ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

seven maoists killed in chhattisgarh encounter - Sakshi

ఏడుగురు మావోల మృతి

ఓ జవానుకు గాయాలు

రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో ఘటన

సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని షెర్పర్‌–సీతాగోటా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతులను దారెకాస ఏరియా కమిటీ కార్యదర్శి సుఖ్‌దేవ్, అతని భార్య, ఏరియా కమిటీ సభ్యురాలు ప్రమీల, సీమా, మీనా, రితేష్, లలిత, శిల్పలుగా గుర్తించారు. మావోల కాల్పుల్లో ఆశారామ్‌ అనే జవానుకు గాయాలయ్యాయి. ప్రస్తుతానికి అతనికి ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు వెల్లడించారు. జూలై 28 నుంచి ఈ నెల 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలునిర్వహించిన నేపథ్యంలో పోలీసు బలగాలు దండకారణ్యంలో భారీ కూంబింగ్‌ చేపట్టాయి.

ఈ క్రమంలో రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో డీఆర్‌జీ (డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్స్‌) బలగాలు కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టు దళం ఎదురుపడింది. ఈ క్రమంలో బలగాలకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిపిన అనంతరం మావోలు అడవుల్లోకి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ డీఎం అవస్థి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఏకే 47, 303 రైఫిల్, కార్బన్‌ గన్, 12 బోర్‌ గన్‌లు ఉన్నాయి. మావోలను హతమార్చడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ ప్రశంసించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top