
కరెంటు పోతోందని కాల్పులు జరిపాడు
వరుస కరెంట్ కోతలపై ఓ మెజిస్ట్రేట్‌కు తీవ్ర కోపం వచ్చింది.
గుర్‌గావ్(హర్యానా): వరుస కరెంట్ కోతలపై ఓ మెజిస్ట్రేట్‌కు తీవ్ర కోపం వచ్చింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బందిపై తుపాకీతో కాల్పులు దిగాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే హర్యానాలోని గుర్‌గావ్ నగరంలోని సివిల్‌లైన్స్‌లో ఉండే రిటైర్డ్ మెజిస్ట్రేట్ ఏకే రాఘవ్ నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డు సిబ్బంది, ఆయన ఇంటి సమీపంలో విద్యుత్ లైన్లకు మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. దీంతో తరచూ విద్యుత్ కోత విధిస్తున్నారు.
దీంతో విసుగెత్తిన రాఘవ్ తన వద్ద ఉన్న తుపాకీతో ముందుగా గాలిలోకి, ఆతర్వాత విద్యుత్ సిబ్బందిపైకి నాలుగు రౌండ్లు కాల్చారు. ఈ కాల్పుల కారణంగా సిబ్బందికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. సమీపంలోని ట్రాక్టర్ ట్రాలీ టైర్లకు కొన్ని బుల్లెట్లు తగిలాయని ఏసీపీ(క్రైం) మనీష్ సెహ్‌గల్ తెలిపారు. ఇందుకు పాల్పడిన రాఘవ్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటన సమయంలో అక్కడ పది మంది వరకు విద్యుత్ సిబ్బంది ఉన్నారని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర నవీన్ శర్మ తెలిపారు. సంఘటన జరిగిన ఏరియాలో పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నివాసాలు కూడా ఉన్నాయని, అక్కడ ఎటువంటి విద్యుత్ అంతరాయం లేదని వివరించారు.