అసలు ఆ రోజు ఏం జరిగిందీ!?

What Has Happened That Day In Hashimpura mass murders Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత న్యాయ వ్యవస్థలో అక్టోబర్‌ 31వ తేదీని సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు. హాషింపురలో 42 మంది అమాయకులను ప్రభుత్వ దళమే ఊచకోత కోసిన కాండలో 31 ఏళ్ల అనంతరమైనా సరే న్యాయం బతికుందుని రుజువైన రోజు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ (పీఏసీ)కు చెందిన 19 మంది నిందితుల్లో ముగ్గురు కాలగమనంలో మరణించగా, మిగతా 16 మంది నిందితులని దోషులుగా నిర్ధారించిన రోజు.  వారు మిగతా శేష జీవితకాలమంతా జైల్లోనే గడపాలంటూ ఢిల్లీ హైకోర్టు బెంచీ తీర్పు ఇచ్చిన అరుదైన రోజు.

ఇంతకు హాషింపుర ఊచకోత కేసు ఏమిటీ? ఎవరు ఊచకోతకు పాల్పడ్డారు? అందుకు బాధ్యులెవరు? బాధితులెవరు? అంతటి దారుణానికి దారితీసిన పరిస్థితులేమిటీ? అది 1987 సంవత్సరం. బాబ్రీ మసీదుపై వివాదం కొనసాగుతున్న రోజులు. హిందువుల ప్రార్థనలను కూడా అనుమతించేందుకు బాబ్రీ మసీదు తలుపులు తెరవాలని అప్పటి కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో దేశంలో పలు చోట్ల హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నగరంలో అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అణచివేసేందుకు పీఏసీకి చెందిన 60 దళాలు రంగంలోకి దిగాయి. సైనిక తరహాలో శిక్షణ పొందిన ఈ దళాలను ప్రధానంగా శాంతి భద్రతల పరిరక్షణకే ఉపయోగిస్తారు.

1987, మే 22 రాత్రి

అది 1987, రంజాన్‌ మాసం, మే 22వ తేదీ రాత్రి. కర్ఫ్యూతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. అప్పుడు 41 బటాలియన్‌కు చెందిన పీఏసీ దళం మీరట్‌లో ముస్లింలు ఎక్కువగా ఉండే హాషింపురను ముట్టడించింది. పీఏసీ కానిస్టేబుళ్లు ఇళ్లలో జొరబడి విధ్వంసం సృష్టించారు. మగవాళ్లను బయటకెళ్లి నిలబడాల్సిందిగా ఆదేశిస్తూ ఇంట్లోని విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. అడ్డుపడిన ఆడవాళ్లును చితక బాదారు. అధికారిక లెక్కల ప్రకారమే 324 మంది ముస్లింలను బయటకు తీసుకొచ్చి ట్రక్కుల్లో ఎక్కించారు. వారందరిని పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లి ఇష్టమొచ్చినట్లు కర్రలతో, తుపాకీ మడమలతో చితక బాదారు. ‘ఇదిగో ఇది ఇమ్రాన్‌ ఖాన్‌ సిక్సర్‌’ అంటూ ఆ నాటి దారుణం నుంచి బయట పడిన అబ్బుల్‌ జబ్బర్‌ వాంగ్మూలంలో తెలిపారు. అక్కడి నుంచి 50 మందిని మినహా మిగతా వారిని జైలుకు పంపించారు.

పసుపురంగు ట్రక్కులో

ఆ 50 మందిలో అప్పటికి 17 ఏళ్ల కుర్రవాడైన జుల్ఫికర్‌ ఉన్నాడు. వారందరిని పసుపు రంగు ‘యూఆర్‌వీ1493’ నెంబరు ట్రక్కులో ఎక్కించుకొని పీఏసీ పోలీసులు గజియాబాద్‌లోని మురద్‌నగర్‌లో ఉన్న ఎగువ గంగా కెనాల్‌ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికి బాగా చీకటి పడింది. ట్రక్కులో నుంచి ఓ యువకుడిని పోలీసులు కాల్వ ఒడ్డుకు పట్టుకెళ్లి కాల్చి చంపారు. ఆ తర్వాత మరొకరిని. మూడో వక్తి జుల్ఫికర్‌ను ట్రక్కులో నుంచి తీసుకెళ్లారు. కెనాల్‌ ఒడ్డున నిలబెట్టి కాల్చారు. తూటా భుజం నుంచి దూసుకుపోయింది. నీటిలో పడిపోయాడు. కానీ చనిపోలేదు. అప్పటికి పది మందిని అలా చంపేయడంతో ట్రక్కులో మిగిలినవారు పెద్ద పెట్టన అరుపులు మొదలు పెట్టారు. భయపడిన పోలీసులు ట్రక్కులోకి నేరుగా కాల్పులు జరిపారు. పలువురు మరణించారు. తోటివారి రక్తం మడుగులో పడిపోయిన ఆరిఫ్‌ మరణించినట్లు నటించి బతికిపోయాడు. చనిపోయిన వారిని, చనిపోయారనుకున్న వారిని కెలాల్‌లో, కెనాల్‌ పక్కన పడేసి, ప్రాణాలతో మిగిలిన మరికొంత మందిని అదే ట్రక్కులో పోలీసులు హిండన్‌ కెనాల్‌ వద్దకు తీసుకెళ్లి చంపేసి కాల్వలో పడేశారు. అనంతరం వాహిణిలోని 41వ పీఏసీ బటాలియన్‌లోకి ట్రక్కును తీసుకెళ్లారు.

