‘ఒక్క రాత్రిలో ఎన్నిసార్లు జరిగిందేమిటి..?’

Rape Survivor Faces Uncomfortable Questions From A Delhi Police Officer - Sakshi

‘ఒక్క రాత్రిలో ఎన్నిసార్లు జరిగిందేమిటి. ఇదంతా ఒక్కడి పనేనా లేదా అతడితో పాటు గ్యాంగ్‌ కూడా ఉందా. ఈ విషయాలు సరే.. అసలు నీకు పెళ్లి చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా. అయినా ఆ ఆలోచనే ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదులే. అంతేకదా....’  అత్యాచార బాధితురాలితో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ జరిపిన సంభాషణ ఇది.

సాక్షి, న్యూఢిల్లీ : ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా’ అంటూ స్త్రీలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన కర్మభూమి మనది. కానీ నేడు అదే కర్మభూమి మహిళలకు అత్యంత ప్రమాదకరమైనదిగా పరిణమించడం నిజంగా సిగ్గుచేటు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి, హింసలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని ఇటీవలే ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమీప బంధువులు, బాగా తెలిసిన వ్యక్తులే దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోన్న అంశం. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏమిటంటే.. అత్యాచారానికి గురైన వారిని బాధితులుగా కాకుండా ఏదో తప్పు చేసిన వ్యక్తులుగా చిత్రీకరించి వారిని మరింతగా కుంగదీయడం సమాజంతో పాటు పోలీసులకు సర్వసాధారణమైపోయింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి శిక్ష పడేలా చేసేందుకు 18 ఏళ్ల యువతి పడుతోన్న మానసిక సంఘర్షణ చూస్తే కళ్లు చెమర్చక మానవు.

ఢిల్లీకి చెందిన ప్రతిభ(గోప్యత కోసం పేరు మార్చాం) అందరు అమ్మాయిల్లాగే తల్లిదండ్రులతో ఎంతో ఆనందంగా జీవితం గడిపేది. పొరుగింటి పిల్లలతో, స్నేహితులతో ఆటలాడుకునేది. కానీ ఇదంతా రెండేళ్ల క్రితం వరకే. ఆమెను ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రులకు కూడా ఒక్కోసారి ఆమెను అనుమానంగా చూస్తూండటంతో రెండేళ్లుగా బేస్‌మెంట్‌లోని ఓ చీకటి గదిలోనే జీవితాన్ని గడుపుతోంది. ఆమె జీవితం ఇంత దుర్భరంగా కావడానికి కారణం తనకు పరిచయం ఉన్న, పొరుగింటి వ్యక్తే. ప్రతిభపై కన్నేసిన ఆ కామాంధుడు.. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో ఆమెను వెంబడించి కిడ్నాప్‌ చేశాడు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఢిల్లీ వీధుల్లోని తన ఇంటి సమీపంలో గల రోడ్డుపై విసిరేశాడు. దారిన వెళ్లేవారు చూసి సమాచారమివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

నీ ప్రమేయం కూడా ఉందా..?
ఈ ఘటన జరిగి రెండేళ్లు అయినా ప్రతిభకు న్యాయం జరగలేదు సరికదా.. వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలతో పాటు విచారణ పేరుతో పోలీసులు అడిగే ప్రశ్నలు ఆమెకు మనశ్శాంతిని దూరం చేశాయి. ముఖ్యంగా ఈ కేసులో విచారణ అధికారులు మాటి మాటికీ మారుతుండటం ఆమెకు పెద్ద సమస్యగా పరిణమించింది. ఒకసారి ఓ అధికారి అయితే..  ఆమెను ఓ చీకటి గదిలో ఉంచి.. ‘ నువ్వు ఆ వ్యక్తితో పారిపోవడానికి సిద్ధపడితేనే ఇలా జరిగిందటగా’  అని అడగడటంతో ఆమె తల్లిదండ్రులకు సైతం అనుమానం కలిగింది. వారు కూడా అలాగే మాట్లాడటంతో ప్రతిభ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ తనపై దాడికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడేలా చేసేందుకైనా బతకాలని భావించింది. అందుకే ఎవరెన్ని విధాలుగా వేధించినా చలించకుండా సమాధానమివ్వడం అలవాటు చేసుకుంది. నిర్భయ నిందితులకు ఉరిశిక్షే సరి అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆమెలో ఆత్మస్థైర్యాన్ని మరింతగా పెంచిందని చెబుతోంది.

విచారణలో భాగంగానే..
ప్రతిభ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై విమర్శలు రావడంతో.. విచారణలో భాగంగానే ఇలా చేస్తున్నామంటూ వారు వివరణ ఇచ్చారు. నిజనిజాలు రాబట్టాలంటే అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంటుందని... అందరిలాగే ఆమెను కూడా విచారిస్తున్నామంటూ తెలిపారు. కొన్ని నకిలీ కేసులు కూడా నమోదవుతాయని అందుకే కాస్త కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే నిజమైన బాధితులను కూడా ఇలా విచారణ పేరుతో ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు.

భారత్‌లో మహిళల పరిస్థితి ఇదీ...
మహిళలపై జరుగుతున్న లైంగిక హింసలో భారత్‌ ప్రథమ స్థానంలో ఉందని థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యాచారాలు, వేధింపులు, అక్రమ రవాణా, సెక్స్‌ బానిసలుగా మార్చడం, బలవంతపు, బాల్య వివాహాలు, వెట్టిచాకిరీ, భ్రూణ హత్యలు, మహిళల పట్ల అనుసరిస్తున్న అమానవీయమైన సంప్రదాయ పద్ధతులు వంటి అంశాల్లో మహిళలకు భారత్‌ చాలా ప్రమాదకరంగా మారిందని సర్వే తేల్చింది.

నిరంతరం యుద్ధంతో అతలాకుతలమయ్యే అఫ్గానిస్తాన్, సిరియాల్లో కంటే మన దేశంలో మహిళలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సర్వే పేర్కొందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సంస్థ 2011 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. ఈ సారి ఏకంగా మొదటి స్థానానికి చేరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

గంటకి నాలుగు అత్యాచారాలు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన తర్వాతనైనా పరిస్థితులు మారతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. నిర్భయ చట్టం తీసుకువచ్చినప్పటికీ మహిళలపై నేరాలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు.

జాతీయ నేర గణాంకాల సంస్థ ప్రకారం
    ప్రతీ గంటకి నలుగురు మహిళలపై అత్యాచారం
    ప్రతీ గంటలో మహిళలపై 26 నేరాలు
    ప్రతీ రోజూ వందకి పైగా లైంగిక దాడి కేసులు నమోదు
    గంటకి అయిదుగురు మహిళల ప్రసూతి మరణాలు
    ప్రతీ రోజూ 21 వరకట్న మరణాలు
    ఏడాదికి 34,651 అత్యాచార కేసులు నమోదు
    మహిళలపై ఏడాదికి నమోదవుతున్న నేరాల సంఖ్య 3,27,394
    దేశంలో మహిళలపై జరిగే మొత్తం నేరాల్లో ఢిల్లీ వాటా 52%
    2007–16 మధ్య కాలంలో మహిళలపై నేరాల్లో పెరుగుదల 83%
    ఇందులో మరణాలే ఎక్కువగా ఉన్నాయి.

- సుష్మారెడ్డి యాళ్ల, వెబ్‌ డెస్క్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top