‘వందే భారత్‌’పై రాళ్లదాడి

Stones Pelted On Vande Bharat Express Window Pane Broken - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌’ (ట్రైన్‌ 18)పై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక విండో గ్లాస్‌ విరిగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా దగ్గర బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో ట్రైన్‌ కాన్పూర్‌ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. కాగా, ట్రయల్‌ రన్‌ సందర్భంగా వందే భారత్‌పై గతంలో కూడా కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. డిసెంబర్‌ 20, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈ ఘటనలు జరిగాయి. (‘వందే భారత్‌’ బ్రేక్‌ డౌన్‌!)

ఇదిలాఉండగా.. ప్రధాని చేతుల మీదుగా ఢిల్లీలో గత శుక్రవారం ప్రారంభమైన వందే భారత్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ప్రారంభమైన మొదటి రోజున ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఈ రైలు తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్యతో తుండ్లా జంక్షన్‌ వద్ద నిలిచిపోయింది. పట్టాలను దాటుతున్న పశువులపై ఈ రైలు దూసుకెళ్లడంతో చక్రాలు పక్కకు జరిగాయని పశ్చిమ రైల్వే సీపీఆర్వో దీపక్‌ కుమార్‌ తెలిపారు.

అయితే, పట్టాలపైకి ఎక్కిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.ప్రధాని మోదీ చేపట్టిన మేకిన్‌ ఇండియా విఫలమైందని ప్రజలు భావిస్తున్నారని, ఈ కార్యక్రమంపై పాలకులు పునరాలోచించాలని రాహుల్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ విమర్శలపై స్పందించిన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌.. భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అహోరాత్రులు కృషి చేసి ప్రతిష్టాత్మంగా రూపొందిన ట్రైన్‌ 18పై రాహుల్‌ విమర్శలు గుప్పించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top