నిజం చెబితే మీడియాపై వేటే!

Resignations of two journalists at ABP News cause disquiet in newsrooms - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ మిలిండ్‌ ఖండేకర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజు అంటే, గురువారం నాడు ఆయన తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి కూడా రాజీనామా చేశారు. మరో జర్నలిస్ట్‌ అభిసర్‌ శర్మ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. వాటి రాజీనామాలకు కారణాలేమిటో వారు వివరించడానికి ఇష్టపడలేదు.  కానీ అదే ఏబీపీ సంస్థ న్యూస్‌ నెట్‌వర్క్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అవినాశ్‌ పాండే అందుకు దారితీసిన పరిస్థితుల గురించి ‘ఎక్స్ఛేంజ్‌4మీడియా’కు వివరించారు. మేనేజింగ్‌ ఎడిటర్‌గా ఆయన అందించిన సేవలు ఎనలేనివని, సంస్థ ఎదగడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని, ఆయన లాంటి వ్యక్తితో ఇంతకాలం పనిచేసినందుకు గర్వంగా ఉందని అవినాశ్‌ పాండే వ్యాఖ్యానించారు. ‘14 ఏళ్ల, ఎనిమిది రోజులు మీతో ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేనేజింగ్‌ ఎడిటర్‌గా ఇక్కడ ఇదే నాకు ఆఖరి రోజు. నా మీడియా ప్రయాణంలో నాతో కలిసి నడిచినందుకు మీకు కృతజ్ఞతలు’ అని మిలిండ్‌ ఖండేకర్‌ తోటి జర్నలిస్టులనుద్దేశించి ట్వీట్‌ చేశారు.

ఖండేకర్‌ తోటి జర్నలిస్ట్‌ పుణ్య ప్రసూన్‌ బాజ్‌పేయి ఏబీపీ టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ‘మాస్టర్‌ స్ట్రోక్‌’ పేరిట షోను నిర్వహించేవారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షించేవారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్‌ 20వ తేదీన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల గురించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లభ్దిదారులతో ముచ్చటించారు. ఆ సమీక్షలో భాగంగా చత్తీస్‌గఢ్‌ నుంచి చంద్రమణి కౌషిక్‌ను మోదీ ఓ ప్రశ్న అడగ్గా, తాను వరి పంటకు బదులుగా సీతాఫలాల తోటను సాగు చేయడం వల్ల తన ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. అది అబద్ధమని, ఆమెతోని అలా చెప్పించారని ‘మాస్టర్‌ స్ట్రోక్‌’ కార్యక్రమంలో విమర్శించారు.

‘మోదీ గారు మీరు ఎప్పుడు మీ మనసులోని మాటను మాకు వినిపిస్తారు. ఓసారి మా మనసులోని మాటను కూడా మీరు వినండి’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏబీపీ మాస్టర్‌ స్ట్రోక్‌ కార్యక్రమం వీడియో క్లిప్‌ను ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌ అవడంతో బీజేపీ నాయకులకు కోపం వచ్చింది. కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి, రాజవర్ధన్‌ రాథోడ్, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ లాంటి ప్రముఖులు సహా పలువురు నాయకులు అది ‘ఫేక్‌ న్యూస్‌’ అంటూ గొడవ చేశారు. నరేంద్ర మోదీ వ్యతిరేక ఎజెండా ప్రకారం జర్నలిస్టులు పనిచేస్తున్నారంటూ వారంతా విమర్శించారు. దాంతో ఏబీపీ ¯ð ట్‌వర్క్‌ తన రిపోర్టర్‌ను చత్తీస్‌గఢ్‌లోని చంద్రమణి వద్దకు పంపించింది. ఆ రిపోర్టర్‌ ఆమెను ఇంటర్వ్యూను చేశారు. ఇందులో తన తప్పేమి లేదని, అధికారులు ఎలా చెప్పమంటే అలా చెప్పానని చెప్పారు.

‘ఇదిగో పూజ్యనీయులైన మంత్రులారా! నకిలీ వార్తంటూ మాపై అభాండం వేసిన మీకు ఇదే మా సరైన సమాధానం అంటూ చంద్రమణి ఇంటర్వ్యూను’ ఏబీపీ ఛానల్‌ ప్రసారం చేసింది. అంతే ఆ రోజు నుంచి ఆ చానెల్‌ను బీజేపీ నాయకులు బహిష్కరించడమే కాకుండా ‘మాస్టర్‌ స్ట్రోక్‌’ కార్యక్రమం ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారు. ఈవిషయమై ఛానెల్‌ నిర్వాహకులు ‘టాటా స్కై’ని సంప్రతించగా, బ్రాడ్‌ క్యాస్టరే నిలిపివేస్తున్నట్లు తెల్సింది. ఇలా నచ్చని కార్యక్రమాలను అడ్డుకోవడం బీజేపీ, ఆరెస్సెస్‌కు కొత్తేమి కాదు.
ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు గోవింద్‌ నిహ్లాని తీసిన సంచలన టెలివిజన్‌ సీరియల్‌ ‘తమస్‌’ దూరదర్శన్‌లో ప్రసారం అవుతున్నప్పుడు వివిధ పద్ధతుల్లో దాన్ని అడ్డుకునేందుకు ఆరెస్సెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. కేబుల్‌ ఆపరేటర్లను బెదిరించి ఆ సీరియల్‌ ప్రసారానికి అడ్డు పడేవారు. కొన్ని కాలనీల్లో ఫీజులు తీసి కరెంట్‌ సరఫరా నిలిపేసేవారు. అప్పటి ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం జర్నలిజం పట్ల నిబద్ధతతో నిజం చెప్పినందుకు ఉద్యోగాలు పోతున్నాయి. వాస్తవం మాట్లాడినందుకే ఈ అణచివేత చర్యలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రందీప్‌ సింగ్‌ సుర్జేవాల్‌ ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top