గుండె మాయమైంది!

గుండె మాయమైంది!


2012లో చనిపోయిన సనమ్‌ మృతదేహం నుంచి హృదయం అదృశ్యం

ముంబై: ఐదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన పుణె అమ్మాయి సనమ్‌ హసన్‌ గుండె కనిపించడంలేదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తదుపరి విచారణను కొనసాగించి దోషులెవరో తేల్చడానికి గుండె అత్యవసరమని సీబీఐ అధికారులు పేర్కొంటున్నారు. 2012లో సనమ్‌ హసన్‌ తన 19వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అనంతరం చనిపోయింది.


శవపరీక్ష నిర్వహించిన వైద్యులు..ఆమె గుండెలో అప్పటికే రక్తనాళాలు 70 శాతం వరకు పూడుకుపోయి ఉన్నాయనీ, ఎక్కువగా మద్యం సేవించడం వల్ల చనిపోయిందని తేల్చారు. అలాగే ఆమె లోదుస్తులపై వీర్యం మరకలు ఉన్నాయనీ, దీనిని బట్టి లైంగిక చర్య జరిగిందని స్పష్టమవుతోందని వైద్యులు చెప్పారు. అయితే ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అయిన తమ కూతురికి గుండెకు సంబంధించి ఎలాంటి అనారోగ్యం లేదనీ, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్షలు జరపాలని సనమ్‌ తల్లిదండ్రులు అప్పట్లో డిమాండ్‌ చేశారు.



విచారణకు ‘గుండె’

గుండెలో రక్తనాళాలు పూడుకుపోవడం వల్లే ఆమె మరణించిందని వైద్యులు తేల్చడంతో కేసు విచారణలో గుండె కీలకంగా మారింది. సనమ్‌ తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆమె శరీర భాగాలను ముంబైలోని కలీనా ప్రయోగశాలకు పంపించి పరీక్షలు జరిపారు. ఆశ్చర్యకరంగా అక్కడకు వచ్చిన గుండె ఓ పురుషుడిదని తేలింది. అనంతరం కేసును సీబీఐకి అప్పగించారు.


2016 ఆగస్టులో సనమ్‌ మృతదేహాన్ని శ్మశానం నుంచి బయటకు తీసిన సీబీఐ.. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షలకు పంపింది. అప్పుడు కూడా ఒక్క గుండె తప్ప మిగిలిన అవయవాలన్నీ సనమ్‌వేననీ, ఈ సారి ప్రయోగశాలకు వచ్చిన గుండె ఓ వృద్ధురాలిదని తేలింది. రెండుసార్లు గుండె తారుమారు అవ్వడంపై సనమ్‌ తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురి మరణం వెనుక ఎవరో బలవంతుల హస్తం ఉందనీ, గుండె ఒక్కసారి మారిపోతే పొరపాటు అనుకోవచ్చనీ, రెండోసారి కూడా అలాగే జరిగిందంటే అర్థమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీబీఐ అధికారులు మాత్రం గుండె దొరికితేగానీ, అసలేం జరిగిందో, దోషులెవరో తేల్చలేమంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top