల్‌ బద్‌లీ అనే గ్రామంలోని వారందరికీ ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. రజ్బీర్‌ యాదవ్‌ అనే రైతు శనివారం ఉదయం తన పొలంలోకి వెళ్లాడు. అదే సమయంలో ఒక పెద్ద బండరాయిలాంటిది తన ముందే గోధుమ పొలంలో పడింది. ఆ సమయంలో భారీ శబ్దం కూడా వచ్చింది.

అక్కడికి కాసేపట్లోనే అదేమిటా అని చాలా మంది చూడటానికి వచ్చారు. ఈ విషయం చుట్టుపక్కలవారికి కూడా తెలిసి పెద్ద మొత్తంలో గోధుమ చేనుకు క్యూకట్టారు. అయితే, అక్కడికి వచ్చిన కొందరు బహుశా అది ఉల్కా శకలం అని అంచనా వేశారు. అది తెల్లటి రంగులో ఉండటంతోపాటు చల్లగా ఉంది. పైగా కొన్ని ముక్కలుగా పడిపోయి ఉంది. కొంతమంది అది ఏదైనా విలువైన నిధి సంపద అయి ఉండొచ్చని భావించి కొన్ని ముక్కలు తీసుకొని వెళ్లి ఫ్రిజ్‌లలో పెట్టుకున్నారు. అయితే, ఈ విషయం కాస్త జిల్లా అధికారులకు తెలియడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు.

ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు అందులో ఉన్నారు. వారు దానిని పరీక్ష చేసిన తర్వాత యాక్‌ అనిపించే నిజం చెప్పారు. దాన్ని బ్లూ ఐస్‌ అంటారని, విమానాల్లోని మలమూత్ర వ్యర్థాలకు ఇది ఘన రూపం అని, అప్పుడప్పుడు విమానాల్లో నుంచి ఇవి లీకై పడుతుంటాయని తాఫీగా చెప్పారు. ఈ విషయం విన్న అక్కడి వారంతా కూడా దాదాపు వాంతులు చేసుకున్నంత పనిచేశారు. తాము ఫ్రిజ్‌లల్లో పెట్టుకున్న ఆ పదార్థపు ముక్కలను ముక్కుమూసుకొని బయటపడేసేందుకు నానా ఇబ్బంది పడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top