‘80 శాతం కరోనా కేసులు లక్షణాలు లేకుండానే..’ 

Uddhav Thackeray on The Coronavirus Crisis In The Maharashtra - Sakshi

ముంబై : రాష్ట్రంలో నమోదవుతున్న 80 శాతం కరోనా కేసుల్లో బాధితులకు ఎటువంటి లక్షణాలు ఉండటం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. మిగతా 20 శాతం బాధితులు తేలికపాటి, తీవ్రమైన లక్షణాలు కలిగి ఉన్నవారని తెలిపారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్నవారు ఎవరు కూడా వాటిని దాచిపెట్టకుండా.. పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అత్యవరస సేవలైన డయాలసిస్‌ సెంటర్లు, క్లినిక్స్‌ను తెరిచేందుకు అనుమతించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కొన్ని సంస్థలను పున: ప్రారంభించనున్నట్టు తెలిపారు. వాటిపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఏప్రిల్‌ 30 తర్వాత ఏం చేయాలనే దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని వెల్లడించారు. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదని.. ప్రజలు ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

కరోనా అనేది ఆకస్మాత్తుగా కనుమరుగు అయిపోదని.. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని సీఎం చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేయడమనేది చాలా సున్నితమైన అంశం అని అన్నారు.రాబోయే మూడు, నాలుగు నెలలు చాలా కీలకమైనవని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులను ఆయన దేవుళ్లుగా అభివర్ణించారు. కరోనాపై పోరులో ఇద్దరు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోవడం బాధకలిగించిందని అన్నారు. వారికి నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మద్దతు ఉంటుందన్నారు.

కాగా, మహారాష్ట్రలో కరోనా చాలా వేగంగా విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా 26,917 కరోనా కేసులు నమోదైతే.. అందులో 7,628 కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 

చదవండి : 'మహా'మ్మారి మెడలు వంచేదెలా ?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top