చంద్రయాన్‌–2కు చంద్రుడి కక్ష్య దూరం తగ్గింపు

Reduction of the Moon orbital distance to Chandrayaan-2 - Sakshi

విజయవంతంగా రెండో విడత తగ్గించిన ఇస్రో శాస్త్రవేత్తలు

సూళ్లూరుపేట: చంద్రయాన్‌–2కు మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటలకు చంద్రుడి కక్ష్య (లూనార్‌ ఆర్బిట్‌)లో రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు. బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న మిషన్‌ ఆపరేటర్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు విజయవంతంగా ఈ ప్రక్రియను నిర్వహించారు.

చంద్రయాన్‌–2 మిషన్‌ను మంగళవారం చంద్రుడి కక్ష్యలో చంద్రుడికి దగ్గరగా 114 కి.మీ., దూరంగా 18,072 కి.మీ. ఎత్తులో మొదటి విడత ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటలకు 1228 సెకన్లపాటు ఆర్బిటర్‌లో నింపిన ఇంధనాన్ని మండించి చంద్రుడి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. లూనార్‌ ఆర్బిట్‌ మొదటి విడతలో చంద్రుడికి దగ్గరగా ఉన్న 114 కి.మీ. దూరాన్ని 118 కి.మీ.కు స్వల్పంగా పెంచారు.

చంద్రుడికి దూరంగా 18,072 కి.మీ. దూరాన్ని భారీగా తగ్గిస్తూ 4,412 కి.మీ. ఎత్తులోకి తీసుకొచ్చే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. చంద్రయాన్‌–2 మిషన్‌ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతే, లూనార్‌ ఆర్బిట్‌లో ప్రవేశించాక కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ రావడం ఈ ప్రయోగంలో విశేషం. మిషన్‌ చంద్రుడికి దగ్గరగా 30 కి.మీ., దూరంగా 100 కి.మీ. చేరుకోవడం కోసం దూరాన్ని తగ్గించేందుకు మరో రెండుసార్లు ఆపరేషన్‌ చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.

ఈ నెల 28న ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్యలో చంద్రుడి కక్ష్య దూరాన్ని మూడోసారి తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకు ఇటు భూమధ్యంతర కక్ష్యలో, అటు చంద్రుడి కక్ష్య (లూనార్‌ ఆర్బిట్‌)లో చంద్రయాన్‌–2 మిషన్‌లోని అన్ని వ్యవస్థలు ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top