జమ్మూ కశ్మీర్‌లో నిషేధాజ్ఞలపై నేడు సుప్రీంలో విచారణ

SC To Hear Plea Against Regressive Measures In Kashmir - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో నిషేధాజ్ఞలు ఇతర అణిచివేత చర్యలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించనుంది. కాంగ్రెస్‌ కార్యకర్త తెహిసిన్‌ పూనావాలా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగితో కూడిన సుప్రీం బెంచ్‌ విచారణ చేపట్టనుంది. జమ్మూ కశ్మీర్‌లో కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు, ముందస్తు అరెస్ట్‌లు, ఫోన్‌ లైన్‌ల తొలగింపు, ఇంటర్‌నెట్‌ సర్వీసుల నిలిపివేత, విద్యా వైద్య సేవలకు అంతరాయం వంటి సమస్యలతో ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయని పిటిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

మరోవైపు ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం రాష్ట్రంలో పనిచేసే వర్కింగ్‌ జర్నలిస్టులపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరుతూ కశ్మీర్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అనురాధ బాసిన్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ కూడా సర్వోన్నత న్యాయస్ధానంలో తక్షణ విచారణకు ముందుకు రావచ్చని భావిస్తున్నారు. నిరవధిక కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు, అరెస్టులు, ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేతకు జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే కొట్టివేయాలని పిటిషనర్‌ కోరారు. కాగా జమ్మూ కశ్మీర్‌ రాజ్యాంగ హోదాలో మార్పులు చేపట్టడం ప్రజల అభిమతానికి విరుద్ధంగా వారి హక్కులను లాక్కోవడమేనని ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సైతం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top