100 మంది రేపిస్టులతో ఇంటర్వ్యూ

100 మంది రేపిస్టులతో ఇంటర్వ్యూ - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ : వారు చేసింది నేరం. అఖండ భారతం మొత్తం వారిని దెయ్యాల్లా పరిగణిస్తుంది. కనీసం వారి గాలైన తమకు తగలకూడదని భావిస్తుంది. కానీ, 22 ఏళ్ల మధుమిత పాండే మాత్రం అత్యాచార నేరంపై తీహార్‌ జైలుకు వెళ్లిన 100 మంది నేరస్థులను ఇంటర్వ్యూ చేశారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారి జీవిత గమనాన్ని అధ్యాయనం చేసి రీసెర్చ్‌ థీసిస్‌ డెవలప్‌ చేశారు పాండే. యూకేలోని అంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీ ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన మధుమిత పాండే మాస్టర్స్‌ కోసం 2011లో లండన్‌ వెళ్లారు. ఆ తర్వాతి ఏడాది జరిగిన 'నిర్భయ రేప్‌' ఘటనపై భారతీయుల్లో వచ్చిన స్పందన పాండేకు ఆసక్తిని కలిగించింది.



ఆ తర్వాత కఠిన చట్టాలు అమల్లోకి వచ్చినా దేశంలో అత్యాచార ఘటనలు తగ్గకపోవడంపై పరిశోధన చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఢిల్లీకి చేరుకున్నారు. ఎక్కడి నుంచి ప్రారంభించాలని ఆలోచిస్తున్న సమయంలో.. అత్యాచార కేసులో దోషులను భారత్‌లో ఎలా చూస్తారు? అనే ఆలోచన తట్టింది. ఆలోచనను ఆచరణలో పెడుతూ తీహార్‌ జైల్లోని అత్యాచార దోషులను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. దాదాపు 100 మంది రేపిస్టులను కొన్ని వారాల పాటు ఇంటర్వ్యూ చేశారు. వాటి నుంచి తన డాక్టోరల్‌ థీసిస్‌ను డెవలప్‌ చేసుకున్నారు.



పాండే మాట్లాడుతూ.. రేప్‌ కేసులో జైలుకు వెళ్లిన వారిలో అందరూ నిరక్షరాస్యులేనని చెప్పారు. ఒకరిద్దరు మాత్రమే గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారని తెలిపారు. ఇంటర్వ్యూల తర్వాత భారతీయ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న రేపిస్టులపై తన అభిప్రాయం మారిందని చెప్పారు. వారిని దెయ్యాల్లా చూడటం సరికాదని అన్నారు. సమస్యంతా వారు 'ఎక్స్‌ట్రార్డినరీ మెన్‌' కావడమేనని చెప్పారు. జైళ్లలో ఉన్న అందరూ 'ఆర్డినరీ' వ్యక్తులని తాను తెలుసుకున్నట్లు చెప్పారు. ఆలోచనా విధానంలో మార్పు లేకపోవడమే వల్లే వాళ్లు దారుణాలకు ఒడిగట్టినట్లు తనకు అర్థమైందని తెలిపారు. భారత్‌లోని కుటుంబాల్లో అబ్బాయి ఎక్కువనీ, అమ్మాయి అంటే తక్కువనే దృష్టి ఉండటం కూడా రేప్‌లకు ఓ కారణమని అన్నారు. జైల్లో ఉన్న రేపిస్టుల మాటలు వింటే.. వారు అనుభవిస్తున్న క్షోభ ఎవరూ అనుభవించకూడదని అనుకుంటామని చెప్పారు.



తాను ఇంటర్వ్యూ చేసిన వారిలో కొంతమందికి అసలు 'రేప్‌' అనే పదానికి అర్థం ఏంటో తెలియదని తెలిపారు. భారతీయ పాఠశాలల్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ లేకపోవడం కూడా అత్యాచారాలకు ఓ కారణమని చెప్పారు. 'సెక్స్‌ ఎడ్యుకేషన్‌' సబ్జెక్టును సిలబస్‌లో చేరిస్తే అది పిల్లల్ని పాడు చేస్తుందని, సంప్రదాయాలను దెబ్బతీస్తుందనే అపనమ్మకం మన రాజకీయ నాయకుల్లో వేళ్లూనుకుని ఉందని అన్నారు. తన పరిశోధన త్వరలో ప్రచురితం కాబోతోందని తెలిపారు. అయితే, కొందరు తనను సరికొత్త ఫెమినిస్టుగా భావిస్తూ.. పరిశోధన విడుదలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top