బతికిన జుల్ఫికర్‌ ఢిల్లీకి

భుజంపై గాయంతో బతికిన జుల్ఫికర్‌ ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి, చనిపోయినట్టు నటించి బతికిన ఆరిఫ్‌ను, ఛాతిలో బుల్లెట్‌ దిగి కొన ఊపిరితోనున్న కమ్రుద్దీన్‌ను తీసుకొని ఢిల్లీ హైవే వరకు వెళ్లారు. ఏ మాత్రం గాయం కాని ఆరిఫ్‌ వారిని అక్కడ వొదిలేసి చీకట్లో ఎటో పోయాడు. తాను ఎలాగు బతకనని, తనను వొదిలేసి వెళ్లాల్సిందిగా కమ్రుద్దీన్, జుల్ఫికర్‌ను వేడుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన మరణించాడు. అప్పుడు జుల్ఫికర్‌ అక్కడి నుంచి సమీపంలో ఉన్న బంధువు ఊరికి వెళ్లి భుజానికి తగిలిన గాయానికి రహస్యంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొన్ని రోజుల్లో కోలుకున్నాక జుల్ఫికర్‌ ఢిల్లీకి వెళ్లారు. అక్కడి అప్పటి పార్లమెంట్‌ సభ్యుడు సయ్యద్‌ షాబుద్దీన్‌ను కలుసుకొని జరిగిన ఘోరాన్ని వివరించారు. ఇరువురు కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పడంతో జరిగిన ఘోరం గురించి ప్రపంచానికి తెల్సింది.
 

బాధితుల పక్షాన నిలిచిన ఎస్పీ విభూతి నారాయణ్‌
పోలీసు, సైనిక దళాల్లో అంతర్గత ఘర్షణలు జరుగుతాయన్న భయందోళనలతో ఈ ఘోరంపై దర్యాప్తును నీరుగార్చేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని పెద్దలు ప్రయత్నించారు. ఘోరం జరిగినప్పుడు ఘజియాబాద్‌ పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న విభూతి నారాయణ్‌ రాయ్‌ పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టాల్సిందిగా బాధితులు, బాధితుల బంధువులను ప్రోత్సహించారు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు ఆయన అప్పటి జిల్లా మేజిస్ట్రేట్‌ జైదీని తీసుకొని వాహిణిలోని 41 పీఏసీ బటాలియన్‌కు వెళ్లి ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం ట్రక్కును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ పీఏసీ అధికారులు సహకరించలేదు. దీనిపై మానవ హక్కుల సంఘాలు పెద్ద పెట్టున గొడవ చేయడంతో 1988లో అప్పటీ యూపీ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆరేళ్లపాటు దర్యాప్తు జరిపిన సీబీఐ 1994లో 64 మందిని దోషులుగా తేలుస్తూ కేంద్రానికి నివేదికను సమర్పించింది. ఇప్పటికీ ఆ నివేదిక వెలుగు చూడలేదు.

సుప్రీంకోర్టుకు బాధితులు

బాధితులు, బాధితుల బంధువులు ఆ నివేదికను వెల్లడించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ 1995లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు, హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించినా లాభం లేకపోయింది. పలు రకాల ఒత్తిళ్ల కారణంగా 1996లో అప్పటి యూపీ ప్రభుత్వం 19 మంది పీఏసీ కానిస్టేబుళ్లపై చార్జిషీటును నమోదు చేసి దర్యాప్త చేపట్టింది. నిందితులుగా పేర్కొన్న  వారంతా దిగువస్థాయి కానిస్టేబుళ్లే. వారికి ఎవరు ఆదేశించారో, వారేచేత ఎవరు ఆ ఘోరాన్ని చేయించారో చార్జిషీటులో ఎక్కడా పేర్కొనలేదు. దర్యాప్తులోనూ వెల్లడికాలేదు. అసలు దర్యాప్తే ముందుకు సాగలేదు.

