ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సం

South, west India face devastation after torrential rains, 169 dead in floods - Sakshi

శిథిలాల కింద చిక్కుకుని ఆరుగురు మృతి

కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో కొనసాగుతున్న వరద సహాయ చర్యలు

కేరళలో 83కి చేరిన మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. ఘాట్‌ ప్రాంతాలున్న చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఆ శిధిలాల్లో చిక్కుకుని మహిళ, ఆమె 9 నెలల కూతురు సహా ఆరుగురు మృతి చెందారు. బద్రీనాథ్‌– పగల్‌నాలా, రిషికేష్‌– కేదార్‌నాథ్‌ రహదారుల్లో రవాణా సైతం కొండచరియలు విరిగిపడిన కారణంగా నిలిచిపోయింది. రాష్ట్రంలో పోటెత్తిన చాఫ్లాగద్‌ నది ధాటికి పక్కనే ఉన్న ఇళ్లు, భవనాలు, షాపులు కుప్పకూలి నీటిలో కొట్టుకుపోయాయి. జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో ఓ పెద్ద బండరాయి విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

మరోవైపు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ ల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పై నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరద కారణంగా మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి 199కి చేరగా, కేవలం కేరళలోనే 83 మంది చనిపోయారు. అయితే, మలప్పురంలో ఇంకా 50 మంది వరకు జాడ తెలియని నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో 2.87 లక్షల మంది ఇంకా సహాయ కేంద్రాల్లోనే ఉన్నారు.  

గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన 125 మందిని భారత వైమానిక దళం కాపాడింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ సమీపంలో వరదల కారణంగా గత 6 రోజులుగా మూసివేసి ఉన్న ముంబై– బెంగళూరు హైవేపై సోమవారం వాహనాలకు పాక్షికంగా అనుమతి ఇచ్చారు. వర్షాలకు భారీగా ధ్వంసమైన తన నియోజకవర్గం వాయినాడ్‌(కేరళ)లో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటించి, బాధితులను పరామర్శించారు. వరద సహాయ చర్యల్లో పాలుపంచుకోవాల్సిందిగా కాంగ్రెస్‌ శ్రేణులను కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top