అమ్మంటే సముద్రమంత ప్రేమ!

Son Compleats Mother Last Wish In Tamil Nadu - Sakshi

తల్లికి వైద్యం కోసం లక్షల రూపాయల వెచ్చించినా తిరిగి రాని లోకాలకు..

మరణాంతరం తల్లి కోర్కెను అస్తికలతో రామేశ్వరానికి వెళ్లి తీర్చిన తనయుడు

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి వైద్యం కోసం లక్షలాది రూపాయలు వెచ్చించాడు. మధుమేహం తీవ్రత మూలాన ఒక కాలును మోకాలి నుంచి పాదం వరకు తొలగించడంతో ఆమె మంచానికే పరిమితమైనా ఆమె సంరక్షణ, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించలేదు. తల్లి మంచానికే పరిమితం కావడంతో తీర్చలేని కోరికను ఆమె మరణాం తరం 620 కిలోమీటర్ల దూరం వెళ్లి, తల్లిపై ఉన్న అంతులేని ప్రేమని కన్నీళ్ల చాటున అస్తికల నిమజ్జనంతో చాటుకున్నాడు. బతికుండగానే శ్మశానంలో తల్లిదండ్రుల్ని వదిలేస్తున్న కాలంలో ఇలాంటి కొడుకూ ప్రతి ఇంటా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తోంది కదూ!

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ :  చెన్నైకు చెందిన శ్రీనివాసన్‌ సింగపూర్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన తల్లి వసంతమ్మ (66) తిరుపతిలోని ఆయన సోదరి ఇంట ఉండేది. కొన్నేళ్లుగా మధుమేహం, ఆ తర్వాత ఇతర అనారోగ్య సమస్యలతో ఆమె మంచాన పడింది. ఆ తర్వాత శ్రీనివాసన్‌ ఆమెను సింగపూర్‌కు తనతోపాటు తీసుకెళ్లి తన వద్దే ఉంచుకున్నారు. చాలాకాలం పాటు వైద్యం చేయించారు. బంధువుల నడుమే ఉండాలని ఆమె కోరడంతో తిరిగి చెన్నైకు తీసుకువచ్చి కొన్ని వారాల పాటు వైద్యం చేయించారు. ఆమె పరిస్థితి కొంత మెరుగయ్యాక ఇక పర్వాలేదని భావించాడు. తిరుపతిలోని తన సోదరి ఇంట తల్లిని వదిలి మరలా సింగపూర్‌కు వెళ్లారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందనే చందాన శ్రీనివాసన్‌ సింగపూర్‌కు వెళ్లిన రెండు రోజులకే వసంతమ్మ పరిస్థితి విషమించింది. హుటాహుటిన రేణిగుంట రోడ్డులోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.

సింగపూర్‌లో దిగిన 24 గంటల వ్యవధిలోనే తల్లి మరణవార్త శ్రీనివాసన్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన భార్యా, పిల్లలు, తండ్రితో తిరుపతికి చేరుకున్నారు. ఇటీవలే కరంబాడి మార్గంలోని ‘మహాప్రస్థానం’లో దహనక్రియలు నిర్వహించారు. ఆమె అస్తికలు, చితాభస్మాన్ని అక్కడే భద్రపరిచారు. శనివారం రాత్రి ఇక్కడి నుంచి అస్తికలు, చితాభస్మంతో బయల్దేరి 620 కిలోమీటర్ల దూరంలోని ఉన్న  రామేశ్వరానికి ఆదివారం చేరుకున్నారు. అక్కడ శివాలయంలో పూజలు చేసి అస్తికలు, చితాభస్మాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. అక్కడి నుంచి బస్సులు, రైళ్లు ఆశ్రయించి సోమవారం తెల్లవారుజాము వేళకు తిరుపతికి చేరుకున్నారు. ఇదే రోజు తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వహించారు. ఆరోగ్యం బాగైతే తనను రామేశ్వరం సందర్శనకు తీసుకెళ్లాలని తల్లి కోరిందని, అయితే ఆమె ప్రయాణించే పరిస్థితిలో లేకపోవడంతో అది నెరవేర్చలేకపోయాయని, చివరకు చితాభస్మంతో ఇలా కోరిక నెరవేర్చాల్చి వచ్చిందని ఆత్మీయులు, తోబుట్టువుల వద్ద శ్రీనివాసన్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top