త్రిపురలో చల్లారని హింసాకాండ

Tripura Post-Poll Violence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజుకున్న హింస ఇప్పటికీ చల్లారడం లేదు. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించగా కొన్ని వందల మంది గాయపడ్డారు. కొన్ని వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. సంయమనం పాటించాల్సిందిగా, శాంతిభద్రతలను రక్షించేందుకు సహకరించాల్సిందిగా బీజేపీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేవ్‌ ఇచ్చిన పిలుపును ఎవరు పట్టించుకున్నట్లు లేవు. హింసాకాండపై పాలకపక్ష బిజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎం పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

బీజేపీ కార్యకర్తలు విజయాత్రల సందర్భంగా తమ కార్యాలయాలపై దాడులు చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు కార్యకర్తలను చితకబాదారని సీపీఎం నాయకులు ఆరోపిస్తుండగా, బీజేపీ కార్యకర్తలతోపాటు బీజేపీలో చేరిపోయిన సీపీఎం అల్లరి మూకలు తమ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుపుతున్నారని, కార్యకర్తల ఇళ్లను దగ్ధం చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ కార్యాలయాలతోపాటు కాంగ్రెస్‌ కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకొని బీజేపీ కార్యకర్తలు దాడులు జరుపుతూ హింసాకాండకు పాల్పడుతున్నారని సీపీఎం సీనియర్‌ నాయకుడు పబిత్ర కర్‌ ఆరోపించారు. బీజేపీ, అందులో చేరిపోయిన సీపీఎం అల్లరిమూకలు ఇప్పటివరకు జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది కార్యకర్తలు ఆస్పత్రుల పాలయ్యారని, 250 ఇళ్ళు, 100 దుకాణాలు దగ్ధం చేశారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రద్యోత్‌ బిక్రమ్‌ మాణిక్య దెబ్బర్మన్‌ ఆరోపించారు. పోలీసుల బందోబస్తు మధ్య విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ దాడులకు తెగబడుతున్నారని ఆయన చెప్పారు. తమ కార్యకర్తల చికిత్స కోసం, ఇళ్లు కోల్పోయిన వారి ఆశ్రయం కోసం ఓ ‘సంక్షోభ నిధి’ని ఏర్పాటు చేశామని కూడా ఆయన చెప్పారు.

2018, మార్చి నెలలో జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి ఈ పార్టీల మధ్య దాడులు, హింసాకాండ కొనసాగుతోంది. మొన్న త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూడా ఇద్దరు బీజేపీ సభ్యులే విజయం సాధించారు. కాంగ్రెస్‌ రెండో స్థానంలో రాగా, సీపీఎం మూడోస్థానంలో వచ్చింది. మళ్లీ రాజకీయ కక్షలు రగులుకొని హింసాకాండ ప్రజ్వరిల్లింది. త్రిపురకు ఎన్నికల హింస కొత్త కాదు. ప్రతి ఎన్నికల సందర్భంగా హింసాకాండ చెలరేగుతోంది. మొన్న పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా కూడా అల్లర్లు జరగడంతో ఉన్న రెండు నియోజకవర్గాలకు కూడా వేర్వేరు తేదీల్లో పోలింగ్‌ నిర్వహించారు. గతంలో జరిగినంత హింసాకాండ ఇప్పుడు లేదని, 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 13 మంది మరణించారని, ఇప్పుడు ముగ్గురే మరణించారంటూ పాలకపక్ష బీజేపీ నాయకులు సమర్థించుకుంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top