శ్రీకృష్ణుడిగా మరోసారి తేజ్‌ ప్రతాప్‌!

Tej Pratap Plays Sri Krishna On Janmashtami in Patna - Sakshi

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు, బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా ఆయన మురళీధరుడి వేషం ధరించారు. అనంతరం తన నివాసంలో మరికొంత మంది నటులతో కలిసి శ్రీకృష్ణుడి లీలామృతాన్ని ప్రదర్శిస్తూ.. వేణుగానం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. తేజ్‌ ప్రతాప్‌ ఇలాంటి వేషాలు ధరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన శివుడు, కృష్ణుడి వేషధారణలో అనేకమార్లు కనిపించారు. కాగా కొన్ని రోజుల క్రితం విడాకులు కావాలంటూ తేజ్‌ ప్రతాప్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన భార్య ఐశ్యర్యారాయ్‌తో కలిసి ఉండలేనని, తామిద్దరం ఉత్తరదక్షిణ ధృవాల వంటి వాళ్లమని తెలిపారు. విడాకుల విషయంలో తన కుటుంబ సభ్యులే తనకు వ్యతిరేకంగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేసి కొన్నాళ్లు అఙ్ఞాతంలోకి కూడా వెళ్లారు. 

ఈ క్రమంలో పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు విచారణలో భాగంగా తేజ్‌ ప్రతాప్‌ భార్య ఐశ్వర్య... ఆయనకు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయి తనను వేధించేవాడని సంచలన విషయాలు తెలిపారు. భర్త మత్తుకు బానిస అన్న విషయం పెళ్లయిన కొత్తలోనే తనకు తెలిసిందని, డ్రగ్స్‌ తీసుకున్న తర్వాత ఆయన తనను తాను శివుడి అవతారంగా చెప్పుకొనేవాడని ఆమె పేర్కొన్నారు. ‘తేజ్‌ శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతను దేవతలుగా, దేవుళ్లుగా దుస్తులు ధరిస్తాడని తెలుసుకొని షాక్‌ అయ్యాను. ఒకసారి డ్రగ్స్‌ మత్తులో అతను గాగ్రా, చోలీ ధరించి.. మేకప్‌ వేసుకొని, విగ్గు పెట్టుకొని రాధగా తయారయ్యాడు’ అని ఐశ్వర్య వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహిళలపై గృహ నిరోధ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టులో ఆమె అభ్యర్థన దాఖలు చేశారు. అయినప్పటికీ తేజ్‌ ప్రతాప్ మాత్రం తనదైన శైలిలో మరోసారి కృష్ణుడి వేషం ధరించి..నాటకం ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక జైళ్లో ఉన్న లాలూకు తేజ్‌ వ్యవహారం తలనొప్పిగా మారింది. అం‍తేగాకుండా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర ఓటమి పాలవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top