రాజీనామా విషంలో వెనక్కి తగ్గడు : వీరప్ప మొయిలీ

Several Congress Leaders Resign In Support Of Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ : అధ్యక్ష పదవికి రాజీనామాపై పట్టువీడని రాహుల్‌ గాంధీకి నచ్చజెప్పేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ రాహుల్‌ మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు పీసీ చాకో, షీలా దీక్షిత్‌, కేసీ వేణుగోపాల్‌, అజ‌య్‌ మాకెన్‌, జేపీ అగర్వాల్‌, మహాబల్‌ మిశ్రా, అర్విందర్‌ లవ్లీ తదితరులు కలిసి శుక్రవారం మరోసారి రాహుల్‌ నివాసానికి వెళ్లారు. రాజీనామా అంశంపై రాహుల్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే వివేక్ తంఖా పార్టీ లా, ఆర్టీఐ సెల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.

మరోవైపు.. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ.. పార్టీ యువజన విభాగం నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇందులో భాగంగా.. నేడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాహుల్‌ నివాసం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అనంతరం వీరంతా రాహుల్‌ను కలిసి రాజీనామా వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమైంది. ఆ భేటీలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్‌ గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేదంటున్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ. తొలిసారి రాహుల్‌ గాంధీ రాజీనామ అంశంపై మీడియాతో మాట్లాడారు మొయిలీ. రాజీనామా విషయంలో రాహుల్‌ గాంధీ వెనక్కి తగ్గేలా లేరన్నారు. ఇక మీదట ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేదన్నారు. త్వరలోనే రాహుల్‌ రాజీనామా అంశంలో సీడబ్ల్యూసీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. లేదంటే ఇలాంటి ఊహాగానాలు పెరుగుతాయని తెలిపారు. అయితే రాహుల్‌ రాజీనామాను ఆమోదించేలోపే ఆ పదవికి మరో వ్యక్తిని ఎన్నుకుంటారన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top