‘యోగికి ఆ ముస్లిం యువకుడంటే ప్రేమ’

‘యోగికి ఆ ముస్లిం యువకుడంటే ప్రేమ’


లక్నో: ఓ ముస్లిం యువకుడికి ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎంత అంటే అతడు ఎప్పుడంటే అప్పుడు వెళ్లి కలిసేలాగా.. ఒక్కోసారి పెద్ద పెద్దవారికే దొరకని సీఎం అపాయింట్‌మెంట్‌ అతడికెలా సాధ్యం అని అనుకుంటున్నారా? మరేంలేదు ఆ యువకుడు సేవలు చేసేది గోరఖ్‌నాథ్‌ ఆలయంలో. అవును.. పేద కుటుంబం నుంచి వచ్చిన మహ్మద్‌ అనే నేటి యువకుడు పదేళ్ల ప్రాయంలోనే గోరఖ్‌నాథ్‌ ఆలయానికి చేరుకున్నాడు.అతడి తండ్రి ఇనాయతుల్లా నుంచి బాధ్యతలు అందుకొని స్వచ్ఛంద సేవకుడిగా ఇక్కడి ఆలయంలోని గోశాలలో పనిచేస్తున్నాడు. ఇందులో సేవలందించే ఇతర సన్యాసుల మాదిరిగానే అతడు కూడా ఇప్పటికీ ఓ బ్యాచిలర్‌. కొంతమొత్తం పైకంతోపాటు అక్కడే భోజనం చేస్తూ హాయిగా సంతోషంగా తన జీవితాన్ని గడిపేస్తున్నాడంట. దిగ్విజయ్‌నాథ్‌, వైద్యనాథ్‌ మఠాదిపతులుగా ఉన్న సమయంలో మహ్మద్‌ తండ్రి ఇనాయతుల్లా సేవలందించగా యోగి ఆదిత్యనాథ్‌ మఠాదిపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహ్మద్‌ సేవలందిస్తున్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిందుమతస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన మత ఆచారాలు పాటిస్తుంటాడు.‘నేను నా బాల్యం మొత్తాన్ని ఇంట్లో మాదిరిగానే గోరఖ్‌నాథ్‌ ఆలయంలో గడిపాను. నా జీవితకాలం మొత్తం ఇక్కడే పనిచేస్తాను. యోగీజీ నాకు చాలా గౌరవం ఇస్తారు.. ప్రేమ చూపిస్తారు. గోవులపట్ల నా అంకిత భావాన్ని యోగీజీ బాగా ఇష్టపడతారు. ఆయన గోవులు తినేవరకు బ్రేక్‌ ఫాస్ట్‌ కూడా చేయరు’ అని మహ్మద్‌ తెలిపారు. ‘ఆయన కరడుగట్టిన హిందుత్వవాదిగా కనిపించినప్పటికి వ్యక్తిగతంగా మాత్రం ఆయన ప్రతిఒక్కరికి అండగా ఉంటారు. గౌరవిస్తారు’ అని కూడా మహ్మద్‌ చెప్పాడు.

Back to Top