‘పోలవరం’ కేసులోభాగస్వామిగా తెలంగాణ

SC agrees to impleed Telangana in Polavaram case - Sakshi

ఒడిశా విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అనుమతి

ఛత్తీస్‌గఢ్‌ కూడా ఇంప్లీడ్‌.. తెలంగాణ చేరికపై ఏపీ అభ్యంతరం

తదుపరి దశలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చన్న ధర్మాసనం

కౌంటర్‌ దాఖలు చేయనందుకు కేంద్రంపై ఆగ్రహం

రూ. 25 వేల జరిమానా.. 2 వారాల్లోగా దాఖలు చేయాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ గతంలో ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌ విచారణలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు భాగస్వాములుగా ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. మంగళవారం ఈ మేరకు జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో కౌంటర్‌ దాఖలు చేయలేదన్న కారణంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.25 వేల జరిమానా విధించింది. పోలవరం నిర్మాణానికి అభ్యంతరం చెబుతూ 2007లో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒరిజినల్‌ సూట్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌ విచారణలో ఉంది. 2015లో మరో రెండు మధ్యంతర దరఖాస్తులను ఒడిషా ప్రభుత్వం దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఇందుకు సంబంధించి తమ ప్రధాన పిటిషన్‌లో సవరణలకు అవకాశం కల్పించాలని కోరుతూ ఒక దరఖాస్తును, తమ అభ్యంతరాలకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నందున ఈ విచారణలో వారిని భాగస్వాములను చేయాలని మరో దరఖాస్తును దాఖలు చేసింది.

ఈ దరఖాస్తులను 2016 సెప్టెంబరు 30న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఒడిషా వాదనపై తమ వైఖరి తెలపాలంటూ ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లు ఈ కేసులో తమను భాగస్వాములుగా చేర్చితే అభ్యంతరం లేదని పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేశాయి. కానీ కేంద్రం తన వైఖరిని వెల్లడించలేదు.

మాకూ భాగస్వామ్యం ఉంది..
గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో తాము భాగస్వామిగా ఉన్నామని కోర్టుకు తెలంగాణ నివేదించింది. పోలవరం గోదావరి బేసిన్‌లోనే ఉన్నప్పటికీ.. గోదావరి, కృష్ణా జలాలపై బచావత్‌ అవార్డుల ప్రకారం పోలవరం ప్రాజెక్టు కృష్ణా బేసిన్‌పై కూడా ప్రభావం చూపుతుందని వివరించింది. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న 80 టీఎంసీల జలాల్లో తెలంగాణకు వాటా ఉందని తెలిపింది. తెలంగాణకు చెందిన దాదాపు 100 గ్రామాలు ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు కలిగే ఇబ్బందులను పరిష్కరించాలని కోరింది. అసలు ఎంత విస్తీర్ణంలో ముప్పు ఉంటుందో తెలియాల్సిన అవసరం ఉందని అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది. అందువల్ల కేసులో భాగస్వామిగా చేరేందుకు అభ్యంతరం లేదని, ఒడిషా విన్నపం మేరకు తమను భాగస్వామిగా చేయాలని కోరింది.

అభ్యంతరం తెలిపిన ఏపీ
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున న్యాయవాది గుంటూరు ప్రమోద్‌ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ఈ కేసులో భాగస్వామి కావడంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేశామని తెలిపారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడమే కాకుండా, తెలంగాణ నుంచి అన్ని అనుమతులు వచ్చినట్టేనని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం చెప్పినందున ఇక ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు సంబంధం లేదని నివేదించారు. అయితే ధర్మాసనం తెలంగాణను, ఛత్తీస్‌గఢ్‌ను ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యేందుకు అనుమతించింది. తదుపరి దశలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చని పేర్కొంది. మరోవైపు గతంలో ఇచ్చిన నోటీసులకు కేంద్రం స్పందించనందుకు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదంటూ కేంద్రం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది అజిత్‌ కుమార్‌ను ప్రశ్నించింది. కౌంటర్‌ దాఖలు చేయనందుకు రూ.25 వేల జరిమానా విధించింది. రెండు వారాల్లోగా దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాగా ఈ విచారణలో తమను భాగస్వాములను చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు గతంలో మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు ఇదివరకే సమ్మతించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top