కేసు యూపీ నుంచి ఢిల్లీకి బదిలీ

దివంగత మానవ హక్కుల కార్యకర్త ఇక్బాల్‌ అన్సారీ జోక్యం చేసుకొని కేసును యూపీ నుంచి ఢిల్లీకి మార్చాలంటూ సుప్రీం కోర్టులో బాధితులతో పిటిషన్‌ వేయించారు. 2002, సెప్టెంబర్‌ నెలలో కేసు యూపీ నుంచి ఢిల్లీకి బదిలీ అయింది. ఈ కేసులో వాదించేందుకు ఏ రాష్ట్రం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించాలనే విషయమై కొంతకాలం గడిచిపోయింది. ఆ తర్వాత యూపీ ప్రభుత్వం నియమించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కేసును పట్టించుకోక పోవడంతో కేసు వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. చివరకు మానవ హక్కుల న్యాయవాదులు వృందా గోవర్, రెబెక్కా జాన్‌లు కేసును వాదించేందుకు ముందుకు రావడంతో విచారణ కొనసాగింది. 2006, మే నెలోలనే, ఊచకోత జరిగిన సరిగ్గా 19 ఏళ్ల అనంతరం 16 మంది నిందితులపై అభియోగాలు ఖరారు అయ్యాయి. అప్పటికే ముగ్గురు నిందితులు మరణించారు.
 

ఒక్క రోజు ముందు పుట్టిన హుజ్మా పోరాటం

ఢిల్లీలోని తీస్‌ హజారి కోర్టు రూమ్‌లో జరిగిన ప్రతి విచారణకు బాధితులు, బాధితుల తరఫు బంధువులు నానా కష్టాలు పడి హాజరయ్యారు. వారంతా పేదవాళ్లే. వారిలో హుజ్మా కూడా ఉన్నారు. ఊచకోత సంఘటకు ఒక్క రోజు ముందే పుట్టిన హుజ్మా (నేడు ఆమెకు 31 ఏళ్లు) ఆ రోజున కాల్పుల్లో తండ్రిని కోల్పోయారు. తన తల్లి జైబున్నీస్‌తో కలిసి ప్రతి విచారణకు హాజరయ్యారు. అంతకుముందే తండ్రిని కోల్పోయి ఆ రోజున అన్నను కూడా కోల్పోయిన ఎనిమిదేళ్ల (అప్పటికి) షకీల్‌ ప్రతి కోర్టు విచారణకు హాజరవుతూ ఆ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టికట్టుగా చెబుతూ వచ్చారు. ఆ రోజున తన 18 ఏళ్ల కుమారుడు కమ్రుద్దీన్‌ను (ఛాతిలో బుల్లెట్‌ తగిలిన) కోల్పోయిన జములుద్దీన్, ఆ రోజున భుజానికి బుల్లెట్‌ తగిలి ప్రాణాలతో బయటపడిన జుల్ఫికర్‌లు బలంగా నిలబడడం వల్ల కేసు నిలబడింది. నిందితులపై నేరారోపణలు ఖరారు అయినప్పటికీ వారు ఉద్యోగంలో కొనసాగుతూనే వచ్చారు.

నిందితులపై కేసును కొట్టివేస్తూ తీర్పు

చివరకు మార్చి 21, 2015న ట్రయల్‌ కోర్టు తీర్పు చెప్పింది. జరిగిన ఘోరాన్ని అంగీకరించిన కోర్టు నిందితులందరిని ‘సంశయ లాభం’ కింద నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ రోజున కాల్పులు జరిపిన పోలీసులు వారే అనడానికి బలమైన సాక్ష్యాలు లేవన్న కారణంగా ఆ తీర్పు చెప్పింది. ఆ తీర్పును బాధితులు ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేయగా, మొన్న అంటే, 2018, అక్టోబర్‌ 31న నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. తీర్పు అనంతరం మీడియా బాధితులను పరామర్శించగా, సినిమాలను సైతం మరిపించే యదార్థ గాధలు తెలిశాయి. ఇన్నేళ్లు వారు న్యాయం కోసం పోరాడేందుకు పడిన కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. అన్నీ కన్నీళ్లే. అయినా వారి విజయం పాక్షికమే.

దిగువస్థాయి ఉద్యోగులు దోషులుగా తేలారు తప్ప, అంతటి ఘోరానికి వారిని ఆదేశించిన పీఏసీ ఉన్నతాధికారులుగానీ, అందుకు బాధ్యులైన ప్రభుత్వ పెద్దలుగానీ దోషులుగా తేలలేదు. అటు యూపీలో, కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ప్రభుత్వం కేసును పట్టించుకున్న పాపాన పోలీదు. ఈ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తూ వచ్చిన మీడియా కూడా దోషే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top