ముంచుకొస్తున్న ‘చెత్త’ సంక్షోభం

ముంచుకొస్తున్న ‘చెత్త’ సంక్షోభం


రానున్న రోజుల్లో చెత్త పారేసేందుకు చోటు కరువు!  



సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ :  రాబోయే రోజుల్లో మనకు ‘చెత్త’ సంక్షోభం ఎదురుకానున్నదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లు గడిస్తే చెత్తను పారేసేందుకు ఒక్కో ఏడాదికి ఢిల్లీ నగరమంత పరిమాణంలో ఉన్న స్థలం అవసరమవుతుందట. చెత్త వల్ల పర్యావరణం కలుషితమై ప్రజా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ప్రతి ఏడాదీ దేశ పట్టణ జనాభా మూడున్నరశాతం, నగరాలు వెలువరించే వ్యర్థాలు అయిదు శాతం పెరగుతున్నట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) అంచనా వేస్తోంది.



ఇలా అయితే చెత్త, వ్యర్థాలను పడేసేందుకు చోటు కూడా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో చెత్తను ఎక్కడో చోట గుట్టలుగా, కుప్పలుగా పోయడం వంటివి చేయకుండా దానిని రీసైకిల్‌పై ప్రత్యేక కార్యాచరణను చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చెత్త ఉత్పత్తి అయ్యే స్థానంలోనే దానిని తప్పనిసరిగా తడి,పొడిగా విడదీయాలని జాతీయ ఘన, ప్లాస్టిక్‌ చెత్త నిర్వహణ నిబంధనలు–2016లో నిర్దేశించినా, వాటిని రాష్ట్రాలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు.



ఆదర్శంగా అలప్పుజా, పణజీ...

చెత్త, ఇతర వ్యర్థాలను సమర్థవంతంగా తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా కేరళలోని అలప్పుజా, గోవాలోని పణజీలు ఇతర నగరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ నగరాల్లో చెత్తను కంపోస్ట్‌ ఎరువు, బయో గ్యాస్, గాజు, లోహం, కాగితం వంటి వాటిగా మారుస్తున్నారు. గత ఏడాది జాతీయస్థాయిలో నిర్వహించిన ఒక సర్వేలో ఈ రెండు నగరాలు అగ్రస్థానంలో నిలిచినట్లు (సీఎస్‌ఈ) వెల్లడించింది. చెత్త సమస్యను ఎదుర్కొనేందుకు తడి చెత్తను ఎరువుగా మార్చి రైతులకు ఇవ్వడం, పొడి చెత్తను రీసైకిల్‌ చేయడం, ప్లాస్టిక్‌ను ముక్కలుగా చేసి హాట్‌–మిక్స్‌ ప్లాంట్ల ద్వారా తారు రోడ్డుకు ఉపయోగించడం వంటివి చేయవచ్చునని ఘనవ్యర్థాల నిర్వహణపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యురాలు అల్‌మిత్ర పటేల్‌ పేర్కొన్నారు.



కేరళ వేడుకల్లో పింగాణి, స్టీలు ప్లేట్లు..

కేరళలో పెళ్లిళ్లు, వేడుకల్లో ప్లాస్టిక్, స్టైరోఫోమ్‌లకు బదులుగా స్టీలు, పింగాణి ప్లేట్లు తదితర ప్లాస్టికేతర పరికరాలు ఉపయోగించేలా చర్యలు ప్రారంభించారు. 2015లో జరిగిన జాతీయ ›క్రీడలు, ఆ తర్వాతా బహిరంగ వేడుకల్లో దీనిని కచ్చితంగా పాటించేలా చూస్తున్నారు. మరోవైపు ముంబయి, ఢిల్లీ తదితర నగరాల్లో చెత్త నియంత్రణకు ఉద్ధేశించిన కార్యక్రమాలు పెద్దగా విజయవంతం కాలేదు. మహానగరాలే కాదు..చిన్న పట్టణాల్లో కూడా ఇళ్ల వద్దే తడి, పొడి చెత్త వర్గీకరణ అనేది సవాల్‌గా మారుతోంది.



పుణె నగరపాలక సంస్థ 2005లో చెత్త ఏరుకునేవారి సాయంతో ప్రారంభించిన తడి–పొడి చెత్తలను వేరుచేసే కార్యక్రమం విజయవంతమైంది. ఢిల్లీలో 40 నుంచి 50 వేల మంది చెత్త ఏరుకునే వారున్నారు. ఢిల్లీలోనూ పుణె తరహా విధానం అవలంబిస్తే మంచి ఫలితాలను పొందవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. స్వచ్ఛ భారత్‌ అని చెబుతున్న మోదీ... చెత్తను రోడ్లపై విసిరేసే వారిపై జరిమానాలు విధించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top