‘చోటా మోదీ’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్‌

What do you mean by Chhota Modi? Angry BJP hits out at Congress for demeaning jibe - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిలియనీర్‌ జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. పీఎన్‌బీని రూ పదివేల కోట్లకు పైగా ముంచిన నీరవ్‌ మోదీని కాంగ్రెస్‌ పార్టీ ‘చోటా మోదీ’ గా పేర్కొనడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానితో పాటు బీజేపీని టార్గెట్‌ చేసి కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరు అగౌరవపరిచేలా ఉందని, తీవ్ర అభ్యంతరకరమని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు.

చోటా మోదీ అనే పదం వాడటాన్ని మంత్రి ఆక్షేపించారు. కాంగ్రెస్‌ ఈ తరహా భాష వాడటం సరైందికాదని హితవు పలికారు. కాంగ్రెస్‌ చెబుతున్నట్టు ప్రధాని మోదీని దావోస్‌లో నీరవ్‌ మోదీ కలవలేదని స్పష్టం చేశారు. నీరవ్‌ మోదీ తనంతట తానే దావోస్‌ చేరుకుని, సీఐఐ గ్రూప్‌ ఫోటో ఈవెంట్‌లో పాల్గొన్నారని వివరణ ఇచ్చారు. ఫోటోలపై రాజకీయం చేయడాన్ని కాంగ్రెస్‌ మానుకోవాలని సూచించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను మోసగించిన కేసును నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. 

Back to Top