నీటి చుక్కకు.. నాటిన మొక్కకు లెక్క!

Technical improvements in water projects in rajastan - Sakshi

చతుర్విధ జల ప్రక్రియకు సాంకేతిక మెరుగులు

పాతాళ గంగను పైకి తెస్తున్న ప్రయోగం

రాజస్తాన్‌లో తెలంగాణ బిడ్డ శ్రీరాం వెదిరె కృషి  

ప్రకృతి వైపరీత్యాలకు ప్రకృతి నుంచే పరిష్కారం వెతుక్కోవచ్చని రాజస్తాన్‌ రాష్ట్రం రుజువుచేస్తోంది. చతుర్విధ జల ప్రక్రియ, వాటర్‌షెడ్, ఇతర జల సంరక్షణ పద్ధతులనే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకుని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తోంది. తాగునీటికి కూడా ఐదారు కిలోమీటర్లు వెళ్లిన వాళ్లు ఇప్పుడు తమ గ్రామంలోనే మోటబావుల ద్వారా దాహాన్ని తీర్చుకుంటున్నారు.

వానాకాలం మినహా మిగతా సమయాల్లో కనిపించని పచ్చదనం ఇప్పుడా ఎడారి పరిసరాల్లో కనువిందుచేస్తోంది. వాలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ఎంపిక చేసుకుని చతుర్విధ జలప్రక్రియ చేపట్టి వాన నీటిని రాజస్తాన్‌ ఒడిసిపడుతోంది. నీటి సంరక్షణకు అనువుగా 8 ప్రభుత్వ శాఖల సమన్వయంతో ‘ముఖ్యమంత్రి జల స్వావలంబన పథకం’ ఏర్పాటు చేసింది. దీనికి అనుబంధంగానే రాజస్తాన్‌ రివర్‌ బేసిన్‌ అథారిటీని ఏర్పాటుచేసింది. దీనికి చైర్మన్‌గా తెలంగాణ బిడ్డ వెదిరె శ్రీరాంను, ఈ అథారిటీకి కేబినెట్‌ హోదాను కల్పించింది.

ఒకే గొడుగు కిందికి సంరక్షణ, వాడకం
వాన నీటిని ఇంకించడానికి చతుర్విధ జల ప్రక్రియను 2016 జనవరి నుంచి రాజస్తాన్‌ అమలు చేస్తోంది. దీనికి ఆధునిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసింది. నీటిని సంరక్షించే శాఖలను, నీటిని వాడుకునే శాఖలను ‘రాజస్తాన్‌ రివర్‌ బేసిన్‌ అథారిటీ’లో సభ్యులుగా చేర్చింది. మొదటి దశలో 3,529 గ్రామాల్లో 95,192 జల సంరక్షణ కార్యక్రమాలను రాజస్తాన్‌ ప్రభుత్వం పూర్తి చేసింది. రెండో దశలో 4,213 గ్రామాల్లో 1.24 లక్షల పనులను పూర్తి చేసింది.

ఇందులో భాగంగా నీటి నిల్వ గుంతలను శాస్త్రీయంగా తవ్వుతున్నారు. కందకాలను తీస్తున్నారు. వీటికి చుట్టుపక్కల చెట్లు నాటుతున్నారు. దిగువ ప్రాంతాల్లో చెక్‌డ్యాములు, మత్తళ్లు, నీటి కుంటలను తవ్వుతున్నారు. ఇలా భూమిలోకి ఇంకిన నీటిని పరీక్షించుకోవడానికి, వాటికి కొంత దూరంలో చేదబావులు తవ్వుతున్నారు. నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్‌ చేయడం వల్ల ప్రతీ మొక్క పెంచేలా బాధ్యులు అప్రమత్తంగా ఉంటున్నారు.

దీనివల్ల పనులు జరిగిన ప్రాంతాల్లో మూడు నుంచి 10 అడుగుల్లోపే భూగర్భ జలం ఉబికివస్తోంది. ఉదయపూర్‌ జిల్లా బింధర్‌ పంచాయతీ పరిధిలోని ఉమేధ్‌పురా, బాన్స్‌వార జిల్లాలోని కుశాల్‌గఢ్‌ పంచాయతీ సమితి బాలాచిన గ్రామంలో మీడియా బృందం ఎదుటే జేసీబీతో గుంత తవ్వారు. 8 అడుగుల గుంత తవ్విన పావుగంటలోనే మూన్ణాలుగు అడుగుల మేరకు నీరు వచ్చింది.

తాగునీటి తిప్పలు పోయినట్టే
తాగునీటి కోసం ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మా ఆడవాళ్లు, పిల్లలు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు చేదబావుల ద్వారా నీటిని తీసుకుంటున్నాం.   – మోతీలాల్, బేజల్ల గ్రామస్తుడు

ఈ పచ్చదనం చూడలేదు
రెండేళ్లలోనే నీటి కొరత తీరింది. పశువులకు గడ్డి దొరుకుతోంది. ఇంత పచ్చదనం నా చిన్నప్పటి నుంచీ చూడలేదు. – కరణ్‌ సింగ్, రైతు, ఉమేధ్‌పురా

ప్రకృతి నుంచే పరిష్కారం
ప్రకృతి సమస్యను ప్రకృతి నుంచే పరిష్కరించుకోవాలి. ప్రభుత్వ చిత్తశుద్ధి, అందుకోసం పని చేస్తున్న వారి అంకితభావం, పట్టుదల తోడు కావాలి. సీఎం పోత్సాహం, అధికారుల సహకారం, నాతో పని చేస్తున్న సిబ్బంది కృషితో ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాలపై వివిధ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలు దీన్ని అమలు చేసేందుకు సాంకేతిక సహకారాన్ని కోరాయి. – శ్రీరాం వెదిరె

తొలుత ఆందోళన చెందాం
ప్రభుత్వ భూమిలో పనులు మొదలుపెట్టినప్పుడు ఆందోళన చెందాం. భూమిని కబ్జా చేసుకోవడానికి వచ్చారనే కోపంతో రాళ్లతో తరిమాం. వెదిరె శ్రీరాం సాబ్‌ నచ్చజెప్పడంతో పనులను సాగనిచ్చాం. రెండేళ్లకు ముందు 500 అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు రాకపోయేది. ఇప్పుడు ఐదారు అడుగుల గుంత తవ్వితే నీరొస్తున్నది. – పుష్పేందర్‌ సింగ్‌ పంచాయతీ సభ్యుడు, సారంగపూర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top