రాజ్యసభ సీటుకు 100 కోట్లు!: ఎంపీ బీరేందర్

రాజ్యసభ సీటుకు 100 కోట్లు!: ఎంపీ బీరేందర్ - Sakshi


జింద్/చండీగఢ్: రాజ్యసభ సీటు కోసం కొందరు రూ.100 కోట్ల దాకా చెల్లిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు చౌధరీ బీరేందర్ సింగ్ అన్నారు. ఆ సీటు కోసం డబ్బులు వెదజల్లిన 20 మంది పేర్లు తనకు తెలుసని, కావాలంటే వారి పేర్లు చెబుతానని అన్నారు. ఎంపీ కావడానికి  దాదాపు రూ.100 కోట్లు చెల్లించానని ఓ రాజ్యసభ ఎంపీ తనకు స్వయంగా చెప్పారన్నారు. ఆదివారం హర్యానాలోని జింద్‌లో జరిగిన ర్యాలీలో బీరేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్యసభ ఎంపీ  కావడానికి తన వద్ద వంద కోట్లు ఉన్నాయని కొన్నాళ్ల కిందట ఒక వ్యక్తి నాతో అన్నారు. తర్వాత ఆయన ఖర్చు లెక్కలు వేసుకుని రూ.80 కోట్లతోనే పని అయిపోయిందని, మిగతా రూ.20 కోట్లు ఆదా అయ్యాయని అన్నారు. రూ.80 కోట్లు లేదా రూ.100 కోట్లతో రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న వ్యక్తి పేదల గురించి ఏమాలోచిస్తారో మీరే ఆలోచించండి.. డబ్బుతో సీట్లు కొనుక్కుని రాజ్యసభలో తిష్టవేసిన వారు అక్కడి బేరసారాల్లో భాగమవుతున్నారు’అని అన్నారు. ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్.. బీరేందర్‌పై, కాంగ్రెస్‌పై విమర్శలు సంధించారు.

 

 బీరేందర్ తన ఉదాహరణ గురించే చెప్పారన్నారు. కాంగ్రెస్ బేరాలు కుదర్చుకుంటూ రాజకీయాలను అధమస్థాయికి దిగజారుస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటోందని బీరేందర్ చెప్పకనే చెప్పారన్నారు. బీరేందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తన వైఖరేమిటో తెలపాలని హర్యానా విపక్షం ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్‌సింగ్ చౌతాలా డిమాండ్ చేశారు. ఎంత మంది ఎంపీలు తమ పదవుల కోసం డబ్బులు ఇచ్చారో వెల్లడించాలన్నారు. తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో బీరేందర్ వెనక్కి తగ్గారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. ధనవంతులు  లోక్‌సభ, రాజ్యసభల్లోకి రావడం ఇటీవల పెరిగిందని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 360 మంది అభ్యర్థులు కోటీశ్వరులని ఓ పత్రిక వెల్లడించిన సమాచారాన్నే ప్రస్తావించానని చెప్పారు.  బాగా డబ్బున్న వాళ్లు కష్టపడకుండానే రాజ్యసభలోకి అడుగుపెడుతున్నారన్నారు. ఇటీవలి వరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీరేందర్‌కు గత కేంద్ర కేబినెట్ విస్తరణలో మంత్రిపదవి దక్కుతుందని వార్తలు వ చ్చినా చివరి నిమిషంలో ఆయన పేరును తప్పించారు.



రాజ్యసభ, rajya sabha, కాంగ్రెస్, congress, బీజేపీ,  BJP,  ప్రకాశ్ జవదేకర్, Prakash Devkar , చండీగఢ్, chandigarh

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top