ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court Upholds Validity Of Aadhaar - Sakshi

న్యూఢిల్లీ : ఆధార్‌ చట్టబద్ధతపై అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఆధార్‌ స్కీమ్‌ రాజ్యాంగపరంగా చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆధార్‌ ఫార్ములాతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఆధార్‌పై తొలి తీర్పును జస్టిస్‌ ఏకే  సిక్రీ, చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ చదివి వినిపించారు. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే, ఆధార్‌ ఎంతో విశిష్టమైనదని జడ్జీలు పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్‌ సేవలను తీసుకొచ్చారని, డూప్లికేట్‌ ఆధార్‌ తీసుకోవడం అసాధ్యమని తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆధార్‌ ఒక గుర్తింపని చెప్పారు.

సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు వివరాలు...

  • వ్యక్తిగత స్వేచ్చకు ఆధార్‌ అవరోధం కాదు
  • ఆధార్‌ అధికారిక ప్రక్రియను, వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచాలి
  • ప్రభుత్వ సంస్థలకు ఆధార్‌ డేటా షేర్‌ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి 
  • షేర్‌ చేసిన డేటాను ఆరు నెలల లోపు తొలగించాలి
  • ప్రైవేట్‌ సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం కుదరదు
  • ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లకుండా చూడాలి
  • సమాచార భద్రత కోసం చట్టం తీసుకురావాలి
  • ఆధార్‌ ప్రక్రియ స్వచ్ఛందంగా కొనసాగాలి
  • టెలికాం కంపెనీలు ఆధార్‌ అడగవద్దు
  • ఇప్పటి వరకు సేకరించిన యూజర్ల ఆధార్‌ నెంబర్లను టెలికాం కంపెనీలు డిలీట్‌ చేయొచ్చు.
  • బ్యాంక్‌ సేవలకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి కాదు
  • స్కూల్‌ అడ్మినిషన్లకు ఆధార్‌ తప్పనిసరి కాదు
  • పాన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులకు మాత్రం ఆధార్‌ కచ్చితంగా కావాలి.
  • సీబీఎస్‌, నీట్‌, యూజీసీకి ఆధార్‌ తప్పనిసరి కాదు.
  • అక్రమ వలసదారులకు ఆధార్‌ అవసరం లేదు.

దేశంలో దాదాపు 99 శాతం మంది ప్రజలకు జారీ చేసిన ఆధార్‌ సంఖ్యతో పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతకు భంగం కలుగుతోందంటూ పలు పిటిషన్లు దాఖలు కాగా...దీనిపై గతంలో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు నెలలుగా ఈ తీర్పును రిజర్వులో ఉంచింది. నేడు ఆధార్‌ చట్టబద్ధతపై కీలక తీర్పు వెలువరించింది. